రుణమాఫీ కోసం ప్రభుత్వ భూములు కుదువ!

రుణమాఫీ కోసం ప్రభుత్వ భూములు కుదువ!
  • పడావుపడ్డ భూములను బ్యాంకుల్లో తాకట్టు పెట్టి
  • లోన్లు తీసుకోవాలని భావిస్తున్న సర్కార్
  • భూములు అమ్మడం కంటే తనఖా పెట్టడం మేలనే యోచన
  • టీజీఐఐసీ ల్యాండ్ బ్యాంక్ నుంచి భూములు తీసుకోవాలని నిర్ణయం 
  • రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో రూ.48 వేల కోట్ల విలువైన 760 ఎకరాలు గుర్తింపు
  • వీటిలో కొన్నింటిని తనఖాపెట్టి రూ.15 వేల కోట్ల నుంచి రూ.20 వేల కోట్లు సమకూర్చుకోవాలని ప్రణాళిక
  • ఇప్పటికే ఆర్బీఐతో సర్కార్ సంప్రదింపులు

హైదరాబాద్, వెలుగు : రైతుల రుణమాఫీకి అవసరమైన నిధుల కోసం ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తున్నది. వృథాగా ఉన్న ప్రభుత్వ భూములను బ్యాంకుల్లో కుదువపెట్టి లోన్లు తీసుకోవాలని భావిస్తున్నది. ఇట్లయితే రైతుల పంట రుణాలన్నీ ఒకేసారి మాఫీ చేయొచ్చని, ఆర్థిక పరిస్థితి మెరుగుపడగానే తనఖాపెట్టిన భూములను మెల్లమెల్లగా విడిపించుకోవచ్చని ఆలోచన చేస్తున్నది. ఈ మేరకు రంగారెడ్డి, మేడ్చల్​మల్కాజిగిరి జిల్లాల్లో 760 ఎకరాలను ప్రభుత్వం గుర్తించింది. 

వీటి విలువ దాదాపు రూ.48 వేల కోట్లు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. వీటిలో కొన్ని భూములను బ్యాంకుల్లో తనఖా పెట్టడం ద్వారా కనీసం రూ.15 వేల కోట్ల నుంచి రూ.20 వేల కోట్ల వరకు ఏకకాలంలో సమకూర్చుకోవాలని నిర్ణయించారు. ఇప్పటికే ఆర్బీఐ గవర్నర్​తో ఉన్నతాధికారులు సంప్రదింపులు జరుపుతున్నారు. ఆర్బీఐ నుంచి గ్రీన్ సిగ్నల్​వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఆఫీసర్లు చెబుతున్నారు. ఒకవేళ ఆర్బీఐ ఓకే అంటే ఏండ్లుగా పెండింగ్​లో​ఉన్న రైతుల పంట రుణాలు ఏక కాలంలో మాఫీ అవుతాయి. 

సీఎం ముందు పలు ప్రతిపాదనలు..

ఎట్టి పరిస్థితుల్లోనూ ఆగస్టు 15వ తేదీలోగా రూ.2 లక్షల లోపు క్రాప్ లోన్లు మాఫీ చేస్తామని సీఎం రేవంత్​రెడ్డి హామీ ఇచ్చారు. ఈ క్రమంలో నిధుల సర్దుబాటు కోసం అన్ని మార్గాలను సర్కార్ అన్వేషిస్తున్నది. ఆర్థిక శాఖ ఇప్పటికే పలు ప్రతిపాదనలను సీఎం రేవంత్ రెడ్డి ముందుంచింది.

