లక్షల కోట్లు సేల్‌కు పెడితే.. వచ్చింది వేల కోట్లే

లక్షల కోట్లు సేల్‌కు పెడితే.. వచ్చింది వేల కోట్లే
  • స్పెక్ట్రమ్ వేలంతో సర్కారుకు అనుకున్నంత రాలే!
  • సేల్‌కు రూ.3.97 లక్షల కోట్ల స్పెక్ట్రమ్ .. వచ్చింది రూ.77 వేల కోట్లే
  • 2015 లో రూ. లక్ష కోట్లకు పైనే సేకరించిన ప్రభుత్వం
  • అమ్ముడుకాని 700 మెగాహెడ్జ్ బ్యాండ్‌‌

న్యూఢిల్లీ: రెండు రోజుల 4జీ స్పెక్ట్రమ్‌‌ వేలంలో రూ. 77,800 కోట్లను మాత్రమే ప్రభుత్వం సేకరించగలిగింది. టెలికాం కంపెనీలు రెండో రోజు వేలంలో యాక్టివ్‌‌గా పార్టిసిపేట్‌‌ చేయలేదు. వివిధ బ్యాండ్‌‌లకు చెందిన మొత్తం 2,308 మెగాహెడ్జ్‌‌(ఎంహెచ్‌‌జెడ్‌‌) స్పెక్ట్రమ్‌‌ను అమ్మడం ద్వారా రూ. 3.92 లక్షల కోట్లను సేకరించాలని ప్రభుత్వం ప్లాన్స్ వేసుకుంది. కానీ, ఇందులో రూ. 2 లక్షల కోట్ల విలువైన 700 ఎంహెచ్‌‌జెడ్‌‌ను కొనడానికి ఏ కంపెనీ కూడా బిడ్స్ వేయలేదు. 2016 లో తెచ్చిన ధర కంటే 43 శాతం తగ్గించి ఈ బ్యాండ్‌‌ను అమ్మకానికి పెట్టినా టెలికాం కంపెనీలు ఆసక్తి చూపలేదు. 2,500 ఎంహెచ్‌‌జెడ్‌‌ బ్యాండ్‌‌కి చెందిన స్పెక్ట్రమ్‌‌ కూడా అమ్ముడు కాలేదు. మొత్తం ఆరు రౌండ్లలో జరిగిన ఈ వేలంలో రిలయన్స్ జియో, భారతీఎయిర్‌‌‌‌టెల్‌‌, వొడాఫోన్‌‌ ఐడియా(వి) లు పాల్గొన్నాయి. కాగా,  2015 లో జరిగిన టెలికాం వేలంలో ఏడు కంపెనీలు పార్టిసిపేట్ చేయడం విశేషం. అప్పుడు ప్రభుత్వం రూ. 1,13,932 కోట్లను సేకరించింది. అంచనావేసిన దానికంటే ఎక్కువ బిడ్స్‌‌ వచ్చాయని  కమ్యూనికేషన్‌‌ అండ్‌‌ ఐటీ మినిస్టర్‌‌‌‌ రవిశంకర్ ప్రసాద్‌‌ అన్నారు.  700, 800, 900, 1,800, 2,100, 2,300,2,500 మెగాహెడ్జ్ బ్యాండ్స్‌‌కు చెందిన స్పెక్ట్రమ్‌‌ను ప్రభుత్వం వేలం వేసింది. 700, 800, 900 మెగాహెడ్జ్ బ్యాండ్‌‌లకు చెందిన స్పెక్ట్రమ్‌‌ను కొన్న కంపెనీలు 25 శాతం మనీని ముందుగానే పే చేయాల్సి ఉంటుంది. మిగిలిన బ్యాండ్‌‌ స్పెక్ట్రమ్‌‌ను కొన్న కంపెనీలు 50 శాతం అమౌంట్‌‌ను ముందుగానే పే చేయాలి. మిగిలిన అమౌంట్‌‌ను 16 ఇన్‌‌స్టాల్‌‌మెంట్లలో చెల్లించాలి. 20 ఏళ్ల వరకు ఈ స్పెక్ట్రమ్‌‌ను కంపెనీలు వాడుకోవచ్చు.

