ఆర్అండ్​బీలో హౌసింగ్ విలీనం!

ఆర్అండ్​బీలో హౌసింగ్ విలీనం!

ఆర్అండ్​బీలో హౌసింగ్ విలీనం!
చివరి దశకు ప్రాసెస్.. జనవరిలో పూర్తి
500 మంది ఉద్యోగుల్లో డిపార్ట్​మెంట్లో ఉన్నది 60 మందే 
 90 శాతం మందికి ఇతర శాఖల్లో డిప్యూటేషన్ డ్యూటీ

హైదరాబాద్, వెలుగు : ఆర్ అండ్ బీలో హౌసింగ్ డిపార్ట్ మెంట్​ను విలీనం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. డిపార్ట్​మెంట్​కు అనుబంధంగా ఉన్న హౌసింగ్ కార్పొరేషన్, దిల్ (దక్కన్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ల్యాండ్ హోల్డింగ్స్ లిమిటెడ్), రాజీవ్ స్వగృహ కార్పొరేషన్లను కూడా కలిపేసే దిశగా కసరత్తు జరుగుతోంది. దీనికి సంబంధించిన ప్రక్రియ సైతం చివరి దశకు చేరుకుంది. వారం రోజులుగా హౌసింగ్, ఆర్ అండ్ బీ, జీఏడీ అధికారులు సీఎస్ సోమేశ్ కుమార్​తో వరుసగా భేటీ అవుతూ చర్చలు జరుపుతున్నారు. జనవరి నెలలో విలీనం పూర్తి అవుతుందని అధికారులు చెప్తున్నారు. 

వందల మందికి ప్రమోషన్లు పెండింగ్​

హౌసింగ్​లో మొత్తం 500 మంది ఎంప్లాయీస్ ఉండగా, ప్రస్తుతం ఆ శాఖలో కేవలం 60 మంది పనిచేస్తున్నారు. మరో 100 మంది కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ డ్యూటీ చేస్తున్నారు. మిగతా రెగ్యులర్ ఉద్యోగుల్లో 90 మంది జీహెచ్ఎంసీ, జలమండలి, ఇతర శాఖల్లో డిప్యూటేషన్​పై విధులు నిర్వహిస్తున్నారు. మరోవైపు డిపార్ట్​మెంట్​లో 230 మంది ఎంప్లాయీస్​కు ప్రమోషన్లు పెండింగ్ లో ఉన్నాయి. నిరుడు ఈ అంశంపై అధికారులు హౌసింగ్ మంత్రి, ప్రిన్సిపల్ సెక్రటరీకి ప్రపోజల్స్ పెట్టుకున్నారు. ఇటీవల ఈ అంశం సీఎం దగ్గరకు పంపగా ఆయన మండిపడ్డట్లు తెలుస్తోంది. ‘ఇంకా ఈ డిపార్ట్​మెంట్ ఉందా.. విలీనం చేయమన్నాను కదా.. త్వరగా ప్రాసెస్ పూర్తి చేయండి’ అని సీఎం అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. దీంతో ఉన్నతాధికారులు విలీనం ప్రాసెస్​ను స్పీడప్ చేస్తున్నారు. ఈ ప్రాసెస్​పూర్తి చేస్తే తమ ప్రమోషన్లు, సర్వీస్ రూల్స్, సీనియారిటీపై కూడా క్లారిటీ వస్తుందని ఉద్యోగులు అంటున్నారు.

డబుల్ ​బెడ్​రూమ్​ స్కీమ్​పై ప్రభావం

విలీనమైతే హౌసింగ్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న డబుల్ బెడ్ రూమ్ స్కీమ్, సొంత జాగ ఉంటే ఆర్థిక సాయం స్కీమ్ ల అమలుపై ప్రభావం ఉంటుందని అధికారులు అంటున్నారు. ఇప్పటికే ఆర్ అండ్ బీ లో  పరిధిలో సెక్రటేరియెట్, అమరవీరుల స్థూపం, అంబేద్కర్ విగ్రహం, కలెక్టరేట్లు, మెడికల్ కాలేజీలు, హైదరాబాద్ లో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్, వరంగల్​లో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వంటి పెద్ద ప్రాజెక్టులు ఉన్నాయి. ఇప్పటికే తీవ్రమైన పని ఒత్తిడిలో ఉన్న అధికారులు డబుల్ ​ఇండ్ల నిర్మాణంపై ఎంత వరకు దృష్టి సారిస్తారనేది అనుమానమే. దీంతో వాటి నిర్మాణం మరింత స్లో అవుతుందని అధికారులు అంటున్నారు. ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా 2,92,057 ఇండ్లను శాంక్షన్ చేయగా నవంబర్ 30 నాటికి  1,32,089 పూర్తయ్యాయి. మరో 58 వేల ఇండ్ల పనులు 90% కంప్లీట్ అయ్యాయి. ఈ పనులు స్లోగా జరుగుతుండటం, కడుతున్న ఇండ్ల కంటే లబ్ధిదారుల సంఖ్య కొన్ని లక్షలు అధికంగా ఉండటంతో సొంత జాగలో ఇండ్లు కట్టుకుంటే రూ.3 లక్షల సాయం చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఈ ఏడాది బడ్జెట్​లో ఈ స్కీమ్ కు రూ.12 వేల కోట్లు కేటాయించింది. 15 రోజుల్లో ఈ స్కీమ్ స్టార్ట్ చేస్తామని ఈ నెల మొదటి వారంలో సీఎం ప్రకటించినా నిధుల కొరతతో పథకం మొదలవడం లేదు.