ఆస్పత్రుల్లో ప్రజల ప్రాణాలు పోతున్నా పట్టించుకుంటలే

ఆస్పత్రుల్లో ప్రజల ప్రాణాలు పోతున్నా పట్టించుకుంటలే
  • వరుస ఘటనలు జరుగుతున్నా చర్యలు తీసుకోని ప్రభుత్వం 
  • గతంలో ఇబ్రహీంపట్నంలో ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్లు ఫెయిలై నలుగురు మహిళలు మృతి

హైదరాబాద్, వెలుగు: ఆస్పత్రుల్లో ప్రజల ప్రాణాలు పోతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. బాధ్యులైన డాక్టర్లు, సిబ్బందిపై చర్యలు తీసుకోవడం లేదు. పోయినేడాది ఆగస్టులో ఇబ్రహీంపట్నం హాస్పిటల్‌‌‌‌లో కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు ఫెయిలై నలుగురు మహిళలు చనిపోయినా అత్తెసరు చర్యలతోనే సరిపెట్టారు. జగిత్యాల మదర్‌‌‌‌‌‌‌‌ అండ్ చైల్డ్ హెల్త్ సెంటర్‌‌‌‌‌‌‌‌లో ఒకే రోజు సిజేరియన్ డెలివరీలు జరిగిన ఆరుగురికి ఇన్ఫెక్షన్ సోకింది. డెలివరీ తర్వాత ఇంటికెళ్లిన బాలింతలు.. ఇన్ఫెక్షన్‌‌‌‌తో బాధపడుతూ దవాఖానకు వస్తే డాక్టర్లు పట్టించుకోలేదు. దీంతో వారి కుటుంబ సభ్యులు హాస్పిటల్ ఎదుట ఆందోళన చేశారు. ఈ నెల 10న సంఘటన జరిగితే ఇప్పటి వరకు ఒక్కరిపై కూడా చర్యలు తీసుకోలేదు. పోయిన నెల 24న జడ్చర్ల ప్రభుత్వ దవాఖానకు ఓ గర్భిణి కాన్పు కోసం వెళ్లగా, డెలివరీకి ఇంకా టైమ్ ఉందంటూ డాక్టర్లు ఆమెను అడ్మిట్ చేసుకోలేదు. ఆ తర్వాత రెండ్రోజులకే ఆ మహిళకు నొప్పులు ఎక్కువై రోడ్డుపైనే ప్రసవించింది. ఈ విషయంలోనూ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. డెలివరీ కోసం నాగర్‌‌‌‌‌‌‌‌కర్నూల్‌‌‌‌కు చెందిన ఓ గర్భిణి ఐదు ప్రభుత్వ దవాఖాన్లకు తిరగాల్సి వచ్చింది. డాక్టర్లు, వసతులు లేవంటూ ఒక దవాఖాన నుంచి మరో దవాఖానకు ఆమెను రిఫర్ చేస్తూ వచ్చారు. నొప్పులతోనే180 కిలో మీటర్లు ప్రయాణించిన ఆమె.. చివరకు మహబూబ్‌‌‌‌నగర్ హాస్పిటల్‌‌‌‌కు చేరుకున్నా ప్రాణాలు దక్కలేదు. ఈ ఘటన డిసెంబర్ లో జరగ్గా ప్రభుత్వం సీరియస్ గా తీసుకోలేదు. కానీ హైకోర్టు సుమోటోగా స్వీకరించి ప్రభుత్వానికి ఇటీవల నోటీసులు జారీ చేసింది. 

గైనకాలజిస్టులపై భారం.. 

మలక్ పేట్, ఇబ్రహీంపట్నం హాస్పిటల్ సహా రాష్ట్రంలోని జిల్లా, ఏరియా హాస్పిటల్స్, కమ్యునిటీ హెల్త్ సెంటర్లన్నీ వైద్య విధాన పరిషత్ పరిధిలోనే ఉన్నాయి. ఈ ఆస్పత్రుల్లో 622 గైనకాలజిస్టు పోస్టులకు గాను 266 మంది మాత్రమే పనిచేస్తున్నారు. ప్రభుత్వ దవాఖాన్లలో 40 శాతం డెలివరీలు జరిగితే, ఇప్పుడు ఏకంగా 60 శాతం జరుగుతున్నట్టు ప్రభుత్వం చెబుతోంది. ఈ లెక్కన ఇంకా ఎక్కువ మంది గైనకాలజిస్టులు అవసరం. కానీ, శాంక్షన్డ్ పోస్టుల్లోనే సగానికి పైగా ఖాళీగా ఉన్నాయి. పిల్లల డాక్టర్లు కూడా సరిపడా లేరు. 544 పోస్టుల్లో 321 ఖాళీగానే ఉన్నాయి.