సారు..కారు..ఆన్​ డ్యూటీ

సారు..కారు..ఆన్​ డ్యూటీ

హైదరాబాద్, వెలుగు: ప్రభుత్వ ఆదాయానికి ప్రభుత్వ అధికారులే కన్నం వేస్తున్నారు. అడ్డగోలుగా నిబంధనలను ఉల్లంఘిస్తూ అద్దె వాహనాల పేరుతో అందినకాడికి దండుకుంటున్నారు. ఆ శాఖ ఈ శాఖ అని తేడా లేకుండా గ్రేటర్ పరిధిలోని అన్ని ప్రభుత్వ శాఖల్లో ఈ అద్దె వాహనాల దందా చాలా మందికి కాసులు కురిపిస్తోంది. ప్రభుత్వ ఖజనాకు భారీ నష్టం తెస్తోంది. అన్ని నిబంధనలు తెలిసిన ఉన్నతాధికారులు సైతం ప్రభుత్వ అవసరాలకు వాడాల్సిన వాహనాల కోసం వ్యక్తిగత వాహనాల పేరిట రిజిస్టర్ అయిన వాహనాలను ఎడాపెడా వాడేస్తున్నారు. పైగా ఆన్ గౌట్​డ్యూటీ పేరుతో యథేచ్ఛగా రోడ్లపై తిరిగేస్తూ బిల్లులు తీసేసుకుంటున్నారు.

నిజానికి ప్రభుత్వ అవసరాల కోసం వాడే ప్రతి వాహనానికి ట్యాక్స్ ప్లేట్ ఉండాల్సిందే. కానీ బూతద్దం పెట్టి వెతికినా ప్రభుత్వ కార్యాలయాల్లో వాడే వాహనాలకు ట్యాక్స్ ప్లేట్ కనిపించదు. 99 శాతం వాహనాలకు వైట్ నంబర్ ప్లేటే దర్శనమిస్తుంది. కళ్లముందు స్పష్టంగా కనిపించే ఈ బాగోతాన్ని పట్టించుకునే నాథుడే లేకపోవటంతో ప్రభుత్వం ఏటా పెద్ద ఎత్తున ఆదాయాన్ని కోల్పోతోంది. ఐతే వేలాది మంది ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రం ఇది అదనంగా ఆదాయం తెచ్చే వనరుగా మారింది.

ప్రభుత్వాధికారుల కాసుల కక్కుర్తి

ప్రభుత్వాధికారుల కాసుల కక్కుర్తి కారణంగా అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో యథేచ్ఛగా ఈ దందా సాగుతోంది. 2017 లో తెలంగాణ ప్రభుత్వం ఓ సర్క్యులర్ జారీ చేసింది. దాని ప్రకారం గ్రేటర్ పరిధిలో ప్రభుత్వ కార్యాలయాల పనుల కోసం అద్దెకు తీసుకున్న వాహనాలకు నెలకు రూ.34 వేలు చెల్లించాలని నిర్ణయం చేసింది. దీంతో చాలా మంది ప్రభుత్వ శాఖల్లో ఉన్నతాధికారులు ఆదాయంపై కన్నేశారు. సొంత వాహనాలు లేదంటే బినామీలు, బంధువులకు సంబంధించిన వాహనాలనే ఆఫీస్ అవసరాల కోసం అద్దెకు తీసుకుంటున్నారు.

ఐతే వ్యక్తిగత వాహనాల ద్వారా బిల్లు పెట్టుకోవటం సాధ్యం కాకపోవటంతో కొన్ని ప్రైవేట్ ట్రావెల్స్ కు  సంబంధించిన దొంగ బిల్లులను సబ్​మిట్ చేసి నెల నెల బిల్లులు తీసేసుకుంటున్నారు. ఈ వ్యవహారంలో ఉన్నతస్థాయి అధికారులు కూడా తమ వాహనాలకు బిల్లులను తీసుకోవటం ఆశ్చర్యం కలిగించే విషయం. కొంతమంది అధికారులైతే ఈ వాహనాల దందా లాభదాయకంగా ఉండటంతో పదుల సంఖ్యలో కార్లను కొనుగోలు చేసి వ్యాపారం చేస్తున్నారు.

