కన్నాలలో ఆగని కబ్జాలు  .. నేషనల్​ హైవే 363 పక్కనున్న ఖాళీ జాగలు అన్యాక్రాంతం 

కన్నాలలో ఆగని కబ్జాలు  .. నేషనల్​ హైవే 363 పక్కనున్న ఖాళీ జాగలు అన్యాక్రాంతం 
  • టెంపరరీ షెడ్లు నిర్మించి రూ.లక్షల్లో అమ్ముకునేందుకు ప్లాన్
  • గతంలో అక్రమ కట్టడాలను కూల్చేసిన ఉన్నతాధికారులు
  • మళ్లీ అదే ప్రాంతంలో కబ్జాలకు యత్నం
  • కలెక్టర్, ఆర్డీవో స్పందించాలంటున్న స్థానికులు  

బెల్లంపల్లి, వెలుగు: బెల్లంపల్లి మండలం కన్నాల గ్రామ పంచాయతీ పరిధిలోని కోట్ల విలువైన ప్రభుత్వ భూములు యథేచ్ఛగా అన్యాక్రాంతమవుతున్నాయి. నేషనల్​ హైవే 363ని ఆనుకుని ఉన్న విలువైన ఈ భూములను కబ్జా చేసి దర్జాగా అమ్ముకుంటున్నారు. గతంలో ఈ భూములు కబ్జాకు గురైనట్లు మీడియాలో వార్తలు రావడంతో అప్పటి అడిషనల్ కలెక్టర్ మధుసూదన్ నాయక్, బెల్లంపల్లి ఆర్డీవో శ్యామలాదేవి స్పందించి చర్యలు తీసుకున్నారు. రెవెన్యూ, పోలీస్ సిబ్బందితో కలిసి ఆ భూములను పరిశీలించి జేసీబీలతో అక్రమ కట్టడాలను కూల్చేశారు. అప్పటినుంచి కొద్దిరోజుల పాటు సైలెంట్​గా ఉన్న కబ్జాదారులు ఖాళీ జాగలపై మళ్లీ కన్నేశారు. 

యథేచ్ఛగా అక్రమ నిర్మాణాలు.. 

సర్వేనంబర్​ 112లో 100 ఎకరాలకుపైగా ప్రభుత్వ భూమి ఉండగా.. ఇప్పటికే ఇందులో సుమారు 20 ఎకరాలకు పైగా అన్యాక్రాంతమైంది. గత ప్రభుత్వం హయాంలో అప్పటి ప్రజాప్రతినిధులు, అధికారుల సపోర్టుతోనే ఈ తతంగం నడిచిందన్న ఆరోపణలున్నాయి. కొద్దిరోజులు సైలెంట్​గా ఉన్న కబ్జాదారులు మళ్లీ విజృంభిస్తున్నారు. గతంలో ఉన్నతాధికారులు కూల్చేసిన దగ్గరే తాజాగా మళ్లీ అక్రమ నిర్మాణాలు వెలుస్తున్నాయి. కబ్జా భూమిని చదును చేసి టెంపరరీ షెడ్ల నిర్మాణాల కోసం ఇసుక కుప్పలు పోసి, ఇటుకలు డంప్​చేశారు. ఇంత జరుగుతున్నా అధికారులు చూసీచూనడట్లు వ్యవహరిస్తుండడంతో షెడ్ల నిర్మాణాల కోసం ప్రయత్నాలు ముమ్మరమవుతున్నాయి. 

అడ్డుకుంటే బెదిరింపులు

 రాష్ట్రంలో బీఆర్ఎస్ ​సర్కారు దిగిపోయి కాంగ్రెస్​ ప్రభుత్వం వచ్చింది. బెల్లంపల్లిలోనూ ఎమ్మెల్యే మారాడు. అయినప్పటికీ కొందరు ప్రజాప్రతినిధుల ముసుగులో కబ్జాలకు పాల్పడుతుండడంపై పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. కొత్తగా చిన్న గదులతో అక్రమ షెడ్లు నిర్మిస్తున్నా రెవెన్యూ, పంచాయతీ అధికారులు పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. అలాగే నేషనల్​ హైవేను ఆనుకొని కన్నాల గ్రామ పంచాయతీ శివారులోని రైతు వేదిక పక్కన కూడా భూకబ్జాలు జరుగుతున్నాయి. 141,142,143 సర్వే నంబర్లలోని దాదాపు 3 ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జా చేసేందుకు ప్రజాప్రతినిధుల ముసుగుతో కొందరు ప్రయత్నిస్తున్నారు.

కన్నాల పంచాయతీ పరిధిలో జరుగుతున్న భూకబ్జాల విషయం తెలిసి కొందరు వాటిని అడ్డుకునేందుకు ప్రయత్నించగా.. కబ్జాదారులు బెదిరింపులకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది.  ఇంత జరుగుతున్నా రెవెన్యూ అధికారులు పట్టించుకోకపోవడం అనుమానాలకు తావిస్తోంది. ఇప్పటికైనా కలెక్టర్, బెల్లంపల్లి ఆర్డీవో వెంటనే స్పందించి విలువైన ప్రభుత్వ భూములను కబ్జాల నుంచి కాపాడాలని స్థానికులు కోరుతున్నారు.