కాళేశ్వరానికి మరో రూ.18,751 కోట్ల అప్పు

కాళేశ్వరానికి మరో రూ.18,751 కోట్ల అప్పు
  •     మూడో టీఎంసీ పనుల కోసం తీసుకునేందుకు జీవో
  •     రూరల్‌ ఎలక్ట్రిఫికేషన్‌ కార్పొరేషన్‌ నుంచి రుణం
  •     రూ.63 వేల కోట్లు దాటిన కాళేశ్వరం కార్పొరేషన్‌ అప్పులు
  •     రూ.లక్ష కోట్లు దాటనున్న ప్రాజెక్టు వ్యయం

హైదరాబాద్‌, వెలుగుకాళేశ్వరం ప్రాజెక్టు మూడో టీఎంసీ పనులకు రూ.18,751 కోట్ల అప్పు తీసుకునేందుకు ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. కాళేశ్వరం ఇరిగేషన్‌ కార్పొరేషన్‌.. రూరల్‌ ఎలక్ట్రిఫికేషన్‌ కార్పొరేషన్‌ నుంచి ఈ మొత్తాన్ని తీసుకునేందుకు ఓకే చెప్పింది. ఇందులో కన్నెపల్లి పంపుహౌస్‌ నుంచి రోజుకు ఒక టీఎంసీ చొప్పున ఎల్లంపల్లికి తరలించే స్కీమ్–1 (లింక్‌-1) పనుల్లో ఎలక్ట్రో మెకానికల్‌, హైడ్రో మెకానికల్‌ పనులు పూర్తి చేయడానికి రూ.4,657.95 కోట్లు, మిడ్‌ మానేరు నుంచి కొమురవెల్లి మల్లన్నసాగర్‌కు వరకు ఒక టీఎంసీ నీటిని తరలించే స్కీమ్–2 పనులకు రూ.14,093.43 కోట్లు కేటాయించనున్నారు. ఈ అప్పుకు రాష్ట్ర ప్రభుత్వం గ్యారెంటీగా ఉంటుంది. 12 ఏళ్లలో 144 వాయిదాల్లో చెల్లించేలా త్వరలోనే రెండు కార్పొరేషన్లు అగ్రిమెంట్‌ చేసుకోనున్నాయి. లింక్‌–1లో ఇప్పటికే ఎర్త్‌, కాంక్రీట్‌ వర్క్‌ పూర్తి కాగా, మోటార్లను బిగించాల్సి ఉంది. స్కీమ్–2లో మిడ్‌మానేరు నుంచి 45 కి.మీ.లు పైప్​లైన్‌ ద్వారా మల్లన్నసాగర్‌కు నీటిని తరలిస్తారు. ఎల్లంపల్లి నుంచి మిడ్‌ మానేరుకు టీఎంసీ నీటిని తరలించడానికి 32 కి.మీ.ల టన్నెల్‌ తవ్వాలని నిర్ణయించారు. ఆ పనులకు నిధులను కూడా అప్పుల ద్వారా సమకూర్చుకోవాలని కాళేశ్వరం కార్పొరేషన్‌ భావిస్తోంది.

కాళేశ్వరం అప్పు రూ.53,326 కోట్లు

కాళేశ్వరం కార్పొరేషన్‌ ఇప్పటి వరకు చేసిన అప్పుల మొత్తం రూ.63,326 కోట్లకు చేరింది. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టును కాళేశ్వరం కార్పొరేషన్‌లో ఇంక్లూడ్‌ చేశారు. ఆ ప్రాజెక్టు కోసం పవర్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ నుంచి ఇటీవల రూ.10 వేల కోట్ల అప్పు తెచ్చారు. అది మినహాయిస్తే తాజాగా తీసుకోనున్న పైసలతో కలిపి ఒక్క కాళేశ్వరం ప్రాజెక్టు కోసం చేసిన అప్పే రూ.53,326 కోట్లకు చేరింది.

రూ.99 వేల కోట్లకు చేరిన ప్రాజెక్టు వ్యయం

కాళేశ్వరం వ్యయం రూ.98,942 కోట్లకు చేరింది. ప్రభుత్వం తొలుత రూ.80,190.46 కోట్లతో పరిపాలనా అనుమతులు ఇచ్చింది. ఇందులో ఇప్పటి వరకు రూ.50 వేల కోట్లపైన పనులు చేశారు. మూడో టీఎంసీ నీటిని కన్నెపల్లి నుంచి ఎల్లంపల్లికి తరలించడానికి ప్రభుత్వం కొన్ని రోజుల క్రితమే మూడు వేర్వేరు జీవోలు ఇచ్చింది. మిడ్‌ మానేరు నుంచి మల్లన్నసాగర్‌ వరకు పైప్​లైన్‌ ద్వారా చేపట్టబోయే పనులకు ఉత్తర్వులు రావాల్సి ఉంది. వాటికి ముందే అప్పు తీసుకోవడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఇక్కడ మూడు పంపుహౌస్‌లను ఏర్పాటు చేయాల్సి ఉంది. ఎల్లంపల్లి నుంచి మిడ్‌ మానేరు వరకు 32 కి.మీ.ల టన్నెల్‌ తవ్వాల్సి ఉంది. దీనికి ఎస్టిమేషన్స్‌ ఇప్పటికే సిద్ధం చేశారు. ఇక్కడ అదనంగా మరో పంపుహౌస్‌ ఏర్పాటు చేయాల్సి ఉంది. ఈ పనులకు రూ.4 వేల కోట్ల వరకు అవసరమని అంచనా వేసినట్టుగా తెలిసింది. ఇవి కలిపితే కాళేశ్వరం ప్రాజెక్టు వ్యయం రూ.1.03 లక్షల కోట్లకు చేరే అవకాశముంది. వర్క్‌ ఎస్కలేషన్లను లెక్కవేస్తే మరింత ఖర్చు పెరుగుతుందని అధికారులు చెప్తున్నారు.

మరిన్ని వెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి