సర్కారు ప్రీ ప్రైమరీ క్లాసులకు మంచి రెస్పాన్స్.. 1,302 బడుల్లో 16 వేల మంది చిన్నారులు

సర్కారు ప్రీ ప్రైమరీ క్లాసులకు మంచి రెస్పాన్స్.. 1,302 బడుల్లో 16 వేల మంది చిన్నారులు
  • ఇప్పటికే  1,302 బడుల్లో 16 వేల మంది చిన్నారులు 
  •     మరో 380 బడుల్లో ఏఏపీసీలు, హెడ్మాస్టర్ల నిర్వహణ 
  •     వచ్చే ఏడాది మరో 2700 స్కూళ్లలో  ప్రీ ప్రైమరీ క్లాసులు
  •     డీఈఓల నుంచి డేటా ఇవ్వాలని కోరిన విద్యాశాఖ 
  •     మూడేండ్లకే బడులకు పంపేందుకు పేరెంట్స్ మొగ్గు 
  •     ప్రస్తుతం ప్రీప్రైమరీలో 6 లక్షలకు పైగా చిన్నారులు

హైదరాబాద్, వెలుగు: కొత్తగా ఏర్పాటుచేసిన ప్రీ ప్రైమరీ క్లాసులు  ద్వారా రాష్ట్రంలోని సర్కారు బడుల రూపురేఖలు క్రమంగా మారుతున్నాయి. ప్రైవేట్ స్కూళ్ల  దోపిడీకి అడ్డుకట్ట వేయడంతోపాటు ప్రభుత్వ స్కూళ్లలో అడ్మిషన్లు పెంచే లక్ష్యంతో గతేడాది పైలెట్​ప్రాజెక్టుగా వెయ్యి చోట్ల ప్రారంభించిన ప్రీ ప్రైమరీ క్లాసులకు మంచి రెస్పాన్స్ వస్తోంది.  రెండేండ్ల కిందటి వరకు సర్కారు బడుల్లో ప్రీప్రైమరీ క్లాసులు లేకపోవడంతో, పేద మధ్య తరగతి తల్లిదండ్రులు అప్పులు చేసైనా తమ పిల్లలను ప్రైవేట్ స్కూళ్ల వైపు పంపేవారు. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అవుతోంది. ఇప్పుడు తమ పిల్లలను మూడేండ్లకే సర్కారు బడులకు పంపేందుకు మొగ్గుచూపుతున్నారు. దీంతో వచ్చే ఏడాది నుంచి రాష్ట్రవ్యాప్తంగా వీటిని భారీగా పెంచేందుకు రాష్ట్ర సర్కారు ఏర్పాట్లు చేస్తోంది.

1302 చోట్ల ప్రీ ప్రైమరీ క్లాసులు

ప్రస్తుతం రాష్ట్రంలో అధికారికంగా 1,302 ప్రభుత్వ ప్రైమరీ స్కూళ్లలో  ప్రీ ప్రైమరీ సెక్షన్లు నడుస్తున్నాయి. ఇందులో ఇప్పటికే 16 వేల మందికి పైగా చిన్నారులు అడ్మిషన్లు పొందారు. ఈ స్కూళ్లలో పిల్లల ఆలనా పాలనా చూసేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా ఒక టీచర్ ను, ఒక ఆయాను నియమించింది. టీచర్ కు రూ.8 వేలు, ఆయాకు రూ.6 వేల చొప్పున గౌరవ వేతనం ఇస్తోంది. ప్రైవేటుకు దీటుగా ఇంగ్లీష్ మీడియం బోధన, ఆటపాటలతో కూడిన విద్యావిధానం ఉండటంతో పేరెంట్స్ వీటిలో చేర్పించేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. చిన్నారులను బడులకు రప్పించేందుకు ప్రత్యేకంగా ఇండోర్, ఔట్ డోర్ క్రీడా సామగ్రి, బొమ్మలు, ఆకర్షనీయంగా క్లాసు రూములు, ఇతర వస్తువులను వారికోసం సిద్ధం చేసింది. వచ్చే ఏడాది చిన్నారులకు ‘వెల్ కమ్ కిట్’ తో పాటు బ్రేక్ ఫాస్ట్ కూడా అందించాలని నిర్ణయించింది.

గ్రామస్తులు చొరవ చూపుతున్నరు.. 

