
- 20 ఏళ్లకు ముందు ఇచ్చిన అసైన్డ్ భూములపై
- సర్వహక్కులు కల్పించిన ఏపీ సర్కార్
- ఇప్పటికే పలు రాష్ట్రాల్లో అసైనీలకు హక్కులు
- మన దగ్గర శాశ్వత పరిష్కారం చూపిస్తామని అసెంబ్లీలో ప్రకటించిన సీఎం కేసీఆర్
- 22 లక్షల ఎకరాల భూములు ఉన్నా హక్కులు లేక అయోమయంలో పేదలు
కరీంనగర్, వెలుగు: అసైన్డ్ భూములు కలిగిన ఒరిజనల్ అసైనీలకు సర్వ హక్కులు కల్పిస్తూ ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం.. రాష్ట్రంలోనూ చర్చకు దారి తీసింది. తాతల తండ్రుల కాలం నుంచి వస్తున్న అసైన్డ్ ల్యాండ్స్ ను సాగు చేసుకోవడం తప్పా.. అవసరానికి అమ్ముకునే పరిస్థితి లేక రాష్ట్రంలో లక్షలాది మంది అసైనీలు ఇబ్బందులు పడుతున్నారు. ధరణి పోర్టల్ వచ్చాక ఈ భూములను ప్రొహిబిటెడ్ లిస్టులో పెట్టడంతో అమ్మడం అసాధ్యంగా మారింది. ఫలితంగా అసైనీల వారసులు వాటిని అమ్మి ఇంకో చోట భూమి కొనాలన్నా, ఏదైనా బిజినెస్ పెట్టుకోవాలన్నా కుదరడం లేదు. ఈ క్రమంలో ఏపీ సర్కార్ నిర్ణయంతో గత ప్రభుత్వాల హయాంలో పంపిణీ చేసిన సుమారు 22.55 లక్షల ఎకరాలపై కూడా శాశ్వత హక్కులు కల్పించాలనే డిమాండ్ మరోసారి రాష్ట్రంలో తెరపైకి వచ్చింది.
రెండేండ్ల క్రితమే సీఎంకేసీఆర్ ప్రకటన
అసైనీలకు పూర్తి హక్కులు ఇవ్వాలనే ఆలోచన ప్రభుత్వానికి ఉందని 2021 మార్చి 26న సీఎం కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటించారు. త్వరలోనే దళిత ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను పిలుస్తానని, ఒక నిర్ణయం తీసుకుంటే వాళ్లకు మంచి జరుగుతుందేమోనన్న ఆలోచన ప్రభుత్వానికి ఉందని చెప్పారు. ఆ తర్వాత విషయాన్ని పక్కన పెట్టారు. ఈ క్రమంలోనే నిరుడు మార్చి 6వ తేదీన హన్మకొండలో జరిగిన కాంగ్రెస్ వరంగల్ రైతు డిక్లరేషన్ సభలో తొలిసారిగా అసైన్డ్ ల్యాండ్స్ కలిగిన రైతులకు శాశ్వత హక్కులు కల్పిస్తామని ఆ పార్టీ లీడర్లు తీర్మానించారు.
రాష్ట్రంలో 22.55 లక్షల ఎకరాల అసైన్డ్ భూములు...
పేదల అవసరాలను ఆసరాగా చేసుకుని వాళ్ల అసైన్డ్ భూములను తక్కువ రేటుకు తీసుకునే పరిస్థితి ఉండడంతో అప్పటి ప్రభుత్వం అసైన్డ్ భూముల బదలాయింపు నిషేధ చట్టం -1977 తీసుకొచ్చింది. దీని ప్రకారం పేదలకు అసైన్ చేసిన భూములను అమ్మడానికి వీల్లేదు. విషయం తెలియని చాలామంది అమ్మేసుకున్నారు. రాష్ట్రంలో చేపట్టిన భూరికార్డుల ప్రక్షాళన (ఎల్ఆర్ యూపీ)లో అసైన్డ్ భూముల కొనుగోళ్ల వ్యవహారం పెద్ద సంఖ్యలో వెలుగు చూసింది. రాష్ట్ర ప్రభుత్వం 1956 నుంచి 2014 వరకు 22,55,617 ఎకరాలను 13,88,530 మందికి అసైన్ చేసింది. అయితే అసైనీలు చనిపోతే వారి వారసులు పంచుకోవడం ద్వారా అసైనీల సంఖ్య 25 లక్షలు దాటొచ్చని అంచనా. తెలంగాణ సర్కారు కూడా అసైన్డ్ ల్యాండ్స్ కు పూర్తి హక్కులు కల్పిస్తే.. ఈ కుటుంబాలన్నీ లబ్ధిపొందనున్నాయి.
చేతులు మారిన భూములు..
