అమ్మో ఒకటో తారీఖు.. భయపడుతున్న ఆర్థికశాఖ

V6 Velugu Posted on Oct 27, 2021

ఒకటో తారీఖు వచ్చిందంటే చాలు అమ్మో ఒకటో తారీఖు అంటూ రాష్ట్ర ఆర్థికశాఖ అధికారులు భయపడుతున్నారు. ప్రభుత్వం చేస్తున్న అప్పులు, వాటికి వడ్డీల ఖర్చు పెరిగిపోవడంతో ప్రతి నెల ఓ గండంలా గడుస్తోంది. ఖజానాలో పైసలు లేకపోవడంతో కొన్ని నెలలుగా ఉద్యోగులకు, పెన్షన్ దారులకు పదో తారీఖు వచ్చినా రాష్ట్ర సర్కార్ జీతాలు ఇవ్వలేకపోతోంది. ఉద్యోగులకు నెల నెలా జీతాలు ఇవ్వడం సర్కార్‎కు కష్టంగా మారింది. రాష్ట్రవ్యాప్తంగా 32 ప్రభుత్వ శాఖల పరిధిలో 3 లక్షల మంది ఉద్యోగులు, 2 లక్షల మంది పింఛన్ దారులు ఉన్నారు. వీరందరికీ ప్రతి నెలా ఒకటో తేదీన ఇవ్వాల్సిన జీతాలను ప్రభుత్వం విడతల వారీగా ఇస్తోంది. ఉద్యోగులందరి అకౌంట్లలో జీతాలు పడే సరికి పన్నేండో తేదీ వచ్చేస్తోంది. 

రాష్ట్రంలో అమలు చేస్తున్న పథకాలకు డబ్బులు సరిపోనపుడు  ప్రభుత్వాలు అప్పులు చేస్తాయి. అయితే రాష్ట్రాలు ఇష్టం వచ్చినట్టు అప్పులు చేసి సంక్షోభంలో కూరుకుపోకుండా ఉండేందుకు.. కేంద్రం FRBM చట్టాన్ని అమలులోకి తెచ్చింది. ఈ నిబంధనల ప్రకారం రాష్ట్రాలు తమ స్థూల ఆదాయానికి మించి అప్పులు చేయరాదు. రాష్ట్రం ఏర్పడే నాటికి తెలంగాణకు మిగులు బడ్జెట్ ఉండటంతో స్థూల ఆదాయంలో 3.5 శాతం వరకు అప్పులు తీసుకోవడానికి కేంద్రం అనుమతి ఇచ్చింది. ఈ వెసులుబాటును వినియోగించుకున్న రాష్ట్ర ప్రభుత్వం.. ఇప్పటికే బహిరంగ మార్కెట్ నుంచి 3లక్షల కోట్లకు పైగా అప్పులు చేసింది. అయినా సర్కార్ అవసరాలు మాత్రం తీరలేదు. అదనంగా అప్పు చేయడానికి కేంద్రం నిరాకరించడంతో దొడ్డి దారిన అప్పులు చేయడానికి ప్రభుత్వం ప్రత్యేక కార్పొరేషన్‎లను ఏర్పాటు చేసింది. కార్పొరేషన్‎ల ద్వారా చేసిన అప్పులకు ప్రభుత్వమే గ్యారంటీ ఇస్తుంది. ప్రభుత్వం అప్పులు చేయాలనుకున్న ప్రతీసారి అవసరం ఉన్నా.. లేకున్నా కార్పొరేషన్లను ఏర్పాటు చేస్తూ పోతోంది. కార్పొరేషన్‎ల ద్వారా కూడా రాష్ట్ర సర్కారు ఇప్పటికే లక్ష కోట్లకు పైగా అప్పులు చేసింది. 

ఇటువంటి అప్పులతో రాష్ట్ర ఖజానా ఖాళీ అయ్యింది. నెలనెలా వస్తున్న ఆదాయంలో సగానికి పైగా వడ్డీలు కట్టేందుకే సరిపోతున్నాయి. ఉద్యోగుల జీతాలకు కావాల్సిన డబ్బులను సమకూర్చడం కష్టంగా మారిందని ఆర్ధికశాఖ అధికారులు అంటున్నారు. కొన్ని నెలల నుంచి రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులందరికి ఒకటో తేదీన జీతాలు పడిన దాఖలాలు లేవని ఉద్యోగ సంఘాల నేతలంటున్నారు. వ్యక్తిగత అవసరాల కోసం పెట్టుకున్న బిల్లులు కూడా సరైన సమయానికి రావడం లేదని ప్రభుత్వ ఉద్యోగులు చెబుతున్నారు. సరెండర్ లీవ్‎ల బిల్లులు, సప్లిమెంటరీ బిల్లులు కూడా లెట్‎గా ఇస్తున్నారని వాపోతున్నారు. చాలామంది ఉద్యోగులు అత్యవసర సమయంలో జీపీఎఫ్ లోన్‎కు అప్లయ్ చేసుకుంటే అవి కూడా లేట్‎గా విడుదలవుతున్నాయని అంటున్నారు. కరోనా బారినపడిన ఉద్యోగులు.. ట్రీట్‎మెంట్ తర్వాత రియంబర్స్‎మెంట్‎కు దరఖాస్తు పెట్టుకుంటే.. నెలల తర్వాత ఫండ్ రిలీజ్ చేస్తున్నారని చెబుతున్నారు. 

Tagged Telangana, government employees, Employees salaries, finance department

Latest Videos

Subscribe Now

More News