RRR పరిధిలో 3 సిటీలు.. గ్రేటర్ విస్తరణలో మరో కీలక ముందు అడుగు

RRR పరిధిలో 3 సిటీలు.. గ్రేటర్ విస్తరణలో మరో కీలక ముందు అడుగు
  • హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలో ఏర్పాటు  
  • వివరాల సేకరణ బాధ్యతలు సివిల్​ సప్లయ్స్​ క మిషనర్​కు   
  • ఇటీవల బల్దియా ఆఫీసులో సమావేశం
  • విస్తరణపై జనవరిలోపు కొలిక్కి రానున్న ప్రక్రియ
  • పాలసీ మ్యాటర్ డిసైడ్​చేయనున్న ఆస్కీ  
  • వచ్చే ఏడాది జూన్ తర్వాతే గ్రేటర్ ఎన్నికలు  
  • ఫిబ్రవరి 10న ముగియనున్న బల్దియా పాలకమండలి గడువు 

హైదరాబాద్ సిటీ, వెలుగు: గ్రేటర్ విస్తరణకు సంబంధించి మరో అడుగు ముందుకు పడింది. అయితే ముందు అనుకున్నట్లుగా ఔటర్ రింగ్ రోడ్డు(ఓఆర్ఆర్) వరకు కాకుండా రీజినల్ రింగ్ రోడ్డు(ట్రిపుల్​ఆర్) వరకు గ్రేటర్‎ను విస్తరిస్తే పరిపాలన మరింత సులభం అవుతుందని ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తున్నది. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీసు కమిషనరేట్ల పరిధిలో మూడు కార్పొరేషన్లు ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. ఈ మేరకు మూడు కమిషనరేట్ల పరిధిలో ఉన్న కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, గ్రామాల వివరాలు సేకరిస్తోంది. మొత్తం జనాభా ఎంత ఉందని లెక్క తీస్తోంది. ఇందుకు సంబంధించిన బాధ్యతలను ఐపీఎస్​ఆఫీసర్, సివిల్​సప్లయ్స్​కమిషనర్ డీఎస్ చౌహన్‎కు అప్పగించినట్లు సమాచారం. 

ఈ మేరకు ఆయన జీహెచ్ఎంసీ హెడ్ ఆఫీసులో ఇటీవల ఓ సమావేశం నిర్వహించారు. ఇందులో జీహెచ్ఎంసీకి సంబంధించిన వివరాలపై ఆరా తీశారు. మిగతా మున్సిపాలిటీలకు సంబంధించి ఆయా కమిషనర్ల నుంచి వివరాలు సేకరించడంతో పాటు గ్రామపంచాయతీల వివరాలను ఆయా జిల్లాల అధికారుల నుంచి తీసుకుంటున్నారు. అయితే, మూడు గ్రేటర్ సిటీలు ఏర్పాటు కావడం పక్కా అని అంటున్నప్పటికీ, మేయర్లు ముగ్గురు ఉండాలా, లేదా మూడింటికీ కలిపి ఒక్క మేయర్‎నే ఉంచి జోన్ల వారీగా విభజించాలా? అన్నదానిపై చర్చలు జరుపుతున్నారు. మొత్తానికి వచ్చేఏడాది జనవరి లోపు విభజనకు సంబంధించి ఓ కొలిక్కి రానున్నట్లు తెలిసింది.  

ఫిబ్రవరిలో ముగియనున్న గడువు.. 

జీహెచ్ఎంసీ ప్రస్తుత పాలకమండలి గడువు వచ్చే ఏడాది ఫిబ్రవరి10న ముగియనుంది. అయితే ఈ గడువు ముగిసిన తరువాత కూడా మరో ఆరునెలల నుంచి ఏడాది వరకు గ్రేటర్ ఎన్నికలు జరిగేలా కనిపించడంలేదు. గ్రేటర్ విస్తరణ తరువాత ఒకేసారి మూడింటికి ఎన్నికలు పెట్టే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. ఇప్పటికే రంగారెడ్డి, మేడ్చల్–మల్కాజిగిరి, సంగారెడ్డి జిల్లాలకు సంబంధించి గ్రేటర్ శివారులోని 51 గ్రామ పంచాయతీలను స్థానిక మున్సిపాలిటీల్లో ప్రభుత్వం విలీనం చేసింది. ఈ ఏడాది జనవరి 26న మున్సిపాలిటీ పదవీ కాలం కూడా ముగిసింది. ఇప్పుడు స్పెషల్ ఆఫీసర్ల పాలన కొనసాగుతోంది. జీహెచ్ఎంసీ గడువు ముగిసేలోపు విలీనానికి సంబంధించి తుది నిర్ణయం తీసుకొని, ఆ తరువాత విస్తరణ చేయనున్నట్లు తెలిసింది. ఇందుకు సంబంధించిన పాలసీ మ్యాటర్ నిర్ణయాన్ని ఆస్కీకి అప్పగించే అవకాశం ఉంది.  

రెండు కోట్లకుపైగా జనాభా..  

ట్రిపుల్ ఆర్ పరిధిలో 2 కోట్లకు పైగా జనాభా ఉంది. రాష్ట్రంలో సగం వరకు జనాభా ఈ పరిధిలోనే ఉంది. మూడు కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తే ఒక్కో దాంట్లో 70 లక్షల జనాభా ఉండనుంది. అప్పుడు మూడు కార్పొరేషన్లు కూడా గ్రేటర్ సిటీగా డెవలప్ అయ్యే చాన్స్ ఉంది. కేంద్రం నుంచి గ్రేటర్ సిటీలకు వచ్చే నిధులు కూడా మూడింటికి సమానంగా వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే హెచ్ఎండీఏ పరిధి ట్రిపుల్ ఆర్ ను దాటి వెళ్లింది. 

ఈ నేపథ్యంలోనే ట్రిపుల్ ఆర్ పరిధిలో గ్రేటర్ ను విస్తరించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. పాపులేషన్ ని బట్టి మూడు సిటీల్లో వార్డులను విభజించనున్నారు. అవసరాన్ని బట్టి ఒక్కో కార్పొరేషన్ లో 100 నుంచి 120 వరకు వార్డులను విభంజించే అవకాశముంది. మూడు గ్రేటర్ సిటీలకు గాను ముగ్గురు కమిషనర్లు ఉండనున్నారు. పోలీసు కమిషనర్లు కూడా ముగ్గురు ఉండటంతో డెవలప్మెంట్ తో పాటు లా అండ్ ఆర్డర్ విషయంలోనూ  ఇబ్బందులు లేకుండా చూడవచ్చని సర్కార్ యోచిస్తున్నట్టు సమాచారం.