ప్రభుత్వాదాయానికి గండి

వ్యక్తిగత వాహనాలను ప్రభుత్వ కార్యాలయాల్లోని అధికారులు తమ పనుల కోసం వినియోగిస్తుండటంతో ప్రభుత్వ ఖాజానాకు భారీగా గండి పడుతోంది. వ్యక్తిగత వాహనాలకు, ట్రాన్స్ పోర్ట్ వాహనాలకు పన్ను విషయంలో చాలా తేడాలుంటాయి. ట్రాన్స్ పోర్ట్ వాహనాలైతే ప్రతి త్రై మాసికానికి ఒకసారి ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుంది. ఇది ఆయా వాహనాన్ని బట్టి ఉంటుంది. సాధారణంగా ఫోర్ సీటర్ వాహనానికైతే దాదాపు 3 వేల నుంచి 5 వేల వరకు ట్యాక్స్ ఉంటుంది. ఇలా ఏడాదికి కనీసం 12 వేల రూపాయలు ప్రభుత్వానికి చెల్లించాలి. ట్రాన్స్ పోర్ట్ వాహనాలను ఏడాదికి ఒకసారి ఫిట్ నెస్ టెస్ట్ చేయించాలి. వ్యక్తిగత వాహనాలకు15 ఏళ్ల వరకు ఫిట్ నెస్ టెస్ట్ చేయించాల్సిన పని లేదు. పైగా ఇన్సూరెన్స్ ధర విషయంలోనూ భారీగా తేడా ఉంటుంది.

వ్యక్తిగత వాహనాలకు ఉండే ఇన్సూరెన్స్ ధరతో పోల్చుకుంటే ట్రాన్స్ పోర్ట్ వాహనాలకు ఇన్సూరెన్స్ మూడు రెట్లు ఎక్కువగా ఉంటుంది. ఐతే ట్రాన్స్ పోర్ట్ వాహనాలను కాదని వ్యక్తిగత వాహనాలనే ఇలా ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారులు వాడుతుండటంతో పెద్ద ఎత్తున ప్రభుత్వం ఆదాయం కోల్పోతోంది. ఒక్క గ్రేటర్ పరిధిలోనే ఇలాంటి వాహనాలు దాదాపుగా 5 వేల వరకు ఉంటాయి.  దీని ప్రకారం ఒక్కో వాహనంపై ఏడాదికి 15 వేల రూపాయల చొప్పున లెక్కించినా ఏటా ఏడున్నర కోట్ల రూపాయలు ప్రభుత్వ ఖజానాకు జమ కాకుండా పోతోంది.

ఉపాధి కోల్పోతున్న వేలాది మంది డ్రైవర్లు

ట్రాన్స్ పోర్ట్ వాహనాలకు బదులు వ్యక్తిగత వాహనాలను వాడుతుండటం కారణంగా వేలాది మంది డ్రైవర్లు ఉపాధి కోల్పోతున్నారు. నిరుద్యోగులకు మేలు చేసేందుకు గ్రేటర్ పరిధిలో జీహెచ్ఎంసీ డ్రైవర్ కమ్ ఓనర్ పథకాన్ని ప్రవేశ పెట్టింది. ఈ పథకంలో భాగంగా డ్రైవర్లే ఓనర్ గా ఉండేందుకు సబ్సిడీతో కార్లను అందించింది. ఆయా డ్రైవర్లకు ఉపాధి కోసం ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారుల కోసం వీరి వాహనాలే వినియోగించాలని భావించింది. కానీ అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో సొంత వాహనాలనే వాడుతుండటంతో వీరికి ఉపాధి కరువైంది. పైగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల్లో నిరుద్యోగుల కోసం ప్రభుత్వం రాయితీల మీద వాహనాలను కొనుగోలు చేసే అవకాశం కల్పించింది. ఐతే చాలా మంది సరైన గిరాకీ లేక రాయితీ పై అందిస్తున్న వాహనాలను కూడా కొనుగోలు చేయటం లేదు. ఇప్పటికైనా ప్రభుత్వ కార్యాలయాల్లో వ్యక్తిగత వాహనాలను వినియోగించకుండా చర్యలు తీసుకోవాలని పలువురు నిరుద్యోగులు కోరుతున్నారు.

విజిలెన్స్ ఏం చేస్తున్నట్టు?

రోడ్లపై యథేచ్ఛగా ఆన్ గౌట్ ​డ్యూటీ పేరుతో వేల సంఖ్యలో వాహనాలు తిరుగుతున్నా విజిలెన్స్ అధికారులు పట్టించుకోవటం లేదు. ప్రతి ప్రభుత్వ విభాగంలో ఉన్నతాధికారుల వాహనాలు సైతం ఆన్ గవ్ట్ డ్యూటీ పేరుతో తెల్ల నంబర్ ప్లేట్లతో దర్శనమిస్తున్నాయి. ఐతే వీరంతా పెద్ద స్థాయిలో ఉన్న అధికారులే కావటంతో రవాణా శాఖ విజిలెన్స్ అధికారులు ఈ వాహనాల దందా వైపే కన్నెత్తి చూడటం లేదు. అటు ప్రతి డిపార్ట్ మెంట్ లో ఉండే విజిలెన్స్ అధికారులు సైతం ఈ వ్యవహారాన్ని చూసీ చూడనట్లు వదిలేస్తున్నారు.