ప్రత్యేక కార్పొరేషన్​ ఏర్పాటు చేసి దానికి ప్రభుత్వం గ్యారంటీగా ఉండి క్రాప్​లోన్ల మాఫీకి అవసరమైన మొత్తాన్ని రుణంగా తీసుకోవాలని మొదట భావించారు. కానీ ఈ అప్పును అదే కార్పొరేషన్​ నుంచి తిరిగి చెల్లిస్తే సమస్య లేదని, లేదంటే ఎఫ్ఆర్​బీఎం పరిధిలోకి తీసుకురావాల్సి ఉంటుందని ప్రభుత్వానికి ఆర్బీఐ స్పష్టం చేసింది. దీంతో ప్రభుత్వ భూములను బ్యాంకుల వద్ద తనఖాపెట్టి పెద్ద మొత్తంలో రుణాలను తీసుకోవాలని అధికారులు రెండో ప్రతిపాదనను సీఎం రేవంత్ ముందుంచారు. ఈ  ప్రభుత్వ భూములను ప్రైవేట్ కంపెనీలకు లీజుకు ఇవ్వడం ద్వారా వస్తున్న ఆదాయంతో అప్పులు తీర్చవచ్చని,  తద్వారా ఈ లోన్లు ఎఫ్ఆర్​బీఎం పరిధిలో రావని వెల్లడించారు. 

దీనిపై అటు కేంద్ర ప్రభుత్వానికి, ఇటు ఆర్బీఐకి ముందే రిక్వెస్ట్​చేస్తే ఎలాంటి సమస్య ఉండదని చెప్పడంతో సీఎం కూడా అంగీకరించినట్టు తెలుస్తున్నది. మరోవైపు కుటుంబం యూనిట్​గా పంట రుణాలు మాఫీ చేస్తే రేషన్ కార్డును ప్రామాణికంగా తీసుకోవాలని భావిస్తున్నారు. ఇక మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ట్యాక్స్ పేయర్స్, ప్రభుత్వ అధికారులు ఇతరత్రా పీఎం కిసాన్​నిబంధనలను కూడా రుణమాఫీ కోసం పెట్టాలని సూత్రప్రాయంగా నిర్ణయించారు. అప్పుడు మాత్రమే అసలైన రైతులకు క్రాప్​లోన్ల మాఫీ జరిగి అనుకున్న లక్ష్యం నెరవేరుతుందని భావిస్తున్నారు. 

ఏంటీ ఎఫ్ఆర్బీఎం సమస్య?   

రాష్ట్రాలు రెండు రకాలుగా అప్పులు తీసుకునే వెసులుబాటు ఉంది. ఒకటి రెగ్యులర్​గా బాండ్ల వేలంలో ఆర్బీఐ నుంచి తీసుకునే అప్పు. ప్రతి ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర జీఎస్డీపీలో 3 శాతం మేర తీసుకోవచ్చు. దీని ప్రకారం 2024–25 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం రూ.60 వేల కోట్లు  తీసుకునే అవకాశం ఉంది. ఇందులో ప్రతినెలా యావరేజ్​గా రూ.4 వేల కోట్లు ఆర్బీఐ నుంచి తీసుకుంటుంది. ఇది కాకుండా నాన్​ఎఫ్ఆర్​బీఎం పరిధిలోనూ అప్పు తీసుకోవచ్చు. ఏదైనా కార్పొరేషన్​కు ప్రభుత్వం గ్యారంటీ ఇవ్వడం ద్వారా తీసుకోవాల్సి ఉంటుంది. కాకపోతే కేంద్రం, ఆర్బీఐ గైడ్​లైన్స్​ ప్రకారం అన్ని పక్కాగా ఉండాలి.  

