
- .. వచ్చే నెల చివరి నాటికి రాష్ట్రవ్యాప్తంగా అమలు
- తొలుత 22.. ఇప్పుడు 25 కలిపి మొత్తం 47 ఎస్ఆర్వోల్లో స్లాట్ బుకింగ్
- రద్దీ ఎక్కువగా ఉండే కార్యాలయాల్లో అదనపు సబ్ రిజిస్ట్రార్లు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రవ్యాప్తంగా మరో 25 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో స్లాట్‌బుకింగ్ విధానం అమలు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. సోమవారం నుంచే ఈ విధానం అందుబాటులోకి వస్తుందని అధికారులు తెలిపారు. గత నెల నుంచి 22 సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో ప్రయోగాత్మకంగా అమలైన స్లాట్ బుకింగ్ విధానం విజయవంతమైంది. దీంతో మరిన్ని సబ్‌రిజిస్ట్రార్ ఆఫీసులకు ఈ విధానాన్ని విస్తరించారు.
సోమవారం నుంచి జూన్ చివరి నాటికి రాష్ట్రంలోని మొత్తం 144 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఈ విధానం పూర్తిగా అమల్లోకి రానున్నది. ప్రజల సమయాన్ని ఆదా చేసేందుకు, రిజిస్ట్రేషన్ ప్రక్రియను మరింత వేగవంతం చేసేందుకు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖలో కీలక సంస్కరణలకు శ్రీకారం చుట్టామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.
అవసరమున్న చోట అదనపు సబ్రిజిస్ట్రార్లు
పని ఒత్తిడి ఎక్కువగా ఉన్న కార్యాలయాల్లో స్లాట్ బుకింగ్ సులభతరం చేయడానికి అదనపు సబ్ రిజిస్ట్రార్లను నియమిస్తున్నట్లు మంత్రి పొంగులేటి తెలిపారు. 48 కన్నా ఎక్కువ స్లాట్స్ అవసరం ఉన్న కార్యాలయాల్లో ఇప్పుడున్న సబ్ రిజిస్ట్రార్లకు అదనంగా మరింతమందిని నియమిస్తామని చెప్పారు. ఇప్పటికే ప్రయోగాత్మకంగా మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని కుత్బుల్లాపూర్ కార్యాలయంలో అదనంగా ఇద్దరు సబ్ రిజిస్ట్రార్లు, సిబ్బందిని నియమించినట్లు పేర్కొన్నారు. ఉప్పల్, మహేశ్వరం, మంచిర్యాల సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అదనంగా ఒక్కో సబ్ రిజిస్ట్రార్‌ను నియమించినట్లు తెలిపారు.
రద్దీని సమతుల్యం చేయడానికి చంపాపేట, సరూర్ నగర్, షాద్ నగర్, ఫరూక్ నగర్, సిద్దిపేట లాంటి కార్యాలయాల పరిధిని విలీనం చేశారు. మే 12 నుంచి స్లాట్ బుకింగ్ అమలు కానున్న సబ్ రిజిస్ట్రార్ఆఫీసుల్లో హైదరాబాద్ ఆర్వో ఆఫీసు, నారపల్లి, ఘట్కేసర్, మల్కాజ్గిరి, ఉప్పల్, కాప్రా, బీబీనగర్, సిద్దిపేట, గజ్వేల్, మంచిర్యాల, పెద్దపల్లి, వరంగల్ ఆర్వో ఆఫీసు, జనగాం, ఘన్పూర్, నర్సంపేట, కల్వకుర్తి, నారాయణపేట, మహేశ్వరం, రంగారెడ్డి ఆర్వో ఆఫీస్, షాద్ నగర్, ఫరూక్ నగర్, వనస్థలిపురం, శేరిలింగంపల్లి ఉన్నాయి.