లీడర్ల గెస్ట్​ హౌస్​ లకు సర్కారు పట్టాలు.. బీఆర్ఎస్ పెద్దలకు కలిసొచ్చిన జీఓ 59 

లీడర్ల గెస్ట్​ హౌస్​ లకు సర్కారు పట్టాలు.. బీఆర్ఎస్ పెద్దలకు కలిసొచ్చిన జీఓ 59 
  •     నాగార్జున సాగర్ క్వార్టర్స్​ను సొంతం చేసుకుంటున్న నేతలు
  •     1,091 మంది జాబితాలో పొలిటీషియన్లు, ఇతర ప్రముఖులు 
  •     లక్షల విలువజేసే జాగలు గజం వెయ్యి రూపాయలకే

నల్గొండ, వెలుగు: నాగార్జున సాగర్ ప్రాజెక్టు పరిధిలో  కోట్లు పలికే  ఎన్ఎస్పీ క్వార్టర్స్​ను బీఆర్ఎస్​లీడర్లు కారుచౌకగా కొట్టేస్తున్నారు. ఇక్కడ బహిరంగ మార్కెట్​లో గజానికి రూ.10 వేల నుంచి రూ.15వేలు పలుకుతుండగా, కేవలం వెయ్యి చొప్పున చెల్లించి సొంతం చేసుకుంటున్నారు. వీరిలో బీఆర్ఎస్​ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ప్రజాప్రతినిధులు ఉన్నారు.  ప్రభుత్వ స్థలాలను రెగ్యులరైజ్ చేసేందుకు సర్కారు తెచ్చిన జీఓ నెం. 59ని  ఇందుకు ఉపయోగించుకుంటున్నారు. నాగార్జునసాగర్​ప్రముఖ పర్యాటక ప్రాంతం కావడం, ప్రపంచస్థాయి ప్రమాణాలతో నిర్మించిన బుద్ధవనం అందుబాటులోకి రావడంతో నందికొండ మున్సిపాలిటీ పరిధిలోని భూములకు డిమాండ్ అమాంతం పెరిగింది. మొదట తెచ్చిన జీఓలో 2014, జూన్ 2 వరకే కటాఫ్ పెట్టిన ప్రభుత్వం ఇటీవల దానిని 2020 జూన్ 2 వరకు పొడిగించింది. దీంతో తెలంగాణ వచ్చాక ఆక్రమించుకున్న సర్కారు జాగలను సైతం లీడర్లు ఈజీగా తమ ఖాతాలో వేసుకుంటున్నారు. 

నాగార్జున సాగర్​లో 1091 క్వార్టర్లు..

నాగార్జున సాగర్ ప్రాజెక్టు నిర్మాణ సమయంలో వివిధ  ప్రాంతాల నుంచి వచ్చిన ఇంజినీర్లు, ఉద్యోగులు ఉండేందుకు వీలుగా ప్రభుత్వం 1,091 క్వార్టర్లను నిర్మించింది. కాలక్రమంలో ఈ క్వార్టర్లు అనేక మంది చేతులు మారుతూ వచ్చాయి. నాగార్జున సాగర్ ప్రముఖ టూరిస్ట్​ ప్లేస్​కావడం, ఇక్కడి ల్యాండ్​కు ఫుల్​ డిమాండ్​ఉండడంతో పొలిటికల్ లీడర్లు, పోలీస్ ఆఫీసర్లు, రిటైర్డ్​ జడ్జీలు.. ఇలా ఎంతో మంది ప్రముఖులు క్వార్టర్లను ఆక్రమించారు.  మొదట్లో గెస్ట్​హౌస్ పేరుతో అలాట్మెంట్ చేయించుకుని అక్కడే ఏళ్ల తరబడి తిష్ట వేశారు. ఇక్కడ గెస్ట్​హౌస్​ ఉండడం ప్రెస్టేజ్​సింబల్​గా మారడంతో ఉమ్మడి నల్గొండ జిల్లా నేతలతో పాటు రాష్ట్రంలోని పలువురు ప్రముఖులు కూడా పైరవీ చేసుకొని కొందరు సొంత పేర్లతో, ఇంకొందరు బినామీ పేర్లతో క్వార్టర్స్ సంపాదించారు. తెలంగాణ వచ్చాక క్వార్టర్లను జాగాతో సహా రెగ్యులరైజ్​ చేయాలనే డిమాండ్లు తెరపైకి తెచ్చారు. ఈ క్రమంలో సాగర్​బై ఎలక్షన్స్ రావడంతో ఎన్నికల ప్రచారానికి వచ్చిన సీఎం కేసీఆర్​.. నందికొండలోని క్వార్టర్లలో నివాసముంటున్న వారందరికీ పర్మినెంట్​హక్కులు కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఈ మేరకు కలెక్టర్ అధ్యక్షతన ఇరిగేషన్ ఆఫీసర్లతో ఓ కమిటీ కూడా వేశారు. పలుదఫాలుగా సర్వే చేసిన కమిటీ.. ఫైనల్​గా హిల్​ కాలనీలోని 6 61, పైలాన్ కాలనీలోని 430 క్వార్టర్స్ మొత్తంగా1,091 క్వార్టర్లకు శాశ్వత హక్కు కల్పించాలని సూచించింది. 

