
- తొలి ఏడాదిలోనే రూ.21,632 కోట్ల వడ్డీ లేనిరుణాలు ఇచ్చినం
- ఐదేండ్లలో కోటి మంది మహిళలనుకోటీశ్వరులను చేయడమే లక్ష్యం
- సొంత బిడ్డ ఫోన్లు ట్యాప్ చేసిన బీఆర్ఎస్ పెద్దలు..
- తెలంగాణ ఆడబిడ్డల మంచిని ఓర్వలేకపోతున్నరు: మంత్రి సీతక్క
- ఫ్రీ బస్సు స్కీమ్‌పై దొంగ వీడియోలు సృష్టిస్తున్నరని ఫైర్
- పదేండ్లు మహిళా సంఘాలను బీఆర్ఎస్ పట్టించుకోలే: మంత్రి పొన్నం
- మహిళా సాధికారతకు ప్రజా ప్రభుత్వం కృషి: మంత్రి వివేక్ వెంకటస్వామి
- హైదరాబాద్ జిల్లా సమైక్య మహిళా సంఘాలకు రూ.41.51 కోట్ల చెక్కు అందజేత
హైదరాబాద్, వెలుగు: మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకొని శక్తివంతులుగా ఎదిగేందుకు ఎన్ని కోట్ల రూపాయలైనా ఖర్చు చేసేందుకు తమ ఇందిరమ్మ ప్రభుత్వం సిద్ధంగా ఉందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ఐదేండ్లలో కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యమని చెప్పారు. ‘‘మహిళా సంఘాలకు ఏటా రూ.20 వేల కోట్ల వడ్డీలేని రుణాలు అందించాలని మా ప్రభుత్వం నిర్ణయిస్తే.. ప్రతిపక్షాలు, కొద్దిమంది వ్యక్తులు ఇది సాధ్యమేనా? అని అవహేళన చేశారు. వారి అంచనాలను తలకిందులు చేస్తూ మొదటి సంవత్సరమే రూ.21,632 కోట్ల వడ్డీ లేని రుణాలు అందించి రికార్డు సృష్టించాం.
ఇది మా సంకల్పబలానికి నిదర్శనం” అని తెలిపారు. గత సర్కార్ పదేండ్లపాటు వడ్డీ లేని రుణాల అంశాన్ని, మహిళా సాధికారతను గాలికి వదిలేసిందని ఆయన మండిపడ్డారు. హైదరాబాద్ యూసఫ్‌గూడలోని కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో శనివారం ‘ఇందిరా మహిళా శక్తి’ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా హైదరాబాద్ జిల్లా సమైక్య మహిళా సంఘాలకు రూ.41,51,05,152 చెక్కును డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు సీతక్క, వివేక్ వెంకటస్వామి, పొన్నం ప్రభాకర్ అందజేశారు. అనంతరం భట్టి మాట్లాడారు. ఈ రుణాలతో జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని 8,130 మంది మహిళలు లబ్ధిపొందుతున్నారని చెప్పారు. జీహెచ్ఎంసీ పరిధిలో 30 సర్కిళ్లలో 50,764 మహిళా సంఘాల్లో 5,09,957 మంది సభ్యులు ఉన్నారని.. రాబోయే రోజుల్లో ఈ సంఖ్యను పెంచుతామన్నారు.
తమ ప్రభుత్వం మహిళా సంఘాల ద్వారా బస్సులు కొనుగోలు చేయించి ఆర్టీసీకి లీజుకు ఇప్పిస్తున్నదని, ఇప్పటికే 150 బస్సులు లీజుకు ఇప్పించామని, మరో 450 బస్సులు త్వరలోనే లీజుకు ఇప్పించనున్నట్లు వెల్లడించారు. ఫ్రీ బస్సు జర్నీ స్కీమ్‌తో ఇప్పటివరకు మహిళలు 222.50 కోట్ల ఉచిత ప్రయాణాలు చేశారని, వారి పక్షాన రూ.7,422 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీకి చెల్లించిందని వివరించారు. బహిరంగ మార్కెట్లో కిలో రూ.50 పలుకుతున్న సన్నబియ్యాన్ని ప్రభుత్వం ఒక్కొక్కరికి ఆరు కిలోల చొప్పున ఉచితంగా అందజేస్తున్నదని తెలిపారు. ‘‘కొత్త రేషన్ కార్డులు, రేషన్ కార్డుల్లో పేర్ల మార్పు కోసం పదేండ్లు జనం తిరిగి తిరిగి అలసిపోయారు.
ప్రజా ప్రభుత్వం మాత్రం కొత్త కార్డులు మంజూరు చేయడంతోపాటు పేర్ల మార్పులు, చేర్పులు చేపట్టింది. పేద, మధ్యతరగతి కుటుంబాలకు 200 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్ సరఫరా చేస్తున్నది. పేదల పక్షాన ప్రభుత్వమే విద్యుత్ సంస్థలకు నెలనెలా కరెంటు బిల్లులు చెల్లిస్తున్నది” అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పేర్కొన్నారు.
