
న్యూఢిల్లీ : ఈ ఆర్థిక సంవత్సరం ముగిసే లోపు ఆర్‌బీఐ నుంచి తమకు రూ.30 వేల కోట్ల మధ్యంతర డివిడెండ్ కావాలని కోరేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. 2019–20 ఆర్థిక సంవత్సరానికి నిర్ణయించుకున్న జీడీపీ వాణిజ్య లోటు టార్గెట్ 3.3 శాతానికి పరిమితం చేయడానికి ఈ డివిడెండ్‌ను కోరనున్నట్టు సంబంధిత వర్గాలు చెప్పాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి క్వార్టర్‌లో ఇండియా ఎకానమీ వృద్ధి ఆరేళ్ల కనిష్టానికి పడిపోయిన సంగతి తెలిసిందే. వృద్ధిని పెంచడానికి ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటోంది. వృద్ధి నెమ్మదించడంతో రెవెన్యూ వసూళ్లు తగ్గాయి. దీంతో ప్రభుత్వం ప్రస్తుతం ఒత్తిడిలో కొనసాగుతోంది. ‘అవసరమైతే, ప్రభుత్వం ఆర్‌బీఐ నుంచి ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.25 వేల కోట్ల నుంచి రూ.30 వేల కోట్ల మధ్యంతర డివిడెండ్‌ను కోరనుంది’ అని ప్రభుత్వ అధికారులు తెలిపారు. ఆర్‌బీఐ డివిడెండ్‌తో పాటు, డిజిన్వెస్ట్‌మెంట్ టార్గెట్‌ను ప్రభుత్వం పెంచనున్నట్టు పేర్కొన్నారు. నేషనల్ స్మాల్ సేవింగ్ ఫండ్(ఎన్‌ఎస్ఎస్ఎఫ్)ను ఎక్కువగా వాడుకోవాలని చూస్తున్నట్టు చెప్పారు. 2017–18 ఆర్థిక సంవత్సరంలో ఆర్‌బీఐ నుంచి ప్రభుత్వానికి రూ.10 వేల కోట్ల మధ్యంతర డివిడెండ్ వచ్చింది. గత నెలలో ఆర్‌బీఐ వద్దనున్న మిగులు నిధుల్లో రూ.1,76,051 కోట్లు ప్రభుత్వానికి ట్రాన్స్‌ఫర్ చేసేందుకు గవర్నర్ శక్తికాంత్ దాస్ నేతృత్వంలోని ఆర్‌బీఐ బోర్డు అంగీకరించింది. తన నికర ఆదాయం రూ. 1,23,414 కోట్లలో 2019 మార్చి వరకు ఆర్‌బీఐ రూ.28 వేల కోట్లను మధ్యంతర డివిడెండ్‌గా ప్రభుత్వానికి ఇచ్చేసింది. ప్రభుత్వానికి ఈ ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌లో అంచనావేసిన రూ.90 వేల కోట్ల కంటే అత్యధికంగా రూ.95,414 కోట్ల మధ్యంతర డివిడెండ్ వచ్చింది.
ప్రభుత్వ స్థూల అప్పులు రూ.7.10 లక్షల కోట్లు…
ఈ ఏడాది స్థూల అప్పుల కింద రూ.7.10 లక్షల కోట్లను పొందాలని చూస్తున్నట్టు ప్రభుత్వం బడ్జెట్‌లో పేర్కొంది. 2018–19 ఆర్థిక సంవత్సరంలోని రూ.5.35 లక్షల కోట్ల బారోయింగ్ ప్రొగ్రామ్ కంటే ఇది అత్యధికం. ఆర్థిక వ్యవస్థను ఆరేళ్ల కనిష్ట వృద్ధి నుంచి బయటపడేసేందుకు, 45 ఏళ్ల గరిష్ట నిరుద్యోగ రేటు నుంచి కాపాడేందుకు ప్రభుత్వం కార్పొరేట్ ట్యాక్స్ రేటులోనూ కోత పెట్టింది. దాదాపు 10 శాతం మేర ఈ పన్నులను తగ్గించింది.
మరోసారి వడ్డీ రేట్ల కోత
ఆర్‌బీఐ మరోసారి కీలక వడ్డీ రేట్లను తగ్గించే అవకాశం కనిపిస్తోంది. ఈ ఫెస్టివ్ సీజన్‌లో వృద్ధిని పుంజుకునేలా చేయడానికి ప్రభుత్వం కార్పొరేట్ ట్యాక్స్‌ను తగ్గించడంతో, ఆర్‌బీఐ కూడా రేట్లను మరోసారి తగ్గించనున్నట్టు నిపుణులు అంచనావేస్తున్నారు. ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ నేతృత్వంలోని మానిటరీ పాలసీ కమిటీ తన నాలుగో బై మంత్లీ మానిటరీ పాలసీని అక్టోబర్ 4న ప్రకటించబోతోంది. జనవరి నుంచి ఇప్పటికి ఆర్‌బీఐ రెపో రేటును నాలుగుసార్లు తగ్గించింది. మొత్తంగా 1.10 శాతం కోత పెట్టింది. అంతకుముందు ఆగస్ట్‌లో జరిగిన మీటింగ్‌లో, ఎంపీసీ తన కీలక వడ్డీ రేటు రెపోను 35 బేసిస్ పాయింట్లు తగ్గించి 5.40 శాతానికి కుదించింది. తదుపరి ఆర్‌బీఐ మీటింగ్‌లో బ్యాంక్‌లు తమ లోన్ ప్రొడక్ట్‌లను ఎక్స్‌టర్ననల్ బెంచ్‌మార్క్‌కు అంటే రెపోరేటుకు తప్పనిసరిగా లింక్ చేయాలని ఆదేశించే అవకాశం కనిపిస్తుంది. పాలసీ రేట్లను త్వరత్వరగా వినియోగదారులకు చేరవేయడానికి ఆర్‌బీఐ ఈ నిర్ణయం తీసుకుంటుంది. ప్రభుత్వంతో చేతులు కలుపుతూ.. ఆర్‌బీఐ కూడా ఆర్థిక వృద్ధిని పుంజుకునేలా చేయడం కోసం వడ్డీ రేట్లను మళ్లీ తగ్గిస్తూ తదుపరి చర్యలు తీసుకుంటుందని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇంకో 25 బేసిస్ పాయింట్ల కోత ఉండొచ్చని అంచనావేస్తున్నారు. ఇండియన్ ఎకానమీలో నిర్మాణాత్మక మార్పుల కోసం గత కొన్ని వారాల నుంచి ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటుందని సీబీఆర్‌ఈ ఇండియా, సౌత్ ఈస్ట్ ఆసియా, మిడిల్ ఈస్ట్, ఆఫ్రికా సీఈవో, ఛైర్మన్ అన్షుమాన్ మేగజూన్ చెప్పారు.