బీడు భూములకు రైతుబంధుపై ప్రభుత్వం ఆరా..

బీడు భూములకు రైతుబంధుపై ప్రభుత్వం ఆరా..
  • బీడు భూముల లెక్క తీస్తున్రు
  • ప్రభుత్వ ఆదేశాలతో ఏఈవోల సర్వే
  • సాగులో లేని భూముల వివరాల సేకరణ
  • వాటికి రైతు బంధు ఆపేందుకేనా?

హైదరాబాద్‌, వెలుగు: రాష్ట్రంలో బీడు భూముల వివరాలు రాబట్టేందుకు సర్కార్‌ సిద్ధమైంది. ఇందుకోసం అగ్రికల్చర్​ఆఫీసర్లను రంగంలోకి దించింది. వచ్చే యాసంగి నుంచి కొంతలో కొంత రైతుబంధు నిధులు మిగుల్చుకోవచ్చనే ఉద్దేశంతోనే పెట్టుబడి సాయం అందుతున్న పడావ్​ భూముల లెక్కలు తీయడంపై ఫోకస్​ పెట్టినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా అగ్రికల్చర్​ ఎక్స్​టెన్షన్​ ఆఫీసర్లు(ఏఈవోలు) ఆయా క్లస్టర్లలో సర్వే నంబర్ల వారీగా సాగులో లేని భూమి ఎంత? ఆ విస్తీర్ణానికి ఎంత మేర పెట్టుబడి సాయం అందుతుందనే డేటా సేకరించనున్నారు. వివరాల నమోదుకు సర్కారు క్రాప్‌ బుకింగ్‌ పోర్టల్‌లో ప్రత్యేక ఆప్షన్‌ పెట్టింది. సాగులో లేని భూముల లెక్కలు పక్కాగా రికార్డు చేయాలని వ్యవసాయశాఖ..  అధికారులను ఆదేశించడంతో వాళ్లు ప్రతి గ్రామం, ఆయా క్లస్టర్ల పరిధిలో రైతులు పంటలు వేయని భూములను నోక్రాప్ ఏరియాగా గుర్తిస్తున్నారు. 

ఆ భూములకు రైతుబంధు​ రాదా..
ఇప్పటిదాకా పాస్‌బుక్​లో ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని ఎకరాల్లో పంట వేసినా వేయక పోయినా ప్రభుత్వం సీజన్​కు రూ. 5 వేల చొప్పున ఏటా ఎకరాకు రూ.10 వేల రైతు బంధు ఇస్తూ వచ్చింది. అయితే నిధుల కటకటతో పంటలు వేయని భూములకు ప్రభుత్వం పెట్టుబడి సాయం బంద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పెట్టే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. వానాకాలం పంట సాగుకు కొంత ఫలితం ఇస్తున్నా యాసంగిలో పంట వేయని భూములకే ఎక్కువ  నిధులు అందుతున్నాయనే విమర్శలు వస్తున్నాయి. ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో ఖర్చు తగ్గించుకోవడానికి చూస్తున్నట్టు  సమాచారం. రాష్ట్రంలో 63 లక్షల 25 వేల 695 మంది రైతుల ఆధీనంలో ఉన్న ఒక కోటి 50 లక్షల18 వేల ఎకరాల్లో ఎకరానికి రూ.5 వేల చొప్పున వానకాలం పెట్టుబడి సాయం కింద ప్రభుత్వం రైతులకు రూ.7505.78 కోట్లు అందజేసింది. కాగా రాష్ట్రంలో వానకాలం సీజన్​లో 1.29 కోట్ల ఎకరాల్లో పంటలు సాగైనట్లు వ్యవసాయశాఖ గుర్తించింది. పండ్లు, పూలతోటలు, కూరగాయాలు, మిర్చి, పసుపు అన్ని కలిపితే మరో 6 లక్షల వరకు సాగైనట్లు అంచనా వేయొచ్చు. అన్నీ పంటలు కలిపినా..ఈయేడు 1.35 కోట్ల ఎకరాల కంటే ఎక్కువ సాగు అయ్యే పరిస్థితి లేదని ఎక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పర్ట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అంటున్నరు. దీని ప్రకారం పంటలు వేయకున్నా.. దాదాపు 15 లక్షల ఎకరాల భూమికి పెట్టుబడి సాయం అందినట్లే లెక్క.

యాసంగిలో మరింత తగ్గే చాన్స్
యాసంగి సీజన్​లో అన్ని పంటల సాగు విస్తీర్ణం 36.43 లక్షల ఎకరాలు. గత యాసంగిలో రికార్డు స్థాయిలో 68.14 లక్షల ఎకరాల్లో రైతులు పంటలు వేశారు. ఈయేడు యాసంగిలోనూ అదే స్థాయిలో సాగు జరిగినా.. 75 లక్షల ఎకరాలకు మించి పెరగదు. అయితే వానకాలం సీజన్​లో వేసినట్టుగానే 1.50 కోట్ల ఎకరాలకు రైతుబంధు అమలు చేస్తే.. రూ.7508.78 కోట్ల పెట్టుబడి సాయం కావాల్సి ఉంటుంది. అలా కాకుండా సాగైన 75 లక్షల ఎకరాలకే పెట్టుబడి సాయం అందజేస్తే.. ప్రభుత్వానికి దాదాపు రూ. 3,750 కోట్ల వరకు నిధులు మిగిలే అవకాశం ఉంటుంది. అందుకే ప్రభుత్వం సాగులో లేని భూముల వివరాలు తీస్తున్నట్లు తెలుస్తోంది.