గ్రేటర్‌ ఎన్నికల ముందే డబుల్‌ ఇండ్ల ఓపెనింగ్​

గ్రేటర్‌ ఎన్నికల ముందే డబుల్‌ ఇండ్ల ఓపెనింగ్​
  • డబుల్​ బెడ్రూం ఇండ్లపై సర్కారు యోచన
  • జీహెచ్​ఎంసీ ఎన్నికల టైంలో ఇస్తే లాభమని భావన
  • పనులు వేగం చేయాలని ఇటీవల సీఎం ఆదేశం
  • 90% పూర్తయిన 50 వేల డబుల్​బెడ్రూం ఇండ్లు
  • కొల్లూరు మెగా ప్రాజెక్ట్​ దాదాపు పూర్తి
  • దేశంలోనే పెద్దదంటున్న అధికారులు
  • కాంట్రాక్టర్లకు రూ.900 కోట్ల బిల్లులు పెండింగ్​
  • మరో లక్ష ఇండ్లుకూ ఎన్నికల ప్రచారంలో హామీ?

హైదరాబాద్ , వెలుగు:

జీహెచ్​ఎంసీ ఎన్నికల ముందే గ్రేటర్​ పరిధిలోని డబుల్​ బెడ్రూం ఇళ్లను ప్రారంభించాలని సర్కారు భావిస్తోంది. ఎన్నికల టైంలో లబ్ధిదారులకు ఇళ్లు అందజేస్తే తామూ ఎన్నికల్లో లాభపడొచ్చన్న ఆలోచనలో సర్కారు ఉన్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం వివిధ జిల్లాల్లో లక్షా 80 వేల డబుల్​ బెడ్రూం ఇళ్లను కడుతున్న ప్రభుత్వం, ఒక్క గ్రేటర్​ పరిధిలోనే లక్ష ఇళ్లను నిర్మిస్తోంది. వాటిలో దాదాపు 50 వేల ఇళ్లు చివరి దశకు చేరుకున్నాయి. ఇటీవల కలెక్టర్ల సమావేశం, కేబినెట్​ భేటీల్లో డబుల్​ ఇళ్ల నిర్మాణాన్ని వేగవంతం చేయాల్సిందిగా సీఎం కేసీఆర్​ ఆదేశించారు.ప్రత్యేకించి గ్రేటర్​లో కడుతున్న వాటిపై ఎక్కువ ఫోకస్​ పెట్టాలన్నారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జీహెచ్​ఎంసీ ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో, వీలైనంత తొందరగా ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేయాల్సిందిగా సీఎం ఆదేశించినట్టు తెలుస్తోంది. అయితే, మూడు లేదా ఆరు నెలల ముందే ఎన్నికలకు వెళ్లాలన్న యోచనలోనూ సర్కారున్నట్టు తెలుస్తోంది.

కొల్లూరులో మెగా ప్రాజెక్టు

పటాన్​చెరు శివారులోని కొల్లూరులో ప్రభుత్వం ఓ మెగా ప్రాజెక్ట్​ కడుతోంది. 124 ఎకరాల్లో 117 బ్లాకులతో 15,660 డబుల్​ బెడ్రూం ఇళ్లను కడుతోంది. దానికి  రూ.1,354.59 కోట్లు ఖర్చు పెడుతోంది. ఈ ప్రాజెక్ట్​ చివరి దశకు చేరుకుంది. ఇళ్ల నిర్మాణం పూర్తి కాగా, మౌలిక వసతులకు సంబంధించిన పనులు నడుస్తున్నాయి. ఈ ప్రాజెక్ట్​ దేశంలోనే అతిపెద్దదని ఆర్​అండ్​ బీ అధికారులు చెబుతున్నారు. సూపర్​మార్కెట్లు, పెట్రోల్​ బంక్​, జిమ్​, ఆడిటోరియం, అండర్​గ్రౌండ్​ డ్రైనేజీ, స్కూల్​, కాలేజీ, బస్టాప్​, పోలీస్​స్టేషన్​, ఫైర్​స్టేషన్​, ఎస్టీపీ, సోలార్​పవర్​ వంటి సౌకర్యాలను కల్పిస్తున్నారు. కుత్బుల్లాపూర్​ నియోజకవర్గంలో గండిమైసమ్మ సర్కిల్​, దుండిగల్​, బౌరంపేట వద్ద 5 వేలకు పైగా ఇళ్లు నిర్మిస్తున్నారు. ఇవీ చివరి దశలోనే ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు. కాగా, డబుల్​ ఇళ్ల నిర్మాణానికి పెండింగ్​ బిల్లులు అడ్డంకిగా మారాయి. కాంట్రాక్టర్లకు టైమ్​కు బిల్లులు చెల్లించకపోవడంతో పనులు ఆలస్యమవుతున్నాయి. రాష్ట్రమంతా కలిపి రూ.1,500 కోట్ల మేర బిల్లులు పెండింగ్​లో ఉండగా, ఒక్క గ్రేటర్​ పరిధిలోనే రూ.900 కోట్లు పెండింగ్​లో ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు.

ఇంకో లక్ష ఇళ్లు?

ప్రస్తుతం గ్రేటర్​ పరిధిలో నిర్మిస్తున్న లక్ష ఇళ్లకు తోడు, మరో లక్ష ఇళ్లకు ఎన్నికల ప్రచారంలో భాగంగా హామీ ఇవ్వబోతున్నట్టు పార్టీ వర్గాల్లో చర్చ సాగుతోంది. ఇప్పటికే ఈ విషయంపై జీహెచ్​ఎంసీ అధికారులకు సర్కారు ఆదేశాలిచ్చినట్టు తెలుస్తోంది. జంటనగరాల పరిధిలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ భూములు, వాటిలో ఇళ్ల నిర్మాణానికి అనువైన స్థలాలకు సంబంధించి నివేదిక ఇవ్వాల్సిందిగా జీహెచ్​ఎంసీ కమిషనర్​, హైదరాబాద్​, రంగారెడ్డి కలెక్టర్లకు ఆదేశాలు వెళ్లినట్టు సమాచారం. ఇక, గ్రేటర్​లో డబుల్  ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్న వారి సంఖ్య 5 లక్షలు దాటింది. ఇప్పటికీ ప్రతి సోమవారం నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమాల్లోనూ అప్లికేషన్లు తీసుకోవాల్సిందిగా ప్రజలు ఒత్తిడి చేస్తున్నారు. దీంతో మీసేవా కేంద్రాల్లో అప్లై చేసుకోవాల్సిందిగా అధికారులు సూచిస్తున్నారు.

చివరి దశలో నిర్మాణాలు

గ్రేటర్​ పరిధిలో ఇళ్ల నిర్మాణం వేగంగా సాగుతోందని జీహెచ్​ఎంసీ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. ఇప్పటిదాకా 8 వేల ఇళ్లు పూర్తయ్యాయన్నారు. మరో 50 వేల ఇళ్లు 85 శాతంపైగా కంప్లీట్​ అయ్యాయని చెప్పారు. కొల్లూరులో 15 వేల ఇళ్ల నిర్మాణం చివరి దశకు చేరుకుందన్నారు. కుత్బుల్లాపూర్​, దుండిగల్​, రాంపల్లి, కుర్మగూడ ప్రాంతాల్లో  ఒక్కోచోట 2 వేలకు పైగా ఇళ్ల నిర్మాణం కొనసాగుతోందన్నారు. పెండింగ్​లో ఉన్న రూ.900 కోట్ల బిల్లులను త్వరలోనే హౌసింగ్​ శాఖ విడుదల చేస్తుందన్నారు.