నాన్​ఎఫ్ఆర్​బీఎంలో కార్పొరేషన్​ నుంచి అప్పు తీసుకోవాలంటే కచ్చితంగా ఆ కార్పొరేషన్​ సొంతంగా ఆదాయం సమకూర్చుకోవాల్సి ఉంటుంది. దేనికోసమైతే అప్పును తీసుకుంటున్నారో, దాన్ని ప్రభుత్వ ఖజానా నుంచి చెల్లించకుండా ఆ కార్పొరేషన్ సొంత ఆదాయం నుంచి చెల్లింపులు చేయాల్సి ఉంటుంది. అందులో భాగంగానే టీజీఐఐసీ లో ఉన్న భూములను తాకట్టు పెట్టాలని అనుకుంటున్నారు. అదే టీజీఐఐసీ వివిధ ఇండస్ర్టీలకు లీజుకు ఇచ్చే భూముల ద్వారా వచ్చే ఆదాయంతో ఆ అప్పును తీరుస్తామని ఆర్బీఐ, బ్యాంకులకు తెలియజేయనున్నారు. ఒకవేళ ఇది కూడా సాధ్యపడని పక్షంలో ఆర్బీఐ నుంచి నేరుగా ఒకేసారి రూ.15 వేల కోట్ల నుంచి రూ.20 వేల కోట్లు ఎఫ్ఆర్​బీఎం పరిధిలోనే తీసుకోవాలనే అభిప్రాయం కూడా ప్రభుత్వం నుంచి వ్యక్తమవుతున్నది.

అమ్మడం ఇష్టం లేకనే.. 

ఇటీవల ఆర్థిక శాఖ అధికారులతో సీఎం రేవంత్​రెడ్డి భేటీ అయ్యారు. ఈ సందర్భంగా గత ప్రభుత్వం సర్కార్ భూములను అమ్మి నిధులు సమకూర్చుకున్నదనే ప్రస్తావన వచ్చింది. కానీ ప్రతిసారీ ప్రభుత్వ భూములను అమ్మడం సరికాదని, దీని వల్ల ఇబ్బందులు వస్తాయని సీఎం స్పష్టం చేసినట్టు తెలిసింది. ఈ క్రమంలోనే తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్​ఫ్రాస్ట్రక్చర్​కార్పొరేషన్​ (టీజీఐఐసీ) దగ్గరున్న ప్రభుత్వ భూముల ల్యాండ్ ​బ్యాంక్ అంశం చర్చకు వచ్చింది. టీజీఐఐసీ పరిశ్రమలకు ప్రభుత్వ భూములను కేటాయిస్తుంది. ఇందుకోసం లీజు రూపంలో కొంత మొత్తం తీసుకునే అవకాశం ఉంది. ఈ భూములను  బ్యాంకుల్లో తనఖా పెట్టి నిధులు తెచ్చుకుంటే బాగుంటుందనే అభిప్రాయానికి సీఎం సహా ఆఫీసర్లు వచ్చారు. 

200 నుంచి 300 ఎకరాలు.. 

ఆర్బీఐలో కొన్ని నిబంధనల కారణంగా భూములను తాకట్టు పెట్టినా కూడా ఎఫ్ఆర్​బీఎం పరిధిలోకి వచ్చే ప్రమాదం ఉందని పలువురు ఆఫీసర్లు సీఎం రేవంత్​దృష్టికి తెచ్చారు. దీంతో  ప్రభుత్వ భూములను తనఖా పెట్టినా ఎఫ్ఆర్​బీఎం పరిధిలోకి రాకుండా ఏం చేయాలనే దానిపై కసరత్తు చేయాలని అధికారులకు సూచించగా, ఆయా భూములను లీజుకు ఇవ్వడం ద్వారా వచ్చే ఆదాయంతో అప్పులు తీర్చుకునేలా ప్రపోజల్స్​రెడీ చేయాలని నిర్ణయించారు. ప్రస్తుతం టీజీఐఐసీ దగ్గరున్న భూముల్లో గతంలో ఎకరా రూ.60 కోట్ల నుంచి రూ.100 కోట్ల వరకు పలికిన ల్యాండ్స్​ఉన్నాయి. ఆ రేటుకు అనుగుణంగా దాదాపు 200 నుంచి 300 ఎకరాలు వివిధ బ్యాంకుల్లో తనఖా పెట్టడం ద్వారా సుమారు రూ.20 వేల కోట్లు సమకూర్చుకోవాలని భావిస్తున్నారు.