
- వెంటనే పార్లమెంట్ ప్రత్యేక సమావేశం నిర్వహించాలి
న్యూఢిల్లీ: ఆపరేషన్ సిందూర్ విషయంలో దేశాన్ని కేంద్ర ప్రభుత్వం తప్పుదోవ పట్టించిందని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే ఫైర్ అయ్యారు. ఈ అంశంపై వెంటనే పార్లమెంట్ ప్రత్యేక సమావేశం నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు. పాకిస్తాన్ పై చేపట్టిన ఆపరేషన్ సిందూర్ లో భారత్ కూడా ఫైటర్ జెట్ లను కోల్పోయిందంటూ సీడీఎస్ జనరల్ అనిల్ చౌహాన్ శనివారం పరోక్షంగా వెల్లడించిన నేపథ్యంలో ఖర్గే ఈ మేరకు ‘ఎక్స్’లో స్పందించారు. సీడీఎస్ ఓ ఇంటర్వ్యూలో పలు విషయాలు వెల్లడించిన తర్వాత అనేక ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయని, వీటికి పార్లమెంట్ లో కేంద్రం సమాధానం చెప్పాలన్నారు.
గతంలో కార్గిల్ యుద్ధం తర్వాత రివ్యూ కమిటీని వేసినట్టుగానే.. ఇప్పుడు ఆపరేషన్ సిందూర్ లో సాధించిన విజయాలు, ఎదుర్కొన్న నష్టాలను తేల్చేందుకు స్వతంత్ర నిపుణుల కమిటీని కూడా నియమించాలని ఆయన డిమాండ్ చేశారు. మన సైనిక బలగాల ధైర్య సాహసాలకు కాంగ్రెస్ పార్టీ సెల్యూట్ చేస్తోందని, అలాగే ప్రస్తుతం దేశ రక్షణ సన్నద్ధతపై వ్యూహాత్మక రివ్యూ చేసుకోవడం కూడా అవసరమన్నారు.
భారత్, పాక్ మధ్య కాల్పుల విరమణ ఘనత తనదేనని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరోసారి ప్రకటించుకున్నారని ఖర్గే గుర్తు చేశారు. సీజ్ ఫైర్ ఒప్పందంలో ఉన్న కండిషన్లు ఏమిటో తెలుసుకోవాలని యావత్తు దేశ ప్రజలు అనుకుంటున్నారని పేర్కొన్నారు. మన బలగాలు వీరోచితంగా పోరాడితే ఆ క్రెడిట్ అంతా ప్రధాని నరేంద్ర మోదీ తీసుకోవడం దారుణమన్నారు. కాగా, సీడీఎస్ జనరల్ అనిల్ చౌహాన్ కామెంట్లపై కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ జైరాం రమేశ్ కూడా స్పందించారు. పాకిస్తాన్ తో నాలుగు రోజుల పాటు జరిగిన పోరాటంలో భారత్ కు జరిగిన నష్టాలపై దేశ ప్రజలకు కేంద్ర ప్రభుత్వం నిజాలు వెల్లడించాలని డిమాండ్ చేశారు.