కేయూ డీపీఆర్కు మోక్షమెప్పుడో ? కాకతీయ యూనివర్సిటీ ప్రక్షాళనకు ప్రభుత్వం ప్లాన్

కేయూ డీపీఆర్కు మోక్షమెప్పుడో ? కాకతీయ యూనివర్సిటీ ప్రక్షాళనకు ప్రభుత్వం ప్లాన్
  • ప్రతిపాదనల కోసం 16 మంది ప్రొఫెసర్లతో ప్రత్యేక కమిటీ
  • ఐదేండ్ల అవసరాలే ప్రామాణికంగా సమగ్ర నివేదిక రెడీ 
  • ప్రభుత్వం స్పందిస్తేనే యూనివర్సిటీ డెవలప్​మెంట్​కు అడుగులు

హనుమకొండ, వెలుగు: కాకతీయ యూనివర్సిటీలో నెలకొన్న సమస్యల పరిష్కారంతో పాటు సమగ్ర అభివృద్ధి కోసం రూపొందించిన డీటైల్డ్  ప్రాజెక్ట్​ రిపోర్ట్(డీపీఆర్)కు మోక్షం కలగడం లేదు. వర్సిటీ భూ సమస్యలు, స్టాఫ్​ కొరత, కొత్త కోర్సులు, రీసెర్చ్ యాక్టివిటీస్​ పెంచడం.. ఇలా వివిధ అంశాలతో ఐదేండ్ల అవసరాలను ప్రామాణికంగా తీసుకుని ప్రణాళిక రెడీ చేసినా.. ఇప్పటి వరకు దానికి ఆమోదం లభించడం లేదు. దీంతో రాష్ట్రంలో ఉస్మానియా తరువాత అంతటి పేరున్న కేయూ సమస్యలతో సతమతమవుతోంది.

సమస్యలకు నిలయంగా కేయూ..
గత ప్రభుత్వం పట్టించుకోకవడంతో వర్సిటీలు తీవ్ర నిర్లక్ష్యానికి గురయ్యాయి. కేయూలో సిబ్బంది వేతనాలు, పింఛన్లకు కూడా సరిపోయే బడ్జెట్​ కూడా కేటాయించలేదు. టీచింగ్, నాన్​ టీచింగ్  స్టాఫ్​ పోస్టులు భర్తీ చేయకపోవడం, దశాబ్దాల కిందటి పుస్తకాలు, డెవలప్​మెంట్​కు నోచుకోని ల్యాబ్​లు, విద్యార్థుల సంఖ్యకు సరిపోని హాస్టళ్లతో స్టూడెంట్లు ఇబ్బందులు పడుతున్నారు.

మారుతున్న కాలానికి అనుగుణంగా కొత్త కోర్సులు ప్రవేశ పెట్టకుండా, మూస పద్ధతిలోనే బోధన జరగడం, వర్సిటీ భూముల ఆక్రమణకు గురి కావడం, పీహెచ్​డీ సీట్ల కేటాయింపులో అక్రమాలు జరిగాయనే ఆరోపణలు రావడం, ఆఫీసర్లు ఏసీబీకి చిక్కడం, ఏకంగా మాజీ వీసీలపై విజిలెన్స్​ విచారణ జరుగుతుండడం వంటి అనేక వివాదాలకు కేయూ కేరాఫ్​గా మారిందని అంటున్నారు. ఈ నేపథ్యంలో  గత ఏడాది రాష్ట్ర ప్రభుత్వం కేయూ ప్రక్షాళనకు చర్యలు చేపట్టాలని ఇక్కడి లీడర్లు, ఆఫీసర్లను ఆదేశించింది. వర్సిటీలో సమస్యల పరిష్కారం, సమగ్ర అభివృద్ధికి డీపీఆర్​ రెడీ చేయాలని సూచించింది.

ఐదేండ్ల ప్రణాళికతో డీపీఆర్..​
యూనివర్సిటీ డెవలప్​మెంట్​ కోసం ఐదేండ్ల కాలాన్ని ప్రామాణికంగా తీసుకుని డీపీఆర్​ తయారు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. స్థానిక ప్రజాప్రతినిధులు, కేయూ అధికారులు గత నవంబర్​ లో ప్రత్యేకంగా సమావేశమై గత ఏడాది నవంబర్​లో 16 మంది ప్రొఫెసర్లతో కమిటీ ఏర్పాటు చేశారు. ఇందులో కేయూ కాలేజీ  డెవలప్ మెంట్​ కౌన్సిల్  డీన్​ను చైర్మన్​గా, యూజీసీ యూనిట్  కో ఆర్డినేటింగ్  ఆఫీసర్ ను మెంబర్  కన్వీనర్​గా ఏర్పాటు చేశారు. 

మరో 14 మంది వివిధ డిపార్ట్​మెంట్ల ప్రొఫెసర్లతో ఈ కమిటీ ఏర్పాటు కాగా, ఒకటి, రెండు మీటింగ్ లు నిర్వహించారు. వర్సిటీలో కొత్త కోర్సులు, భూఆక్రమణల తొలగింపు, కాంపౌండ్  నిర్మాణం, కొత్త హాస్టళ్ల ఏర్పాటు, స్కిల్  డెవలప్​మెంట్​ సెంటర్ల ఏర్పాటు, రీసెర్చ్ లకు అవసరమైన మౌలిక వసతులు కల్పించడం, సదుపాయాల కల్పన, ఇలా పలు పనుల కోసం ప్రణాళికలు రూపొందించారు. .

ఆరు నెలలుగా ప్రపోజల్స్​ పెండింగ్..
యూనివర్సిటీ సమగ్రాభివృద్ధికి కమిటీ ఆధ్వర్యంలో రూ.వంద కోట్ల విలువైన పనులకు ప్రతిపాదనలు పంపించారు. ఆరు నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు డీపీఆర్​పై ఎలాంటి క్లారిటీ రాలేదు. ఆ రిపోర్ట్  ప్రభుత్వం వద్దే పెండింగ్​ లో ఉండగా.. వర్సిటీ ప్రక్షాళన, డెవలప్​ మెంట్  ఎప్పుడు జరుగుతుందోనని ఎదురుచూస్తున్నారు. రాష్ట్రంలో రెండో అతిపెద్ద యూనివర్సిటీగా పేరున్న కేయూ వచ్చే ఆగస్టు నెలలో గోల్డెన్​ జూబ్లీ వేడుకలకు సిద్ధమవుతుండగా, ఆ లోగా వర్సిటీ డెవలప్​మెంట్​కు ప్రభుత్వం, ఆఫీసర్లు చొరవ తీసుకోవాలని విద్యార్థి సంఘాల నేతలు కోరుతున్నారు.