గురుకులాలు  ఆగమాగం

గురుకులాలు  ఆగమాగం

సౌలతుల్లేవ్​.. తిండి సక్కగ లేదు.. తిప్పలు పడుతున్న విద్యార్థులు
అనేక చోట్ల మార్నింగ్‌‌ టిఫిన్‌‌ బంద్‌‌.. కిచిడితోనే సరి..
వారానికి మూడు సార్లే ఎగ్‌‌.. ఉడికీ ఉడకని అన్నం..
నెలకు రెండు సార్లు మటన్‌‌ ఊసే లేదు
ఐదేండ్లుగా మెస్‌‌ చార్జీలు పెంచని సర్కారు
అధ్వానంగా శానిటేషన్‌‌ సగానికి పైగా గురుకులాలు కిరాయి భవనాల్లోనే
సమస్యలు పరిష్కరించాలని నిత్యం రోడ్డెక్కుతున్న స్టూడెంట్లు

హైదరాబాద్‌‌, వెలుగు:  రాష్ట్రంలో ప్రభుత్వ గురుకులాలు అధ్వాన్నంగా తయారయ్యాయి. పిల్లలు తిప్పలు పడుతున్నారు. ఐదేండ్లుగా మెస్​ చార్జీలు  పెంచకపోవడంతో వారికి క్వాలిటీ ఫుడ్‌‌  అందడం లేదు. గురుకులాల సంఖ్యను పెంచినా.. పర్మినెంట్​ బిల్డింగ్స్​ లేక, కిరాయి బిల్డింగ్స్​లోనే కొనసాగిస్తున్నారు.  ఇరుకిరుకు గదుల్లో పిల్లలను కుక్కుతున్నారు. ఎక్కడ కూడా సరిపోయేన్ని టాయిలెట్లు, మరుగుదొడ్లు లేవు. తాగేందుకు సురక్షిత నీరు కూడా అందడం లేదు. తినే తిండి కలుషితమై పిల్లలు అస్వస్థతకు గురవుతున్నా.. కారణాలపై ఆరా తీసే వారు లేరు. తెలంగాణ ఏర్పాటుకు ముందు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు 298 (261 +37 జనరల్) రెసిడెన్షియల్ స్కూళ్లు మాత్రమే ఉండేవి.  కొత్తగా 608 రెసిడెన్షియల్ స్కూళ్లు, 53 రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీలు ప్రారంభించారు. ప్రస్తుతం గురుకులాల సంఖ్య 959 (906 + 53 డిగ్రీ కాలేజీలు)కు చేరింది. వీటిల్లో సుమారు 2.5 లక్షల మంది చదువుతున్నారు. ఈ గురుకులాలు రోజుకో ఇష్యూతో వార్తల్లోకి ఎక్కుతున్నాయి. ఎస్సీ, ఎస్టీ గురుకులాలకు సెక్రటరీగా అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్న రోనాల్డ్ రాస్ ఆర్థిక శాఖకే పరిమితమై గురుకులాలపై సరిగా దృష్టి పెట్టలేకపోతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. 

