రైతులకాడ గుంజుకునుడు ప్రైవేటుకు ఇచ్చుడు!

రైతులకాడ గుంజుకునుడు ప్రైవేటుకు ఇచ్చుడు!
  •     వివరాలు సేకరిస్తున్న అధికారులు 
  •     మార్కెట్ రేటుతో సంబంధం లేకుండా పరిహారం
  •     ఫుడ్ ప్రాసెసింగ్ జోన్లకు కేటాయించేలా ఏర్పాట్లు
  •     ఇప్పటికే యాక్షన్  ప్లాన్​కు కేబినెట్ ఆమోదం!

హైదరాబాద్,వెలుగు: అసైన్డ్ భూములపై రాష్ట్ర ప్రభుత్వం కన్నేసింది. వాటిని రైతుల నుంచి వెనక్కి తీసుకొని ప్రైవేటు సంస్థలకు కట్టబెట్టేందుకు సిద్ధమవుతోంది. ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి ప్రభుత్వాలు సాగు భూమిలేని నిరుపేద ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు వేలాది ఎకరాలను కేటాయించాయి. కొందరు ఆ భూముల్లో వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నారు. మరికొందరు తమకు కేటాయించిన భూముల్లో రాళ్లు, రప్పలు ఉండటంతో పడావు పెట్టారు. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం జిల్లా, పట్టణాలకు సమీపంలోని అసైన్డ్  భూములను వెనక్కి  తీసుకుని ప్రైవేటు సంస్థలకు కట్టబెట్టేందుకు రెడీ అవుతోంది. ఇందుకోసం త్వరలో రైతులకు నోటీసులు ఇచ్చేందుకు ప్లాన్  జరుగుతోంది. దీనికి సంబంధించి ఇటీవల కేబినెట్ మీటింగ్​లో ప్రాథమిక నిర్ణయం జరిగినట్టు ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి.

రాష్ట్ర వ్యాప్తంగా 2,250 ఎకరాల అసైన్డ్ భూములను వెనక్కి తీసుకునేందుకు ప్రభుత్వం సిద్ధమైనట్టు అధికారులు అంటున్నారు. ఏ జిల్లాలో ఏ ఊరిలో అసైన్డ్ భూములను స్వాధీనం చేసుకోవాలో రెవెన్యూ శాఖ రిపోర్టు తయారు చేస్తుందని చెప్తున్నారు. హైదరాబాద్ మినహా 9 ఉమ్మడి జిల్లాలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఒక్కో ఫుడ్  ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటుకు 250 ఎకరాల భూమిని కేటాయించేందుకు చర్యలు తీసుకోవాలని కేబినెట్ మీటింగ్ లో  సీఎం ఆదేశించారు. దీంతో రెవెన్యూ అధికారులు ఏ జిల్లాలో ఎంత మేర అసైన్డ్  భూమి ఉంది? ఎక్కడ ఫుడ్  ప్రాసెసింగ్ యూనిట్లకు అనుకూలంగా ఉంటుంది? అనే వివరాలను సేకరిస్తున్నారు. స్వాధీనం చేసుకున్న అసైన్డ్  భూములను తెలంగాణ ఇండస్ట్రీయల్ డెవలప్​మెంట్ కార్పొరేషన్  ద్వారా ఫుడ్ ప్రాసెసింగ్ జోన్లకు కేటాయించేలా విధి విధానాలు తయారు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. రైతుల వద్ద నుంచి తీసుకున్న భూములను డెవలప్​మెంట్ చేసి, ప్రాసెసింగ్ యూనిట్స్  నెలకొల్పేందుకు కావాల్సిన మౌలిక వసతులను ఏర్పాటు చేయాలని  భావిస్తోంది. 

ఇప్పటికే వేలాది ఎకరాలు కబ్జా

రాష్ట్రంలో వేలాది ఎకరాల అసైన్డ్ భూములు అన్యాక్రాంతం అయినట్టు స్వయంగా కాగ్ (కంట్రోలర్ అండ్ జనరల్) –2020  రిపోర్టు వెల్లడించింది. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 12 వేల ఎకరాల భూములు కబ్జాకు గురైనట్టు తెలిపింది. ఈ భూములు ఆక్రమణలకు గురవుతున్నా సీసీఎల్ఏ అధికారులు పట్టించుకోలేదని, అదే సమయంలో ప్రభుత్వం ఆ భూములను కాపాడేందుకు ఎలాంటి ప్రయత్నం చేయలేని రిపోర్టులో తప్పుబట్టింది.  

ఇచ్చినంత తీసుకోవాలే 

అసైన్డ్​ భూముల లబ్ధిదారులు ఆ భూములను బహిరంగ మార్కెట్​లో  విక్రయించే  వెసులుబాటు చట్టంలో లేదు. ప్రజా అవసరాల కోసం ఎప్పుడైనా అసైన్డ్ భూములను వెనక్కి తీసుకునే అధికారం ప్రభుత్వానికి ఉంది. ఈ ఒక్క నిబంధనను అడ్డం పెట్టుకొని ప్రభుత్వం అసైన్డ్ ల్యాండ్స్ ను వెనక్కి తీసుకుని ఫుడ్  ప్రాసెసింగ్ యూనిట్స్​కు  కేటాయించేందుకు సిద్ధమవుతున్నట్టు ఆఫీసర్లు చెప్తున్నారు. సరెండ్​ చేసే భూములకు  సంబంధించి రైతులకు మార్కెట్ రేటు ప్రకారం పరిహారం కట్టివ్వడం కష్టమని ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి. అలా చెల్లించాల్సి వస్తే వేల కోట్ల బడ్జెట్ అవసరం అని చెప్తున్నాయి. అందుకని ఎంతో కొంత రైతులకు ఇచ్చే చాన్స్ ఉందని రెవెన్యూ శాఖకు చెందిన ఓ సీనియర్  ఆఫీసర్  అన్నారు. ‘‘ప్రభుత్వం ఎంత ఇస్తే అంత తీసుకోవాలి. డిమాండ్ చేసే పరిస్థితి ఉండదు. రైతుల నుంచి తీసుకున్న భూములను ఆ తర్వాత ప్రైవేటు వ్యక్తులకు కేటాయిస్తాం’’ అని ఆయన వివరించారు.