ఇక వాహనాల బిల్లులు చెల్లించే ఎస్ టీవో, డీటీవో అధికారులు తాము చెల్లిస్తున్న బిల్లుల విషయంలో నిఘా పెట్టటం లేదు. డిపార్ట్ మెంట్ లో ప్రతిరోజు నడిచే వాహనాలకు బిల్లులో పెడుతున్న వాహనాల నంబర్లకు సంబంధం లేకపోయినా బిల్లులకు ఆమోదం వేసేస్తున్నారు. ప్రైవేట్ ట్రావెల్స్ కు కొంత ముట్టజెప్పి నకిలీ బిల్లులను పెట్టటమనేది ఇక్కడ సాధారణ చర్యగా మారిపోయింది.

2017 లో ప్రభుత్వం  జారీ చేసిన సర్క్యులర్ ప్రకారం

గ్రేటర్ పరిధిలో ప్రభుత్వ శాఖలకు నడిపే వాహనాలకు నెలకు రూ.34,000

అద్దె వాహనాలకు కచ్చితంగా ట్యాక్స్ ప్లేట్ ఉండాల్సిందే

డ్రైవర్ కు ట్రాన్స్ పోర్ట్ డ్రైవింగ్ లైసెన్స్ తో పాటు బ్యాడ్జ్ ఉండాలి

ఫిట్ నెస్, ఇన్సూరెన్స్, ట్యాక్స్ చెల్లింపులు కచ్చితంగా చేయాలి

ప్రతి 6 నెలలకు పొల్యూషన్ సర్టిఫికెట్ తీసుకోవాలి

నిబంధనలు ఉల్లంఘించిన వాహనాల యజమానులకు బిల్లులు చెల్లించొద్దు

అటెండర్ కు పది వాహనాలు

కోఠిలోని డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ కార్యాలయంలో ఓ అటెండర్ ఈ అద్దె వాహనాల దందా జోరుగా చేస్తున్నాడు. అతని బంధువులకు చెందిన దాదాపు 10 వాహనాలను డీఎంఈ కార్యాలయంలోని అధికారుల కోసం నడిపిస్తున్నాడు. సాధారణ కార్ల నుంచి హోండా లాంటి లగ్జరీ కార్ల వరకు ఉన్నాయి. కొంతమంది డ్రైవర్లను పెట్టి కొన్ని నెలలుగా ఈ దందా చేస్తున్నాడు. వాహనాల బిల్లులకు సంబంధించి ఓ ప్రైవేట్ ట్రావెల్స్ పేరుతో బిల్లులు పొందుతున్నాడు. నెలకు దాదాపుగా 4 లక్షల రూపాయలకు పైగానే ఈ వాహనాల ద్వారా బిల్లులు పొందుతున్నాడు. ఐతే ఈ వాహనాలన్నీ వ్యక్తిగత వాహనాలుగానే రిజిస్టరై ఉన్నాయి. ఐతే ఓ సాధారణ అటెండర్ 10 వాహనాలను అతను పనిచేస్తున్న కార్యాలయంలో అద్దెకు నడిపిస్తుండటంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కొంతమంది అధికారుల అండదండలతోనే అతని వ్యాపారం జోరుగా సాగుతున్నట్లు తెలుస్తోంది.

ట్యాక్స్ ప్లేట్ ఉండాల్సిందే..

government officials using personal cars on rent with on govt duty sticker

ప్రభుత్వ కార్యాలయాలకు వాడే వాహనాలకు కచ్చితంగా ట్యాక్స్ ప్లేట్ ఉండాల్సిందే. వ్యక్తిగత వాహనాల కింద రిజిస్ట్రేషన్ అయిన వాహనాలను ప్రభుత్వ శాఖల పనుల కోసం వినియోగించటం నిబంధనల ఉల్లంఘనే. ఇలాంటి వాహనాల అంశం మా దృష్టికి రాలేదు. నిబంధనలు ఉల్లంఘిస్తూ వినియోగిస్తున్న వాహన యజమానులపై చర్యలు తీసుకుంటాం. ప్రత్యేక డ్రైవ్ ద్వారా ఇలాంటి వాహనాలను గుర్తిస్తాం.

కె.పాపారావు, రవాణా శాఖ విజిలెన్స్
అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ అధికారి