
ప్రముఖ బాలీవుడ్ సింగర్, అస్సాంకు చెందిన జుబీన్ గార్గ్ (52) మృతిచెందారు. ఇవాళ (సెప్టెంబర్ 19న) సింగపూర్‌లో స్కూబా డైవింగ్ చేస్తూ ప్రమాదవశాత్తు సముద్రంలో పడి మరణించారు. జుబీన్ సముద్రంలో పడిన వెంటనే, సింగపూర్ పోలీసులు అతన్ని రక్షించి CPR చేసి సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. కానీ, వైద్యులు అతన్ని రక్షించలేకపోయారు. అయితే, జుబీన్ సెప్టెంబర్ 20 మరియు 21 తేదీల్లో నార్త్-ఈస్ట్ ఇండియా ఫెస్టివల్‌లో పాల్గొనడానికి సింగపూర్‌లో వెళ్లారు.
ఈ విషాదకర సంఘటన.. భారతదేశ సంగీత ప్రపంచంలో ఓ లోతైన శూన్యతను మిగిల్చింది. ఈ క్రమంలో అస్సాం, ఈశాన్య ప్రాంతాలు సింగర్ జుబిన్ మృతిపట్ల నివాళులు అర్పిస్తూ, సంతాపం తెలుపుతున్నారు.
ఈ క్రమంలో నేషనల్ అవార్డు యాక్టర్ ఆదిల్ హుస్సేన్ X వేదికగా ఎమోషనల్ పోస్ట్ పెట్టారు.‘‘సింగపూర్‌లో జరిగిన ప్రమాదంలో సింగర్ జుబీన్ గార్గ్ ఆకస్మిక మరణ వార్త విని షాక్ అయ్యాను. అతని ఆకస్మిక మరణం నన్నెంతో బాధిస్తుంది. అస్సామీ సంగీతం మరియు సంస్కృతికి ఆయన చేసిన కృషి అసాధారణమైనది. ఆయన తన పాటల ద్వారా మన మధ్య జీవిస్తారని’’ పోస్ట్ ద్వారా తెలిపారు.
అలాగే జుబీన్తో తనకున్న బంధాన్ని గుర్తుచేసుకుంటూ ఎమోషనల్ అయ్యారు హుస్సేన్. ‘‘ప్రియమైన జుబీన్, నేను నిన్ను చాలా మిస్ అవుతున్నాను. నీ ప్రేమ, ఆప్యాయతలను ఎప్పటికీ గుర్తుంచుకుంటాను.. మీ ఆత్మకు శాంతి చేకూరాలి. జుబీన్‌కు వీడ్కోలు.. మనం మరొక వైపు కలిసే వరకు... మీ అందమైన స్వరంతో పాడుతూనే ఉండండి మరియు దేవుళ్లను సంతోషపెట్టండి’’ అని భావోద్వేగం అయ్యారు నటుడు ఆదిల్ హుస్సేన్.
Devastated and shocked by the news of Zubeen Garg's sudden death in an accident in Singapore. I am so very sad... His contribution to Assamese music and culture is extraordinary... He will live amongst us through his songs... Dear Zubeen I remember you with lots love and…
— Adil hussain (@_AdilHussain) September 19, 2025
సింగర్ జుబీన్ గార్గ్:
అస్సాం ఫెమస్ సింగర్గా పిలువబడే జుబీన్.. ఓజీ విలన్ ఇమ్రాన్ హష్మీ నటించిన ‘గ్యాంగ్‌స్టర్’ మూవీలో ‘యా అలీ’తో జాతీయ ఖ్యాతిని పొందాడు. అప్పట్లో ఈ సాంగ్ ఇండియా మ్యూజిక్ ఆల్బమ్స్లో చార్ట్‌బస్టర్‌గా నిలిచింది. 'దిల్ తు హి బాటా' (క్రిష్ 3) మరియు 'జానే క్యా చాహే మాన్' (ప్యార్ కే సైడ్ ఎఫెక్ట్స్) వంటి సాంగ్స్తో బాలీవుడ్లో స్టార్ సింగర్గా ఎదిగాడు.
సింగర్ జుబిన్.. హిందీతో పాటు, అస్సామీ, బెంగాలీ, నేపాలీ మరియు అనేక ఇతర ప్రాంతీయ భాషలలో పాటలను పాడి మంచి గుర్తింపు సొంతం చేసుకున్నాడు. ఈ క్రమంలో జుబిన్ ఇండియాతో పాటుగా ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నాడు.