రాష్ట్రంలో 2017 వరకు 2,41,749 ఎకరాలను 84,706 మందికి అమ్ముకున్నట్లు భూరికార్డు ప్రక్షాళన సందర్భంగా గుర్తించారు. అత్యధికంగా అసిఫాబాద్ లో 1,85,101 ఎకరాలు, భద్రాద్రి కొత్తగూడెంలో 1,86,557 ఎకరాలు, నల్గొండలో 1,36,686 ఎకరాలు, కామారెడ్డిలో 1,33,157 ఎకరాల అసైన్డ్ భూములు. ఉన్నాయి. ఇందులో 6,33,451 మంది బీసీల వద్ద 8,14,008 ఎకరాలుండగా, ఎస్సీల దగ్గర 5,75,497, ఎస్టీల వద్ద 6,72,959, ఓసీల వద్ద 1,46,102, మైనార్టీల వద్ద 54,585 ఎకరాలు ఉన్నట్లు భూరికార్డుల ప్రక్షాళనలో తేలింది.
ఇతర రాష్ట్రాల్లో అసైనీలకు సర్వ హక్కులు
రాష్ట్రంలో ఏడు దశాబ్దాల కాలంలో విడతల వారీగా అసైన్డ్ ల్యాండ్స్ పంపిణీ చేశారు. భూసంస్కరణల చట్టం అమల్లోకి వచ్చాక, మాజీ ప్రధాని ఇందిరాగాంధీ హయాంలో లక్షలాది ఎకరాలు పేదలకు పంపిణీ చేశారు. అయితే , అసైనీలు తరతరాలుగా ఆ భూములను సాగు చేసుకోవడం తప్పా వారి అవసరాల కోసం ఇతరులకు అమ్ముకోవడానికి వీల్లేకుండా పోయింది. ఫ్రీడం ఫైటర్స్, మాజీ సైనికులకు ఇచ్చిన భూములు మాత్రం పదేండ్ల తర్వాత అమ్ముకునే హక్కు ఉంది. కానీ, ఈ హక్కు కూడా మన రాష్ట్రంలో అమలు కావడం లేదు. పక్కనే ఉన్న కర్ణాటకలో మాత్రం అసైన్డ్ చేసిన 15 ఏండ్ల తర్వాత, తమిళనాడులో 20 ఏండ్ల తర్వాత, కేరళలో 25 ఏండ్ల తర్వాత, మధ్య ప్రదేశ్, ఉత్తరప్రదేశ్ లో 10 ఏండ్ల తర్వాత అర్హతను బట్టి అక్కడి ప్రభుత్వాలు అసైనీలకు భూములపై శాశ్వత హక్కులను కల్పిస్తున్నాయి. గతంలో ఏపీ ప్రభుత్వం ఇలాగే చుక్కల భూములకు, మాజీ సైనికులు, ఫ్రీడం ఫైటర్ల భూములపై అసైనీలకు హక్కు కల్పించింది. తాజాగా ఏపీ కేబినెట్ తీసుకున్న నిర్ణయం ప్రకారం.. అసైన్డ్ ల్యాండ్ పొందిన లబ్ధిదారులు భూమి పొందిన 20 ఏండ్ల తర్వాత పూర్తి హక్కులు అనుభవించవచ్చు. ఇలా అక్కడ మొత్తం 63,19,184 ఎకరాల అసైన్డ్ భూములపై రైతులు హక్కుదారులు కానున్నారు. అలాగే లంక భూముల విషయంలో మరో 66,111 మందికి.. పూర్తి హక్కులు కల్పించారు. ఒరిజినల్ అసైనీలకు మాత్రమే ఇది వర్తించనుందని, ఒరిజినల్ అసైనీలు చనిపోతే వారి వారసులకు ఈ నిబంధన వర్తిస్తుందనే కండిషన్ కూడా పెట్టడం విశేషం.
రాష్ట్రంలో పేదలకు హక్కులు కల్పించాలి..
రాష్ట్రంలో అసైన్డ్ భూములున్న రైతులకు ఆర్థిక పరమైన, అనారోగ్యపరమైన అత్యవసర పరిస్థితి తలెత్తినా, ఇతర ప్రాంతాలకు వలస వెళ్లాల్సి వచ్చినా భూములు అమ్ముకోలేని దుస్థితి ఉంది. కర్ణాటక, తమిళనాడు, కేరళ, మధ్యప్రదేశ్, యూపీ రాష్ట్రాలు లిమిటెడ్ పీరియడ్ తర్వాత అసైనీలకు శాశ్వత హక్కులు కల్పిస్తున్నాయి. తాజాగా ఏపీ కూడా ఇలాంటి నిర్ణయం తీసుకోవడం సంతోషం. మన రాష్ట్రంలో 50, 60 ఏండ్లయినా అసైన్డ్ ల్యాండ్ పై ఆయా కుటుంబాలకు శాశ్వత హక్కులు దక్కడం లేదు.
గుమ్మి రాజ్ కుమార్ రెడ్డి, అసైన్డ్ భూములకు శాశ్వత హక్కుల సాధన సమితి