
హైదరాబాద్, వెలుగు: సర్కారు జాగలను, రాజీవ్ స్వగృహ ప్రాపర్టీలను వేలం వేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. పది జిల్లాల్లోని 19 ప్రాపర్టీలను వచ్చే నెల 14న వేలం వేయనున్నారు. ఈ మేరకు ఆదిలాబాద్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నిజామాబాద్, నల్గొండ, కరీంనగర్, వికారాబాద్, మేడ్చల్, రంగారెడ్డి, ఖమ్మం జిల్లాల కలెక్టర్లు, హౌసింగ్, రాజీవ్ స్వగృహ కార్పొరేషన్, హెచ్ఎండీఏ, టీఎస్ఐఐసీ అధికారులతో శనివారం ఇన్ చార్జ్ సీఎస్ అరవింద్ కుమార్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ19 ప్రాపర్టీస్ లో ఓపెన్ ల్యాండ్, ఇండ్లు, కమర్షియల్ ఫ్లాట్ లు ఉన్నాయి. ఈ నెల11న ఏ ప్రాపర్టీస్ వేలం వేస్తున్నరో నోటిఫై చేయాలని, వచ్చే నెల14న ఆన్ లైన్, ఆఫ్ లైన్ విధానంలో వేలం పాట నిర్వహించాలని అరవింద్ కుమార్ ఆదేశించారు. జిల్లాల్లో కలెక్టర్ల అధ్యక్షతన వేలం పాట ఆఫ్ లైన్లో, హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రాపర్టీస్‌కు హెచ్ఎండీఏ, టీఎస్ ఐఐసీ ఆధ్వర్యంలో ఆన్ లైన్ ఆక్షన్ నిర్వహించనున్నట్లు తెలిపారు.
తొర్రూర్, తుర్కయాంజాల్, బహదూర్ పల్లి, కుర్మాల్ గూడ, అమిస్తాపూర్ ( మహబూబ్ నగర్ ) ప్రాపర్టీస్ ను హెచ్ఎండీఏ, చందానగర్, కవాడిపల్లి ప్రాపర్టీస్ ను టీఎస్ ఐఐసీ ఆధ్వర్యంలో వేలం వేస్తారని తెలిపారు. ఈ 19 ప్రాపర్టీస్ సమాచారం అంతా ఆయా ప్రభుత్వ వెబ్ సైట్లలో అందుబాటులో ఉంచాలని, యాడ్స్ ఇవ్వాలని సూచించారు. అత్యధికంగా ఖమ్మంలో 6 ఎకరాల 9 గుంటలు ఉండగా ఎకరా రూ.3 కోట్లుగా ఖరారు చేశామన్నారు.