పేదల సంక్షేమాన్ని కోరేది కాంగ్రెస్ పార్టీనే: సీతక్క
కాంగ్రెస్ అంటేనే పేదల సంక్షేమాన్ని కోరే పార్టీ అని, ఇందిరమ్మ నాయకత్వంలో మహిళా సంక్షేమానికి పెద్దపీట వేసిందని మంత్రి సీతక్క తెలిపారు. ‘‘కాంగ్రెస్ అగ్రనేత సోనియాగాంధీ తెలంగాణ ప్రజల ఆకాంక్షను గౌరవించి రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారు. మహిళల బాగుకోరేది రేవంత్ రెడ్డి ప్రజా ప్రభుత్వమే. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే పొదుపు సంఘాలను ఏర్పాటు చేశారు. మహిళలను వ్యాపార రంగాల్లో నిలబెట్టేందుకు బ్యాంకు రుణాలు ఇస్తున్నాం. బ్యాంకు లోన్లతో పెట్రోల్ బంకులు, ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్లు, సోలార్ పవర్ ప్లాంట్లు ఏర్పాటు చేయిస్తున్నాం” అని ఆమె చెప్పారు.
ఫ్రీ బస్సు జర్నీ స్కీమ్‌పై బీఆర్ఎస్ దొంగ వీడియోలను సృష్టించి మహిళలను అవమానపరుస్తున్నదని మండిపడ్డారు. ఉచిత బస్సు ప్రయాణమే కాదు.. ఆర్టీసీ అద్దె బస్సులకు మహిళా సంఘాలను ఓనర్లను చేశామని తెలిపారు. దేశంలో మొట్టమొదటిసారిగా నారాయణపేటలో మహిళా సంఘాల ద్వారా పెట్రోల్ బంకును ఏర్పాటు చేయించామని, గడిచిన ఆరు నెలల్లో రూ.13.50 లక్షల ఆదాయం సమకూరిందని వివరించారు. ‘‘బీఆర్ఎస్ నాయకులు బతుకమ్మ పండుగను రాజకీయాలతో కలుషితం చేస్తున్నారు. వారికి మహిళలు తగిన బుద్ధిచెప్పాలి. సొంత బిడ్డ ఫోన్లు ట్యాప్ చేసిన బీఆర్ఎస్ పెద్దలు.. తెలంగాణ ఆడబిడ్డల మంచిని చూసి ఓర్చుకోలేకపోతున్నారు” అని సీతక్క ఆగ్రహం వ్యక్తం చేశారు.
గత ప్రభుత్వం మహిళా సంఘాల్ని పట్టించుకోలే: పొన్నం
గత బీఆర్ఎస్ ప్రభుత్వం మహిళా సంఘాలను పట్టించుకోలేదని, వడ్డీలేని రుణాలు ఇవ్వలేదని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. ఇందిరా మహిళా శక్తి ద్వారా హైదరాబాద్ నగరంలో 35 క్యాంటీన్లు, 80 కుట్టుమిషన్ల యూనిట్లు, 63 ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేశామని తెలిపారు. 760 గ్రూపులకు రూ.55.72 కోట్ల రుణాలు ఇచ్చామని చెప్పారు. పదేండ్లలో ఒక్క రేషన్ కార్డు రాలేదని, కానీ, తాము కొత్త రేషన్ కార్డులు అందించడంతోపాటు సన్న బియ్యం కూడా పంపిణీ చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు.
మహిళా సాధికారతకు కృషి: వివేక్ వెంకటస్వామి
మహిళా సాధికారత కోసం ప్రజా ప్రభుత్వం కృషి చేస్తున్నదని మంత్రి వివేక్ వెంకటస్వామి తెలిపారు. ఆర్థిక ఇబ్బందులున్నా.. 50 వేల మహిళా సంఘాలకు వడ్డీలేని రుణాలు అందిస్తున్నట్లు వివరించారు. ‘‘ఆడబిడ్డలు ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి ప్రభుత్వం చేయూతనందిస్తున్నది. మహిళలకు పెట్రోల్ బ్యాంకులు ఏర్పాటు చేస్తున్నది” ఆయన చెప్పారు. ఇది ప్రజాపాలన ప్రభుత్వం, ప్రజల కోసమే పని చేస్తుందన్నారు. ఈ సభకు ఇంతపెద్ద సంఖ్యలో మహిళలు తరలిరావడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు. జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి అద్భుతంగా పని చేస్తున్నారని ఆయన అన్నారు.
కార్యక్రమంలో మేయర్ గద్వాల విజయలక్ష్మీ, రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్సీ వెంకట్, ఎమ్మెల్యే ఆదినారాయణ, కార్పొరేషన్ల చైర్పర్సన్లు బండ్రూ శోభారాణి , బెల్లయ్య నాయక్, రాయల్ నాగేశ్వర్రావు, వీరయ్య, మల్రెడ్డి రాంరెడ్డి, వెన్నెల గద్దర్, హైదరాబాద్ కలెక్టర్ దాసరి హరిచందన, సెర్ప్ సీఈవో దివ్య దేవరాజన్ పాల్గొన్నారు.