విజయ డెయిరీపై సర్కారు ఫోకస్..రోజూ 3.20 లక్షల లీటర్లపాల విక్రయాలు

విజయ డెయిరీపై సర్కారు ఫోకస్..రోజూ 3.20 లక్షల లీటర్లపాల విక్రయాలు
  • సేకరణను 4.40 లక్షల లీటర్ల నుంచి 6 లక్షల లీటర్లకుపెంచాలని కార్యాచరణ
  • రెండేండ్లలో 500 వరకు ఏర్పాటుకు డెయిరీ కార్పొరేషన్ ప్లాన్

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర సర్కారు విజయ డెయిరీపై ప్రత్యేక దృష్టి సారించింది. రాష్ట్రవ్యాప్తంగా పాల విక్రయాలను మరింత పెంచేందుకు విస్తృత కార్యాచరణకు శ్రీకారం చుట్టింది. ప్రస్తుతం రోజువారీగా 3.20 లక్షల లీటర్ల పాల విక్రయాలు జరుగుతున్నాయి. ఈ విక్రయాలను పెంచాలనే లక్ష్యంతో  డెయిరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ కార్యాచరణ రూపొందిస్తున్నది. 

ఇందులో భాగంగా ప్రతి నెల సగటున 25 చొప్పున కొత్త విజయ డైయిరీ పార్లర్లను ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటికే గ్రేటర్​ హైదరాబాద్​ (జీహెచ్​ఎంసీ) పరిధిలో 50 కొత్త పార్లర్లు, గ్రామీణ ప్రాంతాల్లో మరో 25 పార్లర్లు ప్రారంభమయ్యాయి. రాబోయే రెండేండ్లలో 500 పార్లర్ల వరకు ఏర్పాటు చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే, తాజా ప్రణాళికల ప్రకారం.. మరో 3–4 ఏండ్లలో మొత్తం 400 నుంచి 500 కొత్త పార్లర్లను స్థాపించేందుకు కృషి చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.

పాల సేకరణ లక్షన్నర లీటర్లు పెంపు!

ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా రైతుల నుంచి రోజుకు సుమారు 4.40 లక్షల లీటర్ల పాలు సేకరిస్తున్న విజ య డెయిరీ.. దీన్ని 6 లక్షల లీటర్లకు పెంచే లక్ష్యంతో ముందుకు సాగుతోంది. పాల విక్రయాలు 3.20 లక్షల లీటర్లుగా ఉండగా.. మిగిలిన పాలతో పాల పొడి, వెన్న వంటి ఉత్పత్తులు తయారు చేస్తున్నారు. మార్కెటింగ్, బ్రాండింగ్‌‌పై ప్రధాన దృష్టి సారించినట్లు డెయిరీ అధికారులు వెల్లడించారు. 

మరిన్ని డెయిరీ పార్లర్ల ఏర్పాటుకు ఆసక్తి గల వ్యాపారవేత్తల నుంచి డైయిరీ దరఖాస్తుదా రులను ఆహ్వానిస్తోంది. గతేడాది నష్టాల దశ నుంచి ఇప్పుడు స్థిరత్వం సాధించి.. పాల సేకరణ పెంపు, మార్కెట్ విస్తరణకుప్రాధాన్యం ఇస్తోంది. 

మార్కెట్​లో పాల పరిస్థితి ఇలా..

రాష్ట్రంలో మొత్తం పాల ఉత్పత్తి రోజుకు సుమారు 80 లక్షల లీటర్లు కాగా, వినియోగం 68 లక్షల లీటర్లుగా ఉంది. ఒక్క హైదరాబాద్ పరిధిలోనే 36 లక్షల లీటర్ల డిమాండ్ ఉండటంతో ఉత్పత్తిని మరింత పెంచాల్సిన అవసరం ఉంది. జాతీయ సగటుతో పోలిస్తే తెలంగాణలో పాల లభ్యత కొంత తక్కువగా ఉండటం ఆందోళన కలిగిస్తోంది. సహకార సంఘాల ద్వారా నడిచే విజయ డెయిరీ, ముల్కనూర్‌‌ డెయిరీ, కరీంనగర్‌‌ డెయిరీ, మదర్‌‌ డెయిరీలకు పాడి పరిశ్రమ అభివృద్ధి సంస్థ పరిధిలోని రెండు లక్షల మంది రైతులు పాలను సరఫరా చేస్తున్నారు. 

వీటితోపాటు 60కి పైగా డైయిరీలు పాలు విక్రయిస్తున్నాయి. మరో 22 లక్షల మంది రైతులు ఒకటీ రెండు ఆవులు, గేదెలతో పాడి నిర్వహిస్తున్నారు. సహకార సంఘాల డెయిరీల ద్వారా రోజుకు 7 లక్షల లీటర్ల పాలను మార్కెట్‌‌లో విక్రయిస్తుండగా, వీటిలో ఒక్క విజయ డెయిరీ నుంచే 3 లక్షల 20 వేల లీటర్ల అమ్మకాలు సాగుతున్నాయి. ప్రైవేటు డెయిరీలు, లూజు పాలతో కలిపి 30 లక్షలకు పైగా లీటర్లు మార్కెట్‌‌లోకి వస్తున్నాయి.