700, 2,500 ను పట్టించుకోలే..

700,2,500 మెగాహెడ్జ్‌‌ స్పెక్ట్రమ్‌‌కు ఎటువంటి బిడ్స్‌‌ రాలేదని ప్రసాద్‌‌ పేర్కొన్నారు. ‘మొత్తం స్పెక్ట్రమ్‌‌ వేలానికి పెట్టగా మొదటి రోజు రూ. 77,146 కోట్ల విలువైన బిడ్స్‌‌ను పొందాం’ అని అన్నారు.   ‘అంచనావేసిన దానికంటే ఎక్కువగా బిడ్స్‌‌ వచ్చాయి. అయినప్పటికీ సేల్‌‌కు ఉంచిన మొత్తం స్పెక్ట్రమ్‌‌లో దీని వాటా చాలా తక్కువ. 700 ఎంహెచ్‌‌జెడ్‌‌ బ్యాండ్‌‌ రిజర్వ్డ్‌‌ ధర ఎక్కువగా ఉందనే ఆలోచనలో టెలికాం కంపెనీలున్నాయి. అందుకే విలువైన ఈ స్పెక్ట్రమ్‌‌ బ్యాండ్‌‌ను ఎవరూ కొనలేదు.  ఈ బ్యాండ్‌‌ అమ్ముడవ్వకపోతే రిజర్వ్డ్‌‌ ప్రైస్‌‌ను తగ్గించక తప్పదు. టెలికం కంపెనీలు కూడా అప్పటి వరకు వెయిట్‌‌ చేయాలని చూస్తున్నాయి’ అని టెలికాం ఎక్స్‌‌పర్ట్‌‌ మహేష్‌‌ ఉప్పల్‌‌ అన్నారు. జియో 800 ఎంహెచ్‌‌జెడ్‌‌ బ్యాండ్‌‌కు చెందిన స్పెక్ట్రమ్‌‌ కోసం ఎక్కువగా బిడ్స్ వేసింది.  చాలా సర్కిళ్లలో ఈ బ్యాండ్‌‌ లైసెన్స్‌‌ ఎక్స్‌‌పైర్‌‌‌‌ కానుంది. 2,300 ఎంహెచ్‌‌జెడ్‌‌ బ్యాండ్‌‌ కోసం టెలికాం కంపెనీలు ఎక్కువ ఆసక్తి చూపాయని మహేష్‌‌ అన్నారు.

జియో ఖర్చు 57 వేల కోట్లు..

మొత్తం 22 సర్కిళ్ల కోసం రూ. 57,122 కోట్లను జియో ఖర్చు చేసింది. 800, 1,800, 2,300 మెగాహెడ్జ్‌ బ్యాండ్‌కు చెందిన స్పెక్ట్రమ్‌ను కంపెనీ కొనుగోలు చేసింది. దీంతో 4జీ స్పెక్ట్రమ్‌ వేలంలో ఎక్కువ స్పెక్ట్రమ్‌ను కొన్న కంపెనీగా నిలిచింది. మరోవైపు రూ. 18,699 కోట్ల విలువైన  355.45 మెగా హెడ్జ్‌‌ స్పెక్ట్రమ్‌‌ను కొనుగోలు చేశామని రెగ్యులేటరీ ఫైలింగ్‌‌లో ఎయిర్‌‌‌‌టెల్ పేర్కొంది. గ్రామాలు, ఇండోర్‌‌‌‌ ప్రదేశాలలో కూడా 4జీ సేవలను మరింతగా మెరుగు పరచడానికి వేలంలో కొన్న స్పెక్ట్రమ్‌తో వీలుంటుందని తెలిపింది. అదనంగా 9 కోట్ల మంది కస్టమర్లకు 4జీ సేవలను ఆఫర్ చేయగలుగుతామని ఎయిర్​టెల్​ పేర్కొంది.  వొడాఫోన్‌ ఐడియా(వి) సుమారు రూ. 2,000 కోట్ల విలువైన స్పెక్ట్రమ్‌ను కొనుగోలు చేసింది.