3 సార్లు ప్రపోజల్స్​ పంపినా స్పందించని సర్కార్

3 సార్లు ప్రపోజల్స్​ పంపినా స్పందించని సర్కార్

 

  • బల్దియా స్పోర్ట్స్ వింగ్​లో కోచ్​ల కొరత
  • 3 సార్లు ప్రపోజల్స్​ పంపినా స్పందించని సర్కార్
  • సిటీ గ్రౌండ్లలో ఎక్కడా రెగ్యులర్ ​కోచ్ లేరు
  • ఉన్న 77 మంది  పార్ట్​టైమ్​గా పని చేస్తున్న వారే
  • ప్రైవేట్​ సెంటర్లను ఆశ్రయిస్తున్న యువత 

హైదరాబాద్, వెలుగు: జీహెచ్ఎంసీ స్పోర్ట్స్ విభాగంలో కోచ్​ల కొరత తీవ్రమైంది. గ్రేటర్​ వ్యాప్తంగా మొత్తం 521 ప్లే గ్రౌండ్స్​ఉండగా ఇందులో 97చోట్ల 30 రకాల ఆటలకు బల్దియా ఆధ్వర్యంలో శిక్షణ ఇస్తున్నారు. అయితే ప్రభుత్వం రెగ్యులర్ కోచ్​లను నియమించకపోవడంతో ఆ ప్రభావం క్రీడాకారులపై పడుతోంది. సిటీ వ్యాప్తంగా ఉన్న గ్రౌండ్లలో కేవలం 77 మంది కోచ్​లు మాత్రమే ఉన్నారు. వీరంతా పార్ట్​టైం పద్ధతిలో పనిచేస్తున్నారు. క్రీడాకారుడు తయారుకావడంలో కోచింగ్ ఎంతో కీలకం. కానీ ప్రభుత్వం ఆ విషయాన్ని పట్టించుకోవడం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా క్రీడా మైదానాలు ఏర్పాటు చేస్తున్నాం.. యువతను ప్రోత్సహిస్తున్నామని చెబుతున్న మంత్రులు, ఎమ్మెల్యేలు రాజధాని లోని గ్రౌండ్లను పట్టించుకోవడం లేదు. 

దీంతో మెంబర్​షిప్ తీసుకున్న యువకులు ఎవరికి వారు వచ్చి ఆడుకొని వెళ్తున్నారు. నేషనల్, ఇంటర్​నేషనల్ క్రీడాకారులను స్ఫూర్తిగా తీసుకుని ఆటల్లో రాణించాలి అనుకుంటున్న వారి ఆశ నెరవేరడం లేదు. ఆడే సత్తా ఉన్నప్పటికీ గ్సౌండ్స్, సౌకర్యాల కొరతతో చాలా మంది వెలుగులోకి రావడం లేదు. ఉత్తమ క్రీడాకారులను తయారు చేయాల్సిన జీహెచ్‌‌‌‌‌‌‌‌ఎంసీ స్పోర్ట్స్​ విభాగం ఆ దిశగా అడుగులు వేయడం లేదు. కోచింగ్ ఇచ్చేందుకు వలంటీర్లను నియమిస్తున్నట్లు జీహెచ్ఎంసీ అధికారులు చెబుతున్నప్పటికీ ఆ విషయంపై క్లారిటీ లేదు. విక్టోరియా ప్లే గ్రౌండ్, అంబర్ పేట, మొఘల్​పురా వంటి గ్రౌండ్​లలో కోచ్​లు లేరని పలువురు కార్పొరేటర్లు ఇటీవల జరిగిన కౌన్సిల్​ మీటింగ్​లో నిలదీశారు.

కేటగిరీని బట్టి..
కోచ్​లు కావాలని జీహెచ్ఎంసీ అధికారులు రాష్ట్ర ప్రభుత్వానికి ఇప్పటికే మూడు సార్లు ప్రతిపాదనలు పంపినప్పటికీ ఎలాంటి స్పందన లేదు. 134 మంది రెగ్యులర్​ కోచ్​ల అవసరం ఉందని చెబుతున్నా పట్టించుకోవడం లేదు.   పార్ట్ టైమ్​ కోచ్​లు వివిధ కేటగిరీల కింద ఉదయం 6 గంటల నుంచి 9 వరకు, సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8 వరకు పనిచేస్తున్నారు. ఒక్కొక్కరికి కేటగిరీని బట్టి నెలకు  రూ.14వేలు, రూ.10,500, రూ.8,750 వేతనాలను బల్దియా అందిస్తోంది.

జోన్ల వారీగా..
ఎల్​బీనగర్ జోన్‌‌‌‌‌‌‌‌లో 69, ఖైరతాబాద్​లో 144, చార్మినార్​లో 101, శేరిలింగంపల్లిలో 56, కూకట్‌‌‌‌‌‌‌‌పల్లిలో 61, సికింద్రాబాద్​లో 90 ఇలా మొత్తం 521 గ్రౌండ్లు ఉన్నాయి. వీటిలో ఎల్​బీనగర్​లో 10, ఖైరతాబాద్ 20, చార్మినార్ 31, శేరిలింగంపల్లి, కూకట్‌‌‌‌‌‌‌‌పల్లి జోన్లలో 19, సికింద్రాబాద్ 17 మొత్తం 97 గ్రౌండ్లలో 30 రకాల క్రీడలకు జీహెచ్‌‌‌‌‌‌‌‌ఎంసీ శిక్షణ ఇస్తోంది. అయితే ఇన్‌‌‌‌‌‌‌‌స్పెక్టర్లు, పీసీసీల పేరుతో ఇన్​చార్జ్​లు ఉన్నారే తప్ప సిటీలో ఎక్కడా కూడా పర్మినెంట్ కోచ్‌‌‌‌‌‌‌‌లు లేరు. నేషనల్ గేమ్ హాకీ కోసం కేవలం నాలుగు గ్రౌండ్​లు మాత్రమే ఉన్నాయి. కబడ్డీకి కూడా 4 గ్రౌండ్​లు మాత్రమే ఉన్నాయి. బాక్సింగ్ రింగ్​ఊసే లేదు.