ఖాళీల లెక్క తేలుస్తలె

ఖాళీల లెక్క తేలుస్తలె
  • ఉద్యోగాల భర్తీ ఇప్పట్లో లేనట్టే
  • వెకెంట్ పోస్టుల లెక్క తీస్తున్నమని టీఆర్​ఎస్ ప్లీనరీలో ప్రకటన
  • నెలలో నోటిఫికేషన్లు వస్తాయన్న సీఎం మాట ఉత్తదే!
  • పోస్టులు నింపుతమని చెప్పవట్టి ఏడాదాయె
  • క్యాడర్​స్ట్రెంత్​పై రిపోర్టు పంపి నెలైనా అప్రూవ్ చేయలె
  • ఓకే చేస్తే పోస్టులను భర్తీ చేయాల్సి వస్తుందనే..
  • ఎలక్షన్లున్నప్పుడే ఉద్యోగాల మాట!

హైదరాబాద్, వెలుగు: ప్రభుత్వ ఉద్యోగాల భర్తీపై సర్కారు పూటకోమాట మారుస్తోంది. ఉద్యోగ ఖాళీల లెక్క ఇంకా తేలలేదని తాజాగా మళ్లోసారి వెల్లడించింది. ఉద్యోగుల సర్దుబాటుతో ఖాళీలేర్పడ్డాయని, ఆ వెకెంట్ పోస్టులపై స్పష్టత రావాల్సి ఉందని సోమవారం జరిగిన టీఆర్​ఎస్ పార్టీ ప్లీనరీలో ప్రకటించారు. దీంతో ఉద్యోగాల భర్తీ ఇప్పట్లో లేనట్టేనని తేలింది. నెల రోజుల్లోనే నోటిఫికేషన్లు వస్తాయని మొన్న అసెంబ్లీలో సీఎం కేసీఆర్ చేసిన ప్రకటన ఉత్తదేనని స్పష్టమైంది.  

క్యాడర్ ​స్ట్రెంత్ ​రిపోర్టును పంపినా..
ఉద్యోగాల భర్తీపై ప్రతిసారి లెక్కలు, మాటలు మారుస్తూ సర్కారు లేట్​ చేస్తుండటంపై విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రెసిడెన్షియల్ ఆర్డర్ రాకముందు ఖాళీల లెక్క తీయాలని మీటింగ్ లు పెట్టారు. తర్వాత కొత్త జోనల్ వ్యవస్థ వచ్చిందని చెప్పి మరింత లేట్​చేస్తూ వచ్చారు. ఇప్పుడు క్యాడర్ స్ర్టెంత్​ఫైనల్ చేయాలని సాకు చెప్తున్నరు. అయితే క్యాడర్​స్ర్టెంత్ లెక్క తేల్చే ప్రక్రియ మొదలై 3 నెలలవుతోంది. ఫైనాన్స్, జీఏడీ డిపార్ట్​మెంట్లు క్యాడర్ స్ర్టెంత్​పై రిపోర్టును తయారు చేసి సర్కారుకు పంపాయి. ఆ రిపోర్టు పంపి నెల కావొస్తున్నా సర్కారు ఇంకా అప్రూవల్ ఇవ్వలేదు. అది ఓకే చేశాక ఉద్యోగులకు కొత్త జిల్లాల వారీగా ప్లేస్ మార్చుకునేందుకు ఆప్షన్ ఇవ్వాలి. దానికి నెల పడుతుందని ఆఫీసర్లు అంటున్నారు. అది పూర్తయితే భర్తీకి సంబంధించి ప్రభుత్వంపై ఒత్తిడి మరింత పెరుగుతుందని, అందుకే లేట్​ చేస్తున్నట్టు విమర్శలు వస్తున్నాయి. బై ఎలక్షన్స్ టైంలో కావాలనే ఉద్యోగాల భర్తీని తెరపైకి తెస్తున్నారని, ఆ తర్వాత మరుగున పడేస్తున్నారని నిరుద్యోగులు మండిపడుతున్నారు.  

