చెంచుల సమస్యలు ఏడియాన్నే!

చెంచుల సమస్యలు ఏడియాన్నే!
  • హామీలే తప్ప ఏ ఒక్కటీ అమలు కావట్లే..
  • అటవీ ఉత్పత్తులకు దక్కని గిట్టుబాటు ధర
  • అడవిలోకి వెళ్లకుండా అడ్డుకుంటున్న ఫారెస్ట్​ ఆఫీసర్లు

నాగర్​కర్నూల్, వెలుగు: ఏండ్లు గడుస్తున్నా చెంచుల సమస్యలు మాత్రం తీరడం లేదు. తాగునీరు, రోడ్లు, విద్య సౌకర్యాలు నేటికీ వారికి అందని ద్రాక్షగానే ఉన్నాయి. చెంచుల బాగోగులు పట్టించుకోవాల్సిన ఐటీడీఏ దాదాపు మూసివేత స్థితికి చేరింది. ఏడాది పొడవునా ఏదో ఒక స్కీంతో చెంచులకు అండగా నిలిచిన ఐటీడీఏ ఫండ్స్, స్టాఫ్ లేక ఇప్పుడు ఏం చేయలేకపోతోంది. దీంతో పొట్టకు, బట్టకు తిప్పలు తప్పడం లేదని చెంచులు వాపోతున్నారు. నాగర్ కర్నూల్ జిల్లా పరిధి 8 మండలాల్లోని 48 గ్రామ పంచాయతీలు, 111 గ్రామాల్లో దాదాపు 2,500 చెంచు కుటుంబాలు నివసిస్తున్నాయి. జిగురు, ఇప్పపలుకు, ఇప్ప పువ్వు, కానుగ పలుకులు, తేనె, నరమామిడి చెక్క, గుడిపాలేర్లు, చీపురు పుల్లలు, కుంకుడుకాయలు, చింతపండు, విస్తరాకుల వంటి అటవీ ఉత్పత్తులను సేకరించి జీసీసీలో అమ్మితే.. అక్కడ ఇచ్చే ధరలు గిట్టుబాటు కావడం లేదు. మరోవైపు గిరిజనులు, గిరిజనేతరులు సైతం వీటిని సేకరిస్తుండడంతో చెంచులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అడవిలో పులుల సంఖ్య పెరిగిందని, శాకాహార జంతువుల ఉనికికి అడ్డంకి కలుగుతుందన్న కారణంతో అడవిలోకి వెళ్లకుండా ఫారెస్ట్ ఆఫీసర్లు అడ్డుకుంటున్నారు. దీంతో అడవి తల్లినే నమ్ముకున్న చెంచుల బతుకులు ఆగం అవుతున్నాయి. 

నిజాం సర్కారు ప్రత్యేక చర్యలు
80 ఏండ్ల కింద నిజాం సర్కార్ నల్లమలను చెంచు రిజర్వ్​గా ప్రకటించింది. అప్పటి ఫారెస్ట్ సిబ్బందికి వారి బాగోగులు అప్పజెప్పింది. చెంచులకు వ్యవసాయం నేర్పేందుకు వటవర్లపల్లి, అమ్రాబాద్ చుట్టుపక్కల నుంచి గిరిజనులను రప్పించి శిక్షణ ఇప్పించింది. వారికి కావాల్సిన నాగళ్లు, ఎద్దులు, పాల కోసం బర్రెలు,పెంచుకోవడానికి మేకలను సమకూర్చింది. ఆ తర్వాత కాలంలో ఎవరూ కూడా చెంచుల బతుకుదెరువును పెద్దగా పట్టించుకోలేదు. 2005లో అమలులోకి వచ్చిన ఫారెస్ట్ లైఫ్ యాక్ట్​ను అమలు చేసినా చెంచు కుటుంబానికి10 ఎకరాల భూమి, వ్యవసాయానికి యంత్ర సాయం, పెట్టుబడికి భరోసా అందేవి. వారికి అండగా ఉండాల్సింది పోయి నల్లమల అడవిలో క్రూరమృగాల సంచారం పెరిగిందని ప్రభుత్వం ఎద్దులు, బర్రెలు ఇవ్వడం మానేసింది. అటవీ ఉత్పత్తులు సేకరించినా కనీస కూలి గిట్టుబాటు కావడం లేదని చెంచులు అటువైపు చూడటం మానేశారు. సర్కారు ఉపాధి హామీ ద్వారా కూలి పనులు కల్పించి వచ్చిన డబ్బుతో బతుకుమంటోంది. 

