సోయా, మొక్కజొన్న కొనుగోళ్ల నిబంధనల్లో సడలింపు..ఓటీపీ విధానంతో కౌలు రైతులకు అవకాశం : కలెక్టర్ రాజర్షి షా

సోయా, మొక్కజొన్న కొనుగోళ్ల నిబంధనల్లో సడలింపు..ఓటీపీ విధానంతో కౌలు రైతులకు అవకాశం : కలెక్టర్ రాజర్షి షా

ఆదిలాబాద్, వెలుగు: కౌలు రైతులు పత్తితో పాటు సోయాబీన్, మొక్కజొన్న పంటలను ఓటీపీ విధానంతో అమ్ముకునే అవకాశం ప్రభుత్వంకల్పించిందని ఆదిలాబాద్​ కలెక్టర్​ రాజర్షి షా తెలిపారు. శనివారం సాయంత్రం కలెక్టరేట్​లో వ్యవసాయ, ఉద్యాన, మార్కెటింగ్ శాఖల అధికారులతో రివ్యూ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. డిజిటల్‌గా నమోదు కాని కౌలు రైతులకు మద్దతు ధరతో పంట అమ్ముకునేందుకు ప్రభుత్వం ప్రత్యేక అనుమతి ఇచ్చిందని తెలిపారు.

 ఆర్ఎస్ఎస్ఎస్ పోర్టల్‌లో నమోదైన రైతుల వివరాలు నేరుగా అగ్రి-ఎమ్మెస్పీ పోర్టల్‌కు లింక్ చేశామన్నారు. మార్కెట్‌కు వచ్చినప్పుడు రైతులు ఆధార్, బ్యాంక్ పాస్​బుక్​ వివరాలను పోర్టల్‌లో నమోదు చేయాలని, తర్వాత బయోమె ట్రిక్ ధ్రువీకరణ ఆధారంగా పంట అమ్ముకోవచ్చని తెలిపారు. రైతులు వ్యవసాయ అధికారులను సంప్రదించి తమ వివరాలు నమోదు చేయించుకోవాలన్నారు.

 ఈ విషయాన్ని రైతులందరికీ చేరేలా విస్తృత ప్రచారం చేయాలని వ్యవసాయ అధికారులను ఆదేశించారు. సందేహాల కోసం 6300001597 నంబర్‌కు కాల్ చేయాలని రైతులకు సూచించారు. ఎకరాకు 12 క్వింటాళ్ల వరకు అమ్ముకునేలా ఏఈవోలు చర్యలు చేపట్టాలన్నారు. 

ప్రత్యేక అవసరాల పిల్లలను సంరక్షించడం గొప్ప సేవ

ప్రత్యేక అవసరాల పిల్లలను సంరక్షించడం గొప్ప సేవ అని కలెక్టర్ అన్నారు. జిల్లా కేంద్రంలోని యోగా భవన్‌లో విజ్ఞాన్ ప్రత్యేక పాఠశాల ఆధ్వర్యంలో నిర్వహించిన తల్లిదండ్రుల అవగాహన సదస్సులో కలెక్టర్ చీఫ్​ గెస్ట్​గా పాల్గొన్నారు. ప్రత్యేక అవసరాల పిల్లల అభివృద్ధి కోసం కృషి చేస్తున్న సంస్థ ప్రతినిధులు, టీచర్లను అభినందించారు. 

పిల్లల్లోని లోపాలతో పాటు వారి ప్రతిభను, ఆసక్తులు, నైపుణ్యాలను గుర్తించి ప్రోత్సహిస్తే సమాజంలో అందరితో సమానంగా ఎదుగుతారని అన్నారు. ప్రత్యేక అవసరాల పిల్లల కోసం ప్రభుత్వం భవిత కేంద్రం ద్వారా పలు సేవలు, పథకాలు అమలు చేస్తోందని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి మిల్కా, మిషన్ కోఆర్డినేటర్ యశోద, సైకాలజిస్టు శ్రీహరి, విద్యా కౌన్సిలర్ మహిపాల్ పాల్గొన్నారు.

సీఎంఆర్ సరఫరా స్పీడప్ చేయండి

జిల్లాలో సీఎంఆర్ సరఫరాను వేగవంతం చేయాలని మిల్లర్లను కలెక్టర్‌ ఆదేశించారు. శనివారం కలెక్టర్‌ ఛాంబర్‌లో నిర్వహించిన రివ్యూ మీటింగ్​లో కలెక్టర్ మాట్లాడారు. ప్రభుత్వం విధించిన గడువులు ముగుస్తున్న నేపథ్యంలో సన్నబియ్యం మిల్లింగ్‌, సీఎంఆర్ సరఫరా పనులను త్వరగా పూర్తిచేయాలన్నారు. డిసెంబర్‌ నెలాఖరు లోపు వందశాతం పూర్తి చేయాని ఆదేశించారు. సమయానికి సరఫరా చేయని మిల్లర్లపై చర్యలు తప్పవని హెచ్చరించారు.