హైదరాబాద్లో స్విచ్‌‌‌‌ రా స్టోర్ ప్రారంభం

 హైదరాబాద్లో స్విచ్‌‌‌‌ రా స్టోర్ ప్రారంభం

మెన్స్‌‌‌‌వేర్ బ్రాండ్‌‌‌‌  స్విచ్ రా  ఐదో స్టోర్‌‌‌‌ను తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌‌‌‌ బాబు హైదరాబాద్ మణికొండలో ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి సినీ నటుడు మంచు మనోజ్, మాజీ ఎంపీ మధు యాష్కీ గౌడ్ కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ, ప్రపంచ స్థాయి టెక్స్‌‌‌‌టైల్ వ్యాపారానికి హైదరాబాద్ వేదికగా మారుతోందని తెలిపారు. సంస్థ ఫౌండర్లలో ఒకరైన కల్లెం రాఘవేందర్ రెడ్డి మాట్లాడుతూ, వియత్నాం, టర్కీ నుంచి వచ్చిన వస్త్రాలను ఉపయోగించి ప్రపంచ స్థాయి డిజైన్లను తయారు చేస్తున్నామని చెప్పారు.  అందుబాటు ధరలకే వీటిని అందిస్తున్నామని చెప్పారు. 

హైబిజ్ హెల్త్ కేర్ మేనేజ్‌‌‌‌మెంట్ అవార్డ్స్

హెల్త్ కేర్ రంగంలో అసాధారణమైన సేవలు అందించిన వారిని గౌరవించేందుకు హైబిజ్ టీవీ ఆధ్వర్యంలో హెల్త్ కేర్ మేనేజ్‌‌‌‌మెంట్ అవార్డ్స్ 2025 మొదటి ఎడిషన్​ను హైదరాబాద్​లో గురువారం నిర్వహించింది. ఈ కార్యక్రమానికి తెలంగాణ హోమ్​శాఖ స్పెషల్ సెక్రటరీ సీవీ ఆనంద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వివిధ కేటగిరీల్లో 50కి పైగా అవార్డులు ప్రదానం చేశారు. డాక్టర్ హరి ప్రసాద్, డాక్టర్ కెఎన్ సుధా రమణలకు లెజెండరీ పురస్కారాలు, ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్‌‌‌‌లు అయిన డాక్టర్ ఎన్ వాణి, డాక్టర్ బీరప్ప నగరికి స్పెషల్ జ్యూరీ అవార్డులు అందజేశారు.

అమర రాజా బెటర్ వే అవార్డ్స్ 

అమర రాజా గ్రూప్ 'ది అమర రాజా బెటర్ వే అవార్డ్స్' మూడవ ఎడిషన్‌‌‌‌ను ప్రకటించింది. ఈ అవార్డులు ప్రత్యేకంగా దేశవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల ఎంట్రప్రెనార్లకు మద్దతు ఇవ్వడానికి రూపొందించారు. ఇందులో రూ. మూడు లక్షలు నగదు బహుమతి చొప్పున మూడు కేటగిరీలు ఉన్నాయి. మహిళా ఉపాధి, గ్రామీణ ఆదాయ ఉత్పత్తి, ఉత్తమ వ్యవసాయ ఆధారిత వ్యాపారం, వనరుల కొరత, మార్గదర్శకత్వం లేమి వంటి అడ్డంకులను ఎదుర్కొంటున్న ఎంట్రప్రెనార్లకు సాయం చేయడమే లక్ష్యం. దరఖాస్తులకు తుది గడువు నవంబర్ 20.