గురుకులాల్లో మంచి ఫుడ్‌‌‌‌ దొరకడంలేదు. వారానికి ఆరుసార్లు గుడ్లు పెట్టాల్సి ఉండగా.. మూడు, నాలుగు సార్లు కూడా పెడ్తలేరు. ఉదయం ఇడ్లి, పూరి, బోండా వంటి టిఫిన్లు పెట్టాల్సి ఉండగా.. కిచిడీ, సాంబారుతో కానిచ్చేస్తున్నారు. నెలకు రెండు సార్లు పెట్టాల్సిన మటన్​ను  బంద్​ పెట్టి, నాలుగు సార్లు చికెన్​ పెడుతున్నారు. నీళ్ల కూరలు, అరకొర భోజనంతో నెట్టుకొస్తున్నారు. కూరలు మొత్తం నీళ్లు నీళ్లుగా, చారు లెక్క చేస్తున్నారని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పండ్లను అసలే ఇస్తలేరు. గురుకులాల్లో 2017లో మెస్‌‌‌‌ చార్జీలు పెంచగా.. ఆ తర్వాత మళ్లీ పెంచలేదు. అప్పటి ధరలకు అనుగుణంగా ఉన్న చార్జీలే ఇప్పుడు వర్తింపజేస్తున్నారు. ప్రస్తుతం కూరగాయలు, నిత్యావసర వస్తువుల ధరలు భారీగా పెరిగాయి. దీంతో సగం మెనూనే అమలు చేస్తున్నారు. గతంలో గురుకులాల్లో సపరేట్‌‌‌‌గా వంట మనుషులు ఉండేవారు. వీరిని ఔట్‌‌‌‌ సోర్సింగ్‌‌‌‌, కాంట్రాక్టు పద్ధతిలో రిక్రూట్‌‌‌‌ చేసుకునేవారు. ఒక్కో గురుకులంలో 9 మంది దాకా ఉండేవారు. కానీ కొన్నాళ్ల కిందట ఈ వ్యవస్థను రద్దు చేశారు. దీని స్థానంలో ప్రైవేట్‌‌‌‌ కేటరింగ్‌‌‌‌ సిస్టంను తీసుకొచ్చారు. దీంతో బయట వాళ్లే ఫుడ్‌‌‌‌ కుక్‌‌‌‌ చేస్తారు. ఒక్కో గురుకులానికి నెలకు రూ. 60 వేల చొప్పున కాంట్రాక్టర్‌‌‌‌కు చెల్లిస్తారు. కాంట్రాక్టర్‌‌‌‌ తాను కొంత మిగిలించుకుని.. ముగ్గురు, నలుగురు వంట మనుషులతో కేటరింగ్​ నిర్వహిస్తున్నారు. ఉడికీ ఉడకని అన్నం పెడుతున్నారు. క్వాలిటీ, క్వాంటిటీ ఫుడ్‌‌‌‌ పెట్టడంలేదు. అన్నంలో పురుగులు వస్తున్నాయని స్టూడెంట్లు ఆందోళనకు దిగినా పట్టించుకునే దిక్కు లేకుండా పోయింది. మార్చి 15న మహబూబాబాద్‌‌‌‌ జిల్లా సీరోలులో ఏకలవ్య ఆదర్శ గురుకుల బాలికల స్కూల్‌‌‌‌లో  దాదాపు 38 మంది స్టూడెంట్లు కలుషిత ఆహారం తినడం వల్ల వాంతులు, విరోచనాలతో అస్వస్థతకు గురయ్యారు. మార్చి 16న  గద్వాల జిల్లా అలంపూర్ తాలూక ఇటిక్యాల గురుకులంలో పురుగులు ఉన్న భోజనం పెడుతున్నారని ఎంఈవోకు స్టూడెంట్లు ఫిర్యాదు చేశారు. 
అస్తవ్యస్తంగా శానిటేషన్
గురుకులాల్లో శానిటేషన్‌‌‌‌ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. శానిటేషన్‌‌‌‌, స్వీపింగ్​ను ప్రైవేట్‌‌‌‌ వ్యక్తులతో నిర్వహిస్తున్నారు. వీళ్లకు 2016లో రేట్లను నిర్ణయించారు. ఎస్టీ గురుకులాల్లో నెలకు రూ. 22 వేల దాకా చెల్లిస్తున్నారు. మొదటలో 5వ తరగతి వరకు మాత్రమే ఉన్న గురుకులాలు ఇప్పుడు ఇంటర్మీడియెట్‌‌‌‌  వరకు అప్​గ్రేడ్​ అయ్యాయి. ఒక్కో గురుకులంలో అరకొర జీతంతో, నలుగురైదుగురు సిబ్బందితోనే శానిటేషన్, స్వీపింగ్​ నిర్వహిస్తుండటంతో.. ఎక్కడి చెత్త అక్కడ పేరుకుపోతున్నది. పలుచోట్ల నీటి వసతి లేక పిల్లలు ఇబ్బందులు పడుతున్నారు. సరిపోయేన్ని బాత్‌‌‌‌రూమ్‌‌‌‌లు, టాయిలెట్స్‌‌‌‌ కూడా ఎక్కడా లేవు. స్టూడెంట్స్ సిక్‌‌‌‌  అయితే ట్యాబ్లెట్స్‌‌‌‌ కూడా అందుబాటులో ఉండటంలేదు.  
