12 ఏళ్లుగా న్యాయం కోసం లక్ష్మీపేట మాలల నిరీక్షణ

12 ఏళ్లుగా న్యాయం కోసం లక్ష్మీపేట మాలల నిరీక్షణ

రెండు వర్గాల మద్య ఘర్షణకు డబ్బు, భూమి, రాజకీయం లాంటి అనేక కారణాలు ఉండొచ్చు. కానీ, దళిత సమాజంపైన జరిగే దాడులకు పైన చెప్పిన కారణాలతో పాటు ప్రధాన కారణం కులమౌతోంది. ఇది వందల, వేల ఏండ్లుగా దళిత సమాజంపైన ఆధిపత్య కులాల వాళ్ళు చేస్తున్న దాడులను అనేక సందర్భాల్లో  మనం చూశాం. దాదాపు 12 సంవత్సరాల క్రితం (జూన్ 12. 2012) ఉత్తరాంధ్రలోని  శ్రీకాకుళం జిల్లా, లక్ష్మీపేట గ్రామంలోని దళితులపై స్థానిక ఆధిపత్య కులం చేసిన హింస అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్​ని ఉలిక్కి పడేలా చేసింది.  గ్రామంలోని ప్రజలంతా పనులకు సిద్ధమవుతుండగా, ఆయుధాలతో మాలలపై అమానుషంగా దాడి చేశారు. ఆర్థికంగా, రాజకీయంగా వృద్ధిలోకి వస్తున్న మాలలను చూసి జీర్ణించుకోలేని కొందరు అహంకారానికి, కులాధిపత్యానికి మరింత బలాన్ని జోడిస్తూ, కుల దూషణలు చేస్తూ మాల వీధిలోకి వెళ్లి గొడవలు ప్రారంభించారు. ఈ హింసాత్మక ఘటనలో ఐదుగురు మరణించారు. ఇది జరిగాక అప్పటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి రాజాంకు వెళ్లి మృతుల కుటుంబాలను, గాయపడ్డ వాళ్ళను పరామర్శించి న్యాయం చేస్తామని, నష్టపరిహారం, పునరావాసం కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఇప్పటికీ న్యాయం జరగలేదు. ఆశలు సన్నగిల్లి, ప్రజాస్వామ్యంపై ఉన్న నమ్మకం వమ్ము కాబడుతుందన్న సత్యం, న్యాయంకోసం లక్ష్మీపేట మాలలు చేస్తున్న సుదీర్ఘ నిరీక్షణతో మనకు అర్థమౌతుంది.

నానాటికి పెరుగుతున్న దాడులు

పెండింగ్‌‌‌‌ కేసుల్లో దేశంలోని మొదటి ఐదు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్‌‌‌‌కు ఒకటి. ఎన్​సీఆర్​బీ ప్రకారం, 2016 నుంచి 2021 మధ్య, పోలీసు స్టేషన్లలో 15,000 కేసులు పెండింగ్‌‌‌‌లో ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌‌‌‌లోని కోర్టులలో 32,212 పెండింగ్ కేసులు ఉన్నాయి. ఇది తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా ఇదే దుస్థితి ఉంది. బాధితులకు న్యాయం జరగకపోగా, నిందితులకు చట్టపరమైన శిక్షలు పడకపోవడంతో దళితుల మీద దాడులు నానాటికి పెరుగుతున్నాయి. ఈ దాడులను అరికట్టేందుకు, కులాధిపత్యాల నిర్మూలన కోసం దళితులు పోరాటాలు చేస్తున్నారు. కానీ, సమాజంలో కూడా వ్యవస్తీకృత మార్పులు రావాల్సిన అవసరం ఉంది. దానికోసం ప్రభుత్వాలు, న్యాయస్థానాలు చొరవ తీసుకుని సమాజంలో సమూల మార్పులకు కావాల్సిన విధివిధానాలను రూపొందించి, బాధితుల పక్షాన నిలబడి, సహాయ సహకారాలు, సంపూర్ణ న్యాయం అందేందుకు కృషి చేయాల్సిన గురుతర బాధ్యత కూడా ఉన్నది.

లక్ష్మీపేట మాలల ప్రస్తుత పరిస్థితి?

దళిత సంఘాల నిరంతర పోరాటంతో లక్ష్మీపేట గ్రామంలో సత్వర న్యాయం జరిగేలా ప్రభుత్వం ఫాస్ట్‌‌‌‌ట్రాక్ కోర్టును ఏర్పాటు చేసింది. అది స్థాపించి నేటికి 12 సంవత్సరాలు గడుస్తున్నప్పటికి ఎటువంటి న్యాయం జరగలేదు. నష్ట పరిహారం కూడా పూర్తిస్తాయిలో అందకపోవడం, తూర్పు కాపుల అధీనంలో ఉన్న భూముల్లో మాలలను పనులకు కూడా రానివ్వకపోవడంతో వాళ్ళ బతుకులు మరింత అధ్వానంగా మారాయి. జీవనోపాధి లేక, ఇల్లు గడవడానికి, పిల్లల్ని పోషించడం, చదివించడానికి లక్ష్మీపేట నుంచి చాలా మంది మాలలు ఇతర గ్రామాలకు, సమీప నగరాలకు వలస వెళ్లారు. ఒక సమాజం, వ్యవస్థగత పూర్వాపరాల నుంచి తప్పులను, సంస్థాగత లోపాలను, దాడులకుగల కారణాలను గుర్తించి వాటిని నిర్మూలించడంలో విఫలమైతే, లక్ష్మీపేట లాంటి హింసాత్మక దుర్ఘటనలు, దాని ప్రతిరూపాలు సంభవిస్తాయడానికి  కారంచేడు, చుండూరు లక్ష్మీపేటలో జరిగిన దాడులే ఒక ఉదాహరణ. 

- డా. సుమన్ దామెర, అసిస్టెంట్ ప్రొఫెసర్, 
మిజోరాం యూనివర్సిటీ