సీసీఎస్ ఎన్నికలు పెట్టొద్దని ఆర్టీసీపై ప్రభుత్వం ఒత్తిడి

సీసీఎస్ ఎన్నికలు పెట్టొద్దని ఆర్టీసీపై ప్రభుత్వం ఒత్తిడి

హైదరాబాద్, వెలుగు : ఆర్టీసీ క్రెడిట్ కో ఆపరేటివ్ సొసైటీ(సీసీఎస్) ఎన్నికలకు సర్కారు వెనకడుగు వేస్తోంది. సీసీఎస్ పాలక మండలి గడువు ఏడాది కిందే ముగిసినా ఎన్నికలు నిర్వహించవద్దని ఆర్టీసీ మేనేజ్ మెంట్ ద్వారా కో ఆపరేటివ్ డిపార్ట్ మెంట్ పై ప్రభుత్వం ఒత్తిడి చేయిస్తున్నది. ఎన్నికలు జరిపితే పొలిటికల్​గా తమకు ఇబ్బందులు ఎదురవుతాయని సర్కారు ఆందోళన చెందుతున్నట్లు తెలుస్తోంది. పాలక మండలి గడువు ముగియడంతో ఎన్నికలు పెట్టాలని సీసీఎస్  ఇదివరకే కో ఆపరేటివ్ డిపార్ట్ మెంట్​కు లేఖ రాసింది. మండటి గడువు ఇప్పటికే మూడుసార్లు పొడిగించారు. దీంతో మరోసారి పొడిగించే అవకాశం లేకుండా పోయింది. ఇక కో ఆపరేటివ్ డిపార్ట్ మెంట్ ఏం చేస్తుందన్న దానిపై ఆర్టీసీ కార్మికుల్లో చర్చ మొదలైంది. సీసీఎస్​లో సభ్యత్వం ఉన్న ప్రతి ఆర్టీసీ కార్మికుడు, ఉద్యోగి ఓటు వేయాల్సి ఉంది. సాధారణంగా ప్రతి డిపో, వర్క్ షాప్, బస్ భవన్  ఇలా అన్ని చోట్ల  ఇద్దరు ప్రతినిధులను కార్మికులు, ఉద్యోగులు ఎన్నుకుంటారు. రాష్ర్టం మొత్తం 280  మంది డెలిగేట్లు సీసీఎస్ పాలక మండలిలో 10 మంది డైరెక్టర్లను ఎన్నుకోనున్నారు. గతంలో జరిగిన ఎన్నికల్లో అధికార పార్టీ అనుబంధంగా టీఎంయూ, లెఫ్ట్ పార్టీ కి అనుబంధంగా ఎంప్లాయిస్ యూనియన్ కొన్ని డెరెక్టర్ పదవులను గెలుచుకున్నాయి. మామూలుగా గత పాలకమండలి టర్మ్ ముగిసే టైమ్ లోనే ఎన్నికలు జరుగుతాయి. కొత్త పాలక మండలి వచ్చే వరకు పాత కమిటీ మనుగడలో ఉంటుంది. అయితే ప్రభుత్వం ఒత్తిడి తెచ్చి సీసీఎస్ ఎన్నికలు జరగకుండా చేసింది.

యూనియన్లు యాక్టివ్ అవుతాయనే..

2019 లో ఆర్టీసీ సమ్మె జరిగినప్పటి నుంచి ప్రభుత్వంపై కార్మికులు ఆగ్రహంగా ఉన్నారు. అప్పుడు సీఎం కేసీఆర్ ఆర్టీసీలో యూనియన్లను రద్దు చేశారు. అప్పటి నుంచి సంస్థలో  కార్మికులపై అధికారుల వేధింపులు, పని ఒత్తిడి పెరిగింది.  2 పీఆర్సీలు, 2013 పీఆర్సీ బకాయిలు, ఎస్ఆర్ బీఎస్, రిటైర్డ్ కార్మికుల సెటిల్ మెంట్ వంటి సమస్యలపై కార్మికులు సర్కారుపై ఆగ్రహంగా ఉన్నారు. ఇపుడు ఆర్టీసీ డిపోల్లో ఎన్నికలు పెడితే పొలిటికల్ గా తమకు ఇబ్బందులు వస్తాయని, అది వచ్చే అసెంబ్లీ ఎన్నికలపై ప్రభావం చూపుతుందని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే కో ఆపరేటివ్ డిపార్ట్ మెంట్ పై ఆర్టీసీ మేనేజ్ మెంట్ ద్వారా ఎన్నికలు వద్దని ఒత్తిడి తెస్తోంది. ఎన్నికల్లో అధికార పార్టీ అనుబంధ యూనియన్ ఓడి ప్రతిపక్ష యూనియన్ గెలిస్తే ప్రభుత్వానికి ఇబ్బందులు తలెత్తుతాయని, యూనియన్లు యాక్టివ్ అవుతాయని, కార్మికులు వర్గాలుగా విడిపోతారని ప్రభుత్వం ఆందోళన చెందుతున్నట్లు సమాచారం. 

స్పెషల్ ఆఫీసర్ పాలన

ఎన్నికలకు ప్రభుత్వం వెనకడుగు వేస్తుండడంతో  పాలక మండలి గడువు ముగిసి ఏడాది పూర్తయిన కారణంగా స్పెషల్ ఆఫీసర్ పాలన పెట్టే ప్రతిపాదనను ప్రభుత్వం పరిశీలిస్తోంది. కో ఆపరేటివ్ ఉన్నతాధికారితో మరో ఇద్దరు ఆర్టీసీ అధికారులను కలిపి కమిటీ ఏర్పాటు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. జనరల్ ఎలక్షన్స్ జరిగే వరకు ఇదే కమిటీని కొనసాగించాలని సర్కారు ఆలోచనగా ఉంది.