సర్కారు అనుమతి కోసం ఎదురుచూడకుండా కొన్ని గ్రామాల్లో  ప్రీప్రైమరీ సెక్షన్ల ఏర్పాటుకు ప్రజలు చొరవ చూపుతున్నారు. ఈ ఏడాది సర్కారు నుంచి పర్మిషన్ రాకపోయినా.. సుమారు 380 బడుల్లో గ్రామస్తులే సొంతంగా చందాలు వేసుకొని ప్రీ ప్రైమరీ క్లాసులు నిర్వహిస్తున్నారు. అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీలు (ఏఏపీసీ), హెడ్మాస్టర్ల చొరవతో అవి నడుస్తున్నాయి. వాటిలో పనిచేసే టీచర్లకు, ఆయాలకు జీతాలు ఇచ్చుకుంటూ బడులను కాపాడుకుంటున్నారు. దీంతో తమ ఊర్లో కూడా ప్రీప్రైమరీ తరగతుల నిర్వహణకు అనుమతులు ఇవ్వాలంటూ సర్పంచులు, హెచ్ఎంలు విద్యాశాఖ అధికారులపై ఒత్తిడి తెస్తున్నారు. 

వచ్చే ఏడాది మరో 2,700 బడులు

సర్పంచులు, హెచ్​ఎంలు,   పేరెంట్స్ నుంచి వస్తున్న డిమాండ్‌‌‌‌ను బట్టి వచ్చే విద్యాసంవత్సరం 2026–27లో మరో 2,700 స్కూళ్లలో ప్రీ ప్రైమరీ తరగతులు ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు సంబంధించి పూర్తి స్థాయి డేటాను పంపాలని డీఈఓలను స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు కోరారు. ప్రీ ప్రైమరీ నడిచే అవకాశం ఉన్న స్కూళ్లు ఎన్ని ఉన్నాయి..? వాటిల్లో అడిషనల్ క్లాసు రూములు ఉన్నాయా..? ఆ స్కూల్ పరిధిలో ప్రీప్రైమరీ ఏజ్ గ్రూపు చిన్నారులు ఎంతమంది ఉన్నారనే వివరాలను కిందిస్థాయి నుంచి సేకరిస్తున్నారు. వచ్చే ఏడాది చిన్నారుల కోసం ప్రత్యేకంగా అడిషనల్ క్లాస్ రూములను ఏర్పాటు చేయనున్నారు. వీటి ఏర్పాటుతో వేలాది పేద కుటుంబాలకు ప్రైవేట్ స్కూళ్ల ఫీజుల భారం తప్పనుంది.

ప్రైవేటులో ఆరు లక్షల మంది.. 

ఇప్పటికీ ప్రైవేట్​పాఠశాలల్లో ప్రీప్రైమరీ క్లాసుల్లో భారీగా అడ్మిషన్లు నమోదవుతున్నాయి. గతంలో సర్కారు బడుల్లో నర్సరీ, ఎల్​కేజీ, యూకేజీ సెక్షన్లు లేకపోవడంతో.. పేరెంట్స్ అంతా ప్రైవేటు బాట పట్టారు. 2014–-15లో కేవలం 1.67 లక్షల మంది చిన్నారులు ఉన్న ఈ సెక్షన్​ లో  2025– -26 నాటికి 6.37 లక్షల మంది చేరడం గమనార్హం. చిన్నారులను ప్రీప్రైమరీ క్లాసుల్లో చేర్పించేందుకు పేరెంట్స్ ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారనేది ఈ లెక్కలే స్పష్టం చేస్తున్నాయి.   అబ్బాయిలతో సమానంగా అమ్మాయిలను కూడా పేరెంట్స్ చిన్న వయసు నుంచే బడికి పంపిస్తున్నారు. 2014లో బాలికల సంఖ్య 74,912 ఉండగా, 2025–-26 నాటికి అది 2,95,713కి చేరుకోనుంది. గ్రామీణ ప్రాంతాల్లో సైతం విద్యపై అవగాహన పెరగడంతో రెండున్నర మూడేండ్ల నుంచే ప్రీప్రైమరీ క్లాసుకలు పంపుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని సర్కారు బడుల్లో ప్రీ ప్రైరీ క్లాసులు ఏర్పాటుచేస్తే ప్రైవేట్​ఆడ్మిషన్లు గణనీయంగా తగ్గుతాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.