
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో కారుణ్య నియామకాలను సర్కారు ఏండ్ల నుంచి చేపట్టడం లేదు. వివిధ శాఖల్లో పనిచేస్తూ అనారోగ్యం, యాక్సిడెంట్లు.. ఇతర కారణాలతో చనిపోయిన ఉద్యోగుల కుటుంబాలు జాబుల కోసం ఎదురు చూస్తున్నాయి. ఇటువంటి ఫ్యామిలీలు రాష్ట్రంలో సుమారు 3,500 వరకు ఉన్నట్టు ఉద్యోగ సంఘాల నేతలు చెబుతున్నారు. గడిచిన ఏడాది నుంచి రాష్ట్ర ప్రభుత్వం వివిధ నోటిఫికేషన్లు విడుదల చేస్తున్నది. పలు శాఖల్లోని పూర్తి ఖాళీలను అధికారులు ఇండెంట్ రూపంలో ఇవ్వడంతో వాటిని నోటిఫికేషన్లలో చేర్చారు. అయితే ఆయా జిల్లాల్లో కారుణ్య నియామకాల ద్వారా భర్తీ చేయాల్సిన పోస్టులను పక్కకు పెట్టకపోవడం ఆశావహుల్లో ఆందోళన కలిగిస్తోంది. ఆయా శాఖల్లో ఖాళీలకు నోటిఫికేషన్లు ఇచ్చినందున కారుణ్య నియామకంతోపాటు ఇతర కోటా కింద పోస్టులు భర్తీ చేయవద్దని కలెక్టర్లకు సీఎస్ నుంచి ఆదేశాలు అందినట్టు సమాచారం.
ఇరిగేషన్ లో ఇచ్చే అవకాశం లేదు
ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో జూనియర్ అసిస్టెంట్, స్టెనో, టైపిస్ట్ ఉద్యోగాలను గ్రూప్ 4 ద్వారా మాత్రమే భర్తీ చేయాలని ఇటీవల ప్రభుత్వం నిర్ణయించింది. ఈ కేటగిరీ పోస్టులను డిపెండెంట్, కారుణ్య నియామకాల ద్వారా భర్తీ చేయరాదని సర్క్యులర్ లో పేర్కొన్నారు. దీంతో ఇరిగేషన్ డిపార్ట్ మెంట్ లో కారుణ్య నియామకాల కోసం వెయిట్ చేసే వారి ఆశలపై ప్రభుత్వం నీళ్లు చల్లినట్టయింది.
డైరెక్ట్ రిక్రూట్మెంట్ద్వారా నింపేస్తే ఎలా?
వాస్తవానికి డిపార్ట్ మెంట్ల వారీగా కారుణ్య నియామకాల సంఖ్యను అధికారులు పరిశీలించి, ఆ పోస్టులను మినహాయించి మిగిలిన పోస్టులను నోటిఫికేషన్లో చూపాల్సి ఉంటుంది. కానీ హడావుడిగా ఖాళీలు లెక్కించి నోటిఫికేషన్లు ఇవ్వడంతో ఇక ఖాళీ పోస్టులు లేకుండా పోయాయని ఉద్యోగ సంఘాల నేతలు చెబుతున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో శాంక్షన్ పోస్టులే చాలా తక్కువున్నాయని, వాటిని డైరెక్ట్ రిక్రూట్మెంట్ద్వారా భర్తీ చేస్తే ఇక ఏండ్ల తరబడి ఖాళీలు ఉండకపోవచ్చనే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
మెడికల్ అన్ ఫిట్ అప్లికేషన్లూ పెండింగ్
సర్వీస్ లో ఉండి తీవ్ర అనారోగ్యానికి గురై జాబ్ చేయలేని స్థితిలో ఉన్న వాళ్లు మెడికల్ అన్ ఫిట్ కోసం అప్లికేషన్పెట్టుకుంటారు. వారికి బదులు ఫ్యామిలీలో ఎవరికైనా ఉద్యోగం ఇవ్వాలని కోరతారు. ఇటువంటి అప్లికేషన్లు సుమారు 150 పెండింగ్ లో ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు. వీటిని పరిశీలించడానికి జీఏడీతోపాటు ఉన్నతాధికారులతో కమిటీ ఉంటుంది. ఆ కమిటీ టర్మ్ రెండేండ్ల కిందే అయిపోయింది. ఇంకా కొత్త కమిటీని నియమించలేదు. దీంతో వాటిని పరిశీలించే వాళ్లు లేరు. ఉమ్మడి రాష్ట్రంలో ఉద్యోగి చనిపోయిన ఆరు నెలల్లోనే ఆ పోస్టును కారుణ్య నియామకం కింద భర్తీ చేసేవారని ఉద్యోగ సంఘాల నేతలు చెబుతున్నారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదని, రెండు మూడేండ్ల నుంచి అప్లికేషన్లన్నీ పెండింగ్లోనే ఉన్నాయని అంటున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి కారుణ్య నియామకాలపై కలెక్టర్లకు ఆదేశాలు ఇవ్వాలని కోరుతున్నారు.
పంచాయతీ రాజ్ లో జాబ్ చేస్తూ నా భర్త 2021 లో చనిపోయారు. కారుణ్య నియామకం కోసం కలెక్టరేట్లో అప్లై చేసిన. ఆఫీసుల చుట్టూ తిరుగుతున్న. సీపీఎస్ ఉద్యోగి కావడం వల్ల పెన్షన్ కూడా రావడం లేదు. ఇద్దరు చిన్న పిల్లలు.. కుటుంబ పోషణ భారంగాఉంది. వెంటనే కారుణ్య నియామకం కింద జాబ్ ఇవ్వాలి.
- ఓ బాధితురాలు
మా నాన్న రెవిన్యూ డిపార్ట్ మెంట్ లో పనిచేస్తూ మూడేండ్ల కింద చనిపోయారు. కారుణ్య నియామకం కింద జాబ్ ఇవ్వాలని అప్లికేషన్ పెట్టుకున్న. ప్రభుత్వం నుంచి గైడ్ లైన్స్ రాలేదని అధికారులు చెబుతున్నారు. మా అమ్మ ఆరోగ్యం బాలేదు. జాబ్ ఇచ్చి ఆదుకోవాలి.
- ఓ బాధితుడు