అట్టలను అడ్డుపెట్టుకొని..!
హనుమకొండ, కమలాపూర్​ మండలాల మహాత్మజ్యోతి బాపూలే రెసిడెన్షియల్​ స్కూల్​ను హసన్​పర్తి మండలం జయగిరి సమీపంలో నిర్వహిస్తున్నారు. మొత్తం స్టూడెంట్స్​ 643 మంది ఉండగా.. పర్మినెంట్​ బిల్డింగ్​ లేక కిరాయి బిల్డింగ్​లో కొనసాగిస్తున్నారు. ఇది కూడా శిథిలావస్థకు చేరింది. చుట్టుపక్కల గ్రానైట్స్​ కు సంబంధించి తరచూ బాంబ్​ బ్లాస్టింగ్స్ చేస్తుండటంతో గోడలు బీటలు వారుతున్నాయి. ఈ మొత్తం బిల్డింగ్​ కు అద్దె రూపంలో ప్రతి నెలా 3.46 లక్షలు చెల్లిస్తున్నారు. కిటికీల అద్దాలు పగిలిపోవడంతో పిల్లలు అట్టలను అడ్డుగా పెట్టుకుని క్లాస్​లు వింటున్నారు. వంట గది అధ్వాన్నంగా మారింది. చెత్తచెదారం, ఖాళీ పాల ప్యాకెట్స్​, ఇతర వ్యర్థాలు ఆ పక్కనే పడేస్తుండటంతో ఎలుకలు, పాములకు ఆవాసంగా మారింది. దీంతో ఆవరణలో తరచూ పాములు కనిపిస్తున్నాయని విద్యార్థులు తెలిపారు. ఇక తాగునీటి సౌకర్యం కల్పించేందుకు సరైనా ఏర్పాట్లు కూడా లేవు. బిల్డింగ్​ మొత్తంలో రెండు వాటర్​ ఫిల్టర్లు ఉండగా.. అందులో ఒకటి ఖరాబైంది. హాస్టల్​ ఫుడ్  బాగోలేకపోవడంతో 15 రోజుల కిందట హసన్​పర్తి మండల కేంద్రంలో దాదాపు వంద మంది స్టూడెంట్స్​ఆందోళన నిర్వహించారు. 
నల్గొండ జిల్లా దామరచర్ల గిరిజన బాలికల గురుకులంలో ఈ నెల 17న నిద్రలో ఉన్న ఆరుగురు విద్యార్థినులను ఎలుకలు కొరికాయి. ఇదే గురుకులంలో ఏప్రిల్‌‌ 16న ఫుడ్‌‌ పాయిజన్‌‌ అయి 25 మంది హాస్పిటల్​ పాలయ్యారు. 
ఈ రెండు మూడు గురుకులాలే కాదు, రాష్ట్రంలోని చాలా గురుకులాల్లో స్టూడెంట్లు సమస్యలతో సతమతమవుతున్నారు. సౌలతుల్లేక బిక్కుబిక్కుమంటున్నారు. సరైన భోజనం అందక అలమటిస్తున్నారు. జబ్బు చేసినా, ఎలుకలు కొరికినా.. పట్టించుకునే దిక్కు లేకుండాపోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మేడ్చల్​ జిల్లా కీసర మండలం బోగారం బీసీ గురుకులంలో మార్చి 21న పాముకాటుతో శివశంకర్​ అనే విద్యార్థి చనిపోయాడు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలంలోని అబ్బాయిల గురుకులంలో సరిగ్గా భోజనం పెట్టడం లేదని మార్చి 3న విద్యార్థులు రోడ్డెక్కారు.