మా సమస్యలను పట్టించుకోండి దొర
మహా శివరాత్రి రోజున భౌరాపూర్​ చెంచు జాతరకు వచ్చిన ఎమ్మెల్యే, కలెక్టర్ ముందు చెంచులు వారి సమస్యలను వివరించారు. కొన్ని పెంటలకు మాత్రమే మిషన్​భగీరథ స్కీం కింద బోర్లు వేసి సోలార్​పంపులు పెట్టారని, మిగిలిన పెంటలను వదిలేశారని అప్పాపూర్​సర్పంచ్, చెంచుపెంటల నాయకుడు గురువయ్య చెప్పారు. గతంలో జాతీయ ఉపాధి హామీ పథకంలో చెంచులకు ప్రత్యేకంగా పనులు ఇచ్చేవారని, ఇప్పుడు జనరల్ గా కేటాయించడంతో చెంచులకు అవకాశం లేకుండా పోయిందని వాపోయారు. చెంచుల జాతర  మూడు రోజులపాటు నిర్వహించాల్సి ఉండగా మహాశివరాత్రి రోజుతో ముగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.  చెంచులకు వారి హక్కులు దక్కడం లేదన్నారు. నల్లమల చెంచుపెంటల్లో ఉన్నవారితోపాటు బయటివారిని కలిపి లక్షల మంది చెంచులు ఉన్నట్లు లెక్కలు చూపెడుతున్నారని, ఇది అన్యాయమని వారి దృష్టికి తెచ్చారు. విద్య, ఉపాధి అవకాశాలను మెరుగు పర్చాలని, విద్యుత్​, తాగునీటి వసతి కల్పించాలని కోరారు. దీనిపై కలెక్టర్​ఉదయ్​కుమార్​స్పందిస్తూ చెంచుల సమస్యలు పరిష్కరించేందుకు జిల్లా యంత్రాంగం కృషి చేస్తుందన్నారు. పెంటలలో తాగునీటి సమస్య తీరుస్తామన్నారు. అప్పాపూర్ పెంటలో ఇండ్ల రూఫ్ లీకేజీ సమస్యను తీర్చామని, ఉపాధిహామీ పథకంలో చెంచులకు ప్రత్యేక ప్రాజెక్టు ఇప్పించే విధంగా ప్రయత్నిస్తామన్నారు. చెంచు పిల్లలు ఎత్తుకు తగ్గట్టుగా కాకుండా తక్కువ బరువుతో ఉన్నారని, ఐసీడీఎస్, ​గిరి వికాసం ద్వారా అదనపు పౌష్టికాహారం అందించి పిల్లలను సాధారణ స్థాయికి తీసుకొస్తామని చెప్పారు.

రాష్ట్రం ఏర్పడినా బతుకులేం మారలే..
సమైక్య రాష్ట్రంలో  చెంచుపెంటలు ఎట్లున్నవో ఇప్పుడు అట్లే ఉన్నాయి. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడినా సర్కారు మాత్రం చెంచులకు భరోసా కల్పించలేకపోతోంది. శ్రీశైలం ఐటీడీఏ ప్రాజెక్ట్ ఉన్నప్పుడు కనీసం స్కీంల గురించి చెప్పి లోన్లకు అప్లై చేయించేవారు. రాష్ట్రం విడిపోయిన తర్వాత  నల్లమలలోని మున్ననూర్​కు పీఓ పోస్టు లేని ఒక యూనిట్ వచ్చింది.  ఒక జూనియర్ అసిస్టెంట్​తో ఆఫీస్ నడుస్తోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెంచుల అభివృద్ధి, సంక్షేమం కోసం ఏర్పాటు చేసిన స్కీంలు, నిధుల గురించి చదువురాని చెంచులకు విడమర్చి  చెప్పేవాళ్లే లేరు. తాగునీటి కోసం ఆర్​డబ్ల్యూఎస్ శాఖ బోర్లు, సోలార్ మోటార్లు, పైప్​లైన్లు, ట్యాంకులు ప్రతిపాదించింది. రూ. 5 కోట్లు ఖర్చు చేసి 16 పెంటలకు తాగునీటి వసతి కల్పించారు. మిగిలినచోట్ల పరిస్థితి దయనీయంగా ఉంది.

సర్కారు పట్టించుకోవట్లే..
నిజాం సర్కార్ చెంచులను అరుదైన జాతిగా గుర్తించింది. మా పండుగలు, ఆచారాలు, వ్యవహారాలను గౌరవించింది. సమైక్య రాష్ట్రంలో చెంచుల పేరిట వచ్చిన నిధులను అడ్డంగా దోచుకున్నారు. ప్రత్యేక రాష్ట్రంలోనూ పరిస్థితేం మారలే. ఇప్పుడు స్కీంలు లేవు.. నిధులూ లేవు. ఇప్పటికీ తాగడానికి నీళ్లు, నడవడానికి రోడ్లు, విద్య, వైద్యం కోసం అడుక్కోవాల్సిన పరిస్థితి. చెంచుల బతుకుదెరువు గురించి ప్రభుత్వం పట్టించుకోవాలి. వారి జీవనశైలికి తగిన స్కీంలు రూపొందించి చేయూతనివ్వాలి. ఫారెస్ట్ లైఫ్ యాక్ట్ 2005 అమలు చేస్తే చెంచులకు భరోసా లభిస్తుంది. 
- గురువయ్య, అప్పాపూర్ సర్పంచ్, చెంచుపెంటల నాయకుడు

మీ సమస్యలు తీరుస్తా
త్వరలోనే  చెంచు మహాసభ నిర్వహించి, చెంచుల సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తా. అటవీ శాఖ అధికారులతో వస్తున్న ఇబ్బందులు తొలగించేందుకు జిల్లా కలెక్టర్ తో కలిసి ప్రయత్నిస్తా. 
- గువ్వల బాలరాజు, ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే, అచ్చంపేట