రాష్ట్రంలో కొత్త జోనల్ వ్యవస్థ ప్రకారం పోస్టుల వర్గీకరణ పూర్తయింది. ఉద్యోగాలను జిల్లా, జోనల్, మల్టీ జోనల్, రాష్ట్ర స్థాయి కేడర్లుగా మార్చారు. ప్రభుత్వ శాఖల్లో క్యాడర్ స్ట్రెంత్ పూర్తి చేశారు. ఆ ప్రకారం రాష్ట్రంలో మొత్తం 5 లక్షల 565 శాంక్షన్డ్​ ప్రభుత్వ ఉద్యోగాలున్నట్టు తేలింది. గవర్నమెంట్ ఇన్​స్టిట్యూషన్లలోని ఉద్యోగాలూ ఇందులోనే ఉన్నాయి. ఈ మేరకు సర్కారుకు ఫైనాన్స్​, జీఏడీ డిపార్ట్​మెంట్లు రిపోర్టును ఇప్పటికే అందజేశాయి. రాష్ట్రంలో గవర్నమెంట్ డిపార్ట్​మెంట్స్, ఇన్​స్టిట్యూషన్లలో కలిపి మొత్తం శాంక్షన్డ్ కేడర్ ​స్ర్టెంత్ 5,00,565. ఇందులో ఉద్యోగుల వర్కింగ్ స్ర్టెంత్ 3,38,514. ఈ లెక్కన పనిచేస్తున్న ఉద్యోగులు, మొత్తం శాంక్షన్డ్ కేడర్ స్ర్టెంత్ తీసిస్తే 1.62 లక్షల ఖాళీలున్నట్లు తెలుస్తోంది.

ఒక్క సంతకంతో రెగ్యులరైజ్ చేస్తానని..
తెలంగాణలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ అనే పదమే ఉండదని.. అంతా సర్కారు ఉద్యోగులే ఉంటారని గతంలో కేసీఆర్ ​ప్రకటించారు. రాష్ట్రం రాగానే ఒక్క సంతకంతో అందరినీ రెగ్యులర్ చేస్తామన్నారు. తాజాగా సర్కారు లెక్కల ప్రకారం రాష్ట్రంలో 1,70,338 మంది కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులున్నారు. రాష్ట్రం వచ్చాక ఇష్టారీతిలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్​లో ఉద్యోగులను నియమించారు. ముందునుంచీ ఉన్న వాళ్లను రెగ్యులర్ చేయకపోగా ఇష్టమొచ్చినప్పుడు ఉద్యోగంలోంచి తీసేశారు. ఇప్పుడున్న వాళ్లలో ఇంకెంతమందిని తీసేస్తారు, వేకెంట్ పోస్టుల్లో ఎన్ని కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ పోస్టులను భర్తీ ప్రక్రియలో భాగంగా చూపిస్తారనేది క్లారిటీ లేదు.

కిందటేడాది డిసెంబర్​ నుంచి చెప్పుడే
రాష్ట్రంలో 50 వేల ఉద్యోగాలను భర్తీ చేస్తామని సర్కారు చెప్పడం మొదలెట్టి దాదాపు ఏడాది అవుతోంది. గతేడాది డిసెంబర్ నుంచి ఉద్యోగాల భర్తీపై ప్రభుత్వం నాన్చుడు ధోరణి అవలంబి స్తోంది. వెకెంట్ పోస్టులను 5 రోజుల్లో గుర్తించాలని ఈ ఏడాది జూలై 13, 14 తేదీల్లో కేబినెట్ మీటింగ్‌‌ టైమ్​లో ఆఫీసర్లను సీఎం ఆదేశించారు. మళ్లీ 17 రోజుల తర్వాత కేబినెట్ సమావేశమైనా భర్తీపై నిర్ణయం తీసుకోలేదు. వెకెంట్ పోస్టులపై ఆర్థిక శాఖ ఇచ్చిన రిపోర్టునూ పట్టించుకోలేదు. ప్లీనరీలో 50 వేల పోస్టులు గుర్తించా మంటూనే బై ఎలక్షన్​ ఉందని పోస్టుల సంఖ్యను పెంచి చెప్పారు. ఉద్యోగుల సర్దుబాటుతో కొత్తగా ఖాళీలు ఏర్పడ్డాయని, వాటితో కలిపి 70 నుంచి -80 వేల ఉద్యోగాల భర్తీని మొదలుపెడుతామని ప్రకటించారు. కానీ ఖాళీలేమో 1.62 లక్షలున్నట్టు అధికారిక లెక్కలు వెల్లడిస్తున్నాయి.

ప్రమోషన్లు, కొత్త జోనల్​ వ్యవస్థ తరువాత ఉద్యోగుల సంఖ్య ఇలా
ప్రభుత్వ డిపార్ట్​మెంట్లు, ఇన్​స్టిట్యూషన్లలో శాంక్షన్డ్ స్ట్రెంత్     500565
వర్కింగ్ ​స్ట్రెంత్ 
ప్రభుత్వ డిపార్ట్​మెంట్లు, ఇన్‌స్టిట్యూషన్లు    3,38,514
గ్రాంట్ ఇన్​ఎయిడ్​, యూనివర్సిటీలు    12,467
కాంట్రాక్ట్, ఔట్​సోర్సింగ్​ ఎంప్లాయీస్​    1,70,338
హానరోరియం ఎంప్లాయీస్​    1,76,343