
- నిలిచిపోయిన ప్రభుత్వ కార్యాలయ భవన నిర్మాణాలు
ఖానాపూర్, వెలుగు: ఖానాపూర్లో నూతనంగా నిర్మిస్తున్న పలు ప్రభుత్వ కార్యాలయాల భవన నిర్మాణాలు పూర్తి కాకుండానే మధ్యలో నిలిచిపోయాయి. పట్టణంలోని మెట్ పల్లి ప్రధాన రహదారిపై మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో టీయూఎఫ్ఐ డీసీ పథకం కింద రూ.3.90 కోట్లతో సమీకృత మార్కెట్ నిర్మాణ పనులను 2 ఏళ్ల కింద ప్రారంభించారు. ప్రభుత్వం నిధులను విడుదల చేయకపోవడంతో పనులు ఆగిపోయాయని అధికారులు చెబుతున్నారు. అలాగే ఖానాపూర్లోని విద్యానగర్లో పశువైద్యశాల భవనం ఇంకా పిల్లర్ల దశలో ఉంది.
ఈ భవన నిర్మాణానికి నిధులు ఉన్నప్పటికీ సదరు కాంట్రాక్టర్ పనులు చేయడం లేదని పశువైద్య శాఖ ఏడీ పేర్కొన్నారు. ఖానాపూర్ సబ్ డివిజన్ 5 కార్యాలయానికి సంబంధించి10 శాతం పనులు కూడా పూర్తి కాలేదు. ఇప్పటికైనా ప్రభుత్వ కార్యాలయాల భవనాల నిర్మాణాలను పూర్తి చేసి అందుబాటులోకి తేవాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.