
- వైట్ హౌస్ అధికారి వివరణ ఇచ్చారంటూ వార్తలు
- ‘నో ఎంట్రీ’ వర్తింపుపై గందరగోళం
న్యూఢిల్లీ: హెచ్1బీ వీసాదారులకు వార్షిక ఫీజు లక్ష డాలర్లకు పెంచుతూ ట్రంప్ తీసుకున్న నిర్ణయం ఎవరికి వర్తిస్తుందనేదానిపై గందరగోళం నెలకొంది. ఇప్పటికే హెచ్1బీ వీసాపై అమెరికాలో ఉంటున్న వారికి ఎలాంటి ఇబ్బంది లేదని, హెచ్1బీ వీసా ఉన్నా.. అమెరికా బయట వర్క్, వెకేషన్ లో ఉన్నోళ్లు మాత్రం డెడ్ లైన్ (21వ తేదీ తెల్లవారుజామున 12.01 గంటలు) దాటితే యూఎస్ లోకి నో ఎంట్రీ అంటూ వార్తలు వచ్చాయి.
వారికి సంబంధిత కంపెనీలు వార్షిక ఫీజు లక్ష డాలర్లు చెల్లిస్తేనే.. తిరిగి ఎంట్రీ ఉంటుందన్న ప్రచారం సాగుతోంది. దీనిపై ఇండియన్ టెకీ వర్గాల్లో తీవ్ర కలకలం రేగిన నేపథ్యంలో వైట్‌హౌస్ అధికారి ఒకరు వివరణ ఇచ్చారని, కొత్తగా హెచ్1బీ కోసం దరఖాస్తు చేసుకున్న వాళ్లకు మాత్రమే ఫీజు పెంపు వర్తిస్తుందంటూ శనివారం రాత్రి ‘ఏఎన్ఐ’ వార్తా సంస్థ వెల్లడించింది. ఇప్పటికే హెచ్1బీ వీసా ఉండి, అమెరికాలో ఉన్నా.. ఇండియాలో ఉన్నా ఎలాంటి ఇబ్బంది లేదని, డెడ్ లైన్ లోగా తిరిగి రావాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారని పేర్కొంది. అలాగే హెచ్1బీ వీసా రెన్యువల్స్ కు కూడా ఫీజు పెంపు వర్తించదని వివరించింది.
మరికొన్ని విశేషాలు
- హెచ్ 1బీ వీసాపై అమెరికాలో పనిచేస్తున్న వారిలో 3 లక్షల మంది ఇండియన్ వర్కర్లే.
- ఏటా లాటరీ పద్ధతిలో 85 వేల హెచ్ 1బీ వీసాల జారీ. అందులో 70 శాతం వాటా మన ఇండియన్లదే.
- ఇప్పటివరకూ హెచ్1బీ వీసా ఫీజు 215 డాలర్లు, 750 డాలర్లు..
- కంపెనీ, జాబ్ కేటగిరిని బట్టి ఫీజు 1,500 డాలర్ల నుంచి 5 వేల డాలర్లు అయ్యేది.
- ప్రస్తుతం ఆ ఫీజును 20 నుంచి 100 రెట్లకు (లక్ష డాలర్లు) పెంచారు.
- జూనియర్లు, మిడ్ లెవెల్ ఇంజనీర్లను హెచ్ 1బీపైనే ఇన్ఫోసిస్, టీసీఎస్, విప్రో వంటి కంపెనీలు అమెరికాకు పంపాయి.
- హెచ్ 1బీ వీసాపైనే అమెజాన్, మైక్రోసాఫ్ట్ కూడా ఇండియన్లను తీసుకున్నాయి.