జేపీఎస్​ల జాబ్​లు టెంపరరీనే.. కారణాలు చెప్పకుండా ఎప్పుడైనా తీసేస్తం

జేపీఎస్​ల జాబ్​లు టెంపరరీనే.. కారణాలు చెప్పకుండా ఎప్పుడైనా తీసేస్తం
  •     70 మార్కులు దాటితెనే రెగ్యులరైజ్
  •     రానోళ్ల పనితీరు మరో6 నెలలు పరిశీలిస్తం
  •     జేపీఎస్ ల రెగ్యులరైజ్ పై ప్రభుత్వం ఉత్తర్వులు
  •     సర్కార్​తీరుపై మండిపడుతున్న సెక్రటరీలు

హైదరాబాద్ ,వెలుగు: జూనియర్ పంచాయతీ సెక్రటరీ(జేపీఎస్) పోస్టులు ఎప్పటికీ టెంపరరీయే అని.. రెగ్యులరైజ్ చేసినప్పటికీ ఎలాంటి కారణాలు చెప్పకుండా ఎప్పుడైనా తొలగిస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది. నాలుగేండ్ల సర్వీసు పూర్తి చేసి, 100 కు 70 మార్కులు దాటితేనే రెగ్యులరైజ్ చేస్తామని పేర్కొంది. 70 మార్కులు రాని వారి పనితీరును మరో 6నెలలు పరిశీలించి, అప్పటికీ రాకపోతే చర్యలు తీసుకుంటామని తెలిపింది. రెగ్యులరైజ్​పై అనుసరించాల్సిన రూల్స్, రెగ్యులర్ అయిన సెక్రటరీలకు ఇచ్చే అపాయింట్ మెంట్ ఆర్డర్ ఫార్మాట్​ను మంగళవారం పీఆర్ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా కలెక్టర్లకు, పీఆర్ డైరెక్టర్​కు మెమో జారీ చేశారు. పనితీరుపై రిపోర్టు పూర్తయిన సెక్రటరీల కాపీలను, అపాయింట్ మెంట్ ఆర్డర్స్ సెక్రటరీలకు చెందిన మొబైల్ యాప్ ల్లో అప్ లోడ్ చేయాలని పేర్కొన్నారు. ఇటీవల రెగ్యులర్ కు సంబంధించి ఉమ్మడి రాష్ట్రంలో సర్వీస్ రూల్స్ పై అప్పటి ప్రభుత్వం ఇచ్చిన జీవో 84లో సవరణలు చేసింది. మరి కొన్ని గైడ్ లైన్స్ జతచేస్తూ తాజాగా జారీ చేసింది. రెగ్యులర్ గా అపాయింట్ అయిన సెక్రటరీలు లోకల్ బాడీ ఎంప్లాయిస్ సబ్జెక్ట్ పేపర్ 1,2 లో అకౌంట్స్ టెస్ట్ కచ్చితంగా పాస్ కావాలని వెల్లడించింది. రెగ్యులర్ అయిన సెక్రటరీలు సెల్ఫ్ డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. నాలుగేండ్ల సర్వీస్ పూర్తయిన జేపీఎస్ లను గ్రేడ్ 4 సెక్రటరీలుగా రెగ్యులరైజ్ చేయాలని ఇటీవల ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా జిల్లా స్థాయిలో అడిషనల్ కలెక్టర్ (లోకల్ బాడీస్), ఎస్పీ లేదా డీఎస్పీ స్థాయి అధికారి, డీఎఫ్ వోలతో కమిటీలను ఏర్పాటు చేసింది. రెగ్యులర్ కు సంబంధించి పలు గైడ్ లైన్స్, అంశాలను ఖరారు చేసింది. హరిత హారం, పల్లె ప్రకృతి వనం, డంపింగ్​ యార్డ్ ఇలా పలు అంశాలకు మార్కులను కేటాయించింది. మొత్తం 100 మార్కులకు జేపీఎస్ ల పనితీరు ను లెక్కగట్టాలని, ఇందులో రెండొంతుల మార్కులు వస్తేనే రెగ్యులర్ చేస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది. రాష్ట్రంలో 9,355 జేపీఎస్ పోస్టులు ఉండగా ఇందులో 8500 మంది పనిచేస్తున్నారు. సుమారు 5700 మంది నాలుగేండ్ల సర్వీసును పూర్తి చేసుకున్నట్లు పీఆర్ అధికారులు చెబుతున్నారు.


ఇలాంటి రూల్స్​ ఎప్పుడూ చూడలేదు

నాలుగేండ్ల సర్వీస్ పూర్తయినా 70 మార్కులు వస్తేనే రెగ్యులర్ చేస్తామనటం విడ్డూరం అని పంచాయతీ సెక్రటరీ అసోసియేషన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మధుసూదన్ రెడ్డి, రమేశ్ లు డిమాండ్ చేశారు. ప్రభుత్వం పలురకాల ఉత్తర్వులు ఇస్తూ రెగ్యులరైజేషన్ ప్రాసెస్ ను గందరగోళం చేస్తుందన్నారు. ఈ రూల్స్ వల్ల వేల మందికి అన్యాయం జరుగుతుందని, ప్రత్యేక రాష్ట్రం తెచ్చుకొని వృథా అనే అభిప్రాయం వారిలో ఉంటుందని నేతలు తెలిపారు. ఒక నోటిఫికేషన్ ద్వారా రిక్రూట్ అయినా వారిని ఈ విధంగా దశల వారీగా రెగ్యులరైజ్ చేయడం చాలా బాధాకరమన్నారు. ఇలాంటి రూల్స్ ఉమ్మడి రాష్ట్రంలో ఎప్పుడూ చూడేలేదన్నారు.

మెమోను వెనక్కి తీసుకోవాలె

జేపీఎస్​ల రెగ్యులరైజ్ పై ప్రభుత్వం ఇచ్చిన మోమోపై సెక్రటరీలు, సంఘాలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నాయి. ఈ మెమోను వెనక్కి తీసుకోవాలని హెచ్చరిస్తున్నారు. జిల్లా కమిటీ వేసే మార్కు లు 70 దాటితేనే రెగ్యులరైజ్​ చేస్తామని మెమోలో పొందుపరచడం చాలా దురదృష్టకరమని పంచాయతీ సెక్రటరీల సెంట్రల్ ఫోరం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మహేశ్, విజయ్ కుమార్ అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా పంచాయతీ కార్యదర్శుల రెగ్యులరైజేషన్ విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న తీరు బాధ కలిగిస్తుందని మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు. మార్కులు 70 ఉండాలనే రూల్ తొలగించాలని, కండీషన్లు పెట్టకుండా నాలుగేండ్ల సర్వీస్ పూర్తి చేసుకున్న వారిని రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. త్వరలో పీఆర్ ఉన్నతాధికారులను కలుస్తామని నేతలు తెలిపారు.