- ప్రతి స్కూల్ కు రూ.లక్ష కేటాయింపు
- ఇన్ స్ట్రక్టర్లు, ఆయాల నియామకానికి చర్యలు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని మరిన్ని సర్కారు బడుల్లో ప్రీ-ప్రైమరీ క్లాసులు ప్రారంభించేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 2026-27 విద్యా సంవత్సరం నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఎంపిక చేసిన 2,769 ప్రభుత్వ, లోకల్ బాడీ ప్రైమరీ, అప్పర్ ప్రైమరీ స్కూళ్లలో ప్రీ-ప్రైమరీ సెక్షన్లను ప్రారంభించనున్నారు. ఈ మేరకు స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ డాక్టర్ ఈ. నవీన్ నికోలస్ ఉత్తర్వులు జారీచేశారు.
ఈ మొత్తం సెక్షన్లు 529 క్యూర్ రీజియన్ పరిధిలో, 2,240 నాన్-క్యూర్ రీజియన్ పరిధిలో ఉండనున్నాయి. ప్రీ-ప్రైమరీ సెక్షన్లు ప్రారంభించే ప్రతి స్కూల్ కు మైనర్ రిపేర్లు, ఫర్నిచర్ కొనుగోలు, ఇండోర్, అవుట్ డోర్ ఆట వస్తువులు, ‘బాల’ పెయింటింగ్స్ కోసం రూ. లక్ష చొప్పున నిధులు కేటాయించారు. స్కూల్ వాతావరణం చిన్న పిల్లలకు ఆకర్షణీయంగా ఉండేలా తరగతి గదుల గోడలపై అక్షరాలు, సంఖ్యలు, పక్షులు, జంతువుల చిత్రాలను పెయింటింగ్ వేయించనున్నారు. ఫర్నిచర్, ఆట వస్తువుల కొనుగోలు బాధ్యతను జిల్లా కలెక్టర్ నేతృత్వంలోని కమిటీలకు అప్పగించారు.
- ఇన్ స్ట్రక్టర్లు, ఆయాల నియామకం
ప్రతి ప్రీ-ప్రైమరీ సెక్షన్‌కు ఒక ఇన్ స్ట్రక్టర్, ఒక ఆయాను గౌరవ వేతన ప్రాతిపదికన నియమించనున్నారు. ఇన్ స్ట్రక్టర్లు నెలకు రూ. 8వేలు, ఆయాకు రూ. 6వేల చొప్పున వేతనం చెల్లించనున్నారు. ఇన్ స్ట్రక్టర్ పోస్టుకు ఇంటర్మీడియెట్ కనీస అర్హతగా నిర్ణయించారు. ఎర్లీ చైల్డ్‌హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్ (ఈసీసీఈ) లేదా ప్రైమరీ టీచింగ్‌లో కోర్సు చేసిన వారికి ప్రాధాన్యత ఉంటుంది. ఆయా పోస్టుకు ఏడో తరగతి ఉత్తీర్ణత సాధించి ఉండాలి. స్థానిక నివాసితులకే ఫస్ట్ ప్రెయార్టీ ఇవ్వనున్నారు.
- ప్రీప్రైమరీ చిన్నారులకూ మిడ్డేమీల్స్
ప్రీ-ప్రైమరీ విద్యార్థులకు కూడా మధ్యాహ్న భోజనం అందజేయనున్నారు. అంగన్‌వాడీ కేంద్రాలకు సమీపంలో ఉన్న స్కూళ్లలో విద్యార్థులకు అదనంగా స్నాక్స్ అందిస్తారు. ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో క్రమం తప్పకుండా హెల్త్ చెకప్స్ నిర్వహించి, రికార్డులను నమోదు చేస్తారు. ఎస్సీఈఆర్టీ పాఠ్య ప్రణాళిక ఆధారంగా బోధించనున్నారు.
- జిల్లాల వారీగా సెక్షన్లు ఇలా..
అనుమతి పొందిన 2,769 సెక్షన్లలో అత్యధికంగా హైదరాబాద్ జిల్లాలో 275 ఉన్నాయి. ఆ తర్వాత మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాకు 145 సెక్షన్లు కేటాయించారు. నల్గొండలో 124, భద్రాద్రి కొత్తగూడెంలో 118, నిజామాబాద్‌లో 112, సంగారెడ్డిలో 132 (నాన్-క్యూర్ 110, క్యూర్ 22), రంగారెడ్డిలో 132 (నాన్-క్యూర్ 45, క్యూర్ 87), వికారాబాద్‌లో 104 సెక్షన్లు ఉన్నాయి. అత్యల్పంగా ములుగు జిల్లాలో 36, హనుమకొండ, జనగామ జిల్లాల్లో 39 చొప్పున, జయశంకర్ భూపాలపల్లి, జోగులాంబ గద్వాల జిల్లాల్లో - 41 చొప్పున ఉన్నాయి.
- సెక్షన్లు అనుమతి పొందిన టాప్ జిల్లాలు ఇవే..
హైదరాబాద్ 275
మేడ్చల్ మల్కాజిగిరి 145
రంగారెడ్డి 132
సంగారెడ్డి 132
నల్గొండ 124
భద్రాద్రి కొత్తగూడెం 118
ఖమ్మం 114
నిజామాబాద్ 112
వికారాబాద్ 104
కామారెడ్డి 96
సూర్యాపేట 91
మెదక్ 90
మహబూబ్ నగర్ 85
సిద్దిపేట 84
కుమురం భీం ఆసిఫాబాద్ 77