మొదటి నుంచీ లీడర్ల మకాం

తెలంగాణ ఏర్పాటుకు ముందు ఈ క్వార్టర్లలో సీనియర్​ లీడర్​జానారెడ్డితో పాటు అప్పటి ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ లీడర్లు మకాం పెట్టారు. 2014లోనే ఎంపీ హోదాలో గుత్తా సుఖేందర్​రెడ్డి ఓ క్వార్టర్​ఆక్రమించారు. తెలంగాణ వచ్చాక ఈ  క్వార్టర్స్ పై బీఆర్ఎస్ నేతల కన్ను పడింది. పాత ఠాణాగా కొనసాగిన క్వార్టర్​లో ఎంపీ కేశవరావుకు, పాత పోలీస్ స్టేషన్ గెస్ట్​హౌజ్​గా కొనసాగిన క్వార్టర్​లో మంత్రి జగదీశ్​రెడ్డి పాగా వేశారు. ఉప ఎన్నికల టైంలో ఎమ్మెల్సీ, నల్గొండ జిల్లా పార్టీ వ్యవహారాల ఇన్​చార్జి  తక్కెళ్లపల్లి రవీందర్​రావు ఓ క్వార్ట ర్ ఆక్రమించారు. తర్వాత టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు గడ్డంపల్లి రవీందర్ రెడ్డి క్వార్టర్ పొందారు. ఆ తర్వాత మంత్రి జగదీశ్​రెడ్డి, మండలి చైర్మన్ సుఖేందర్ రెడ్డి ముఖ్య అనుచరులకు కూడా క్వార్టర్స్ అలాట్​ చేయడంతో ఈ  వ్యవహారం కాస్తా రచ్చకెక్కింది. దీనిపై కొందరు కోర్టు మెట్లు ఎక్కడంతో కేటాయింపుల ప్రక్రియను అర్ధంతరంగా ఆపేశారు. కానీ ప్రభుత్వ పెద్దల ఒత్తిళ్లతో ఇరిగేషన్ ఆఫీసర్లు గుట్టుచప్పుడు కాకుండా మరో 150 మందికి అలాట్మెంట్ ఆర్డర్లు ఇచ్చేశారు. ఈ క్రమంలో  ఒక్కొక్కరి నుంచి రూ.2 లక్షల వరకు వసూలు చేసినట్లు అప్పట్లో ఆరోపణలు వచ్చాయి. 

కటాఫ్​ తేదీ పొడిగింపుతో.. 

ప్రభుత్వ భూముల్లో ఉన్న ఇండ్లను, ఇండ్ల స్థలాలను రెగ్యులరైజ్ చేసేందుకు తెలంగాణ వచ్చిన కొత్తలో సర్కారు జీఓ నెం. 59 తెచ్చింది. కాకపోతే 2014 జూన్​12కు ముందు ఆక్రమణలో ఉన్న వాటినే రెగ్యులరైజ్​ చేస్తామని అప్పట్లో నిబంధన పెట్టింది. దీంతో తెలంగాణ వచ్చేనాటికి సాగర్​క్వార్టర్లలో ఉంటున్న ప్రముఖులు అప్లై చేసుకొని, రిజిస్ట్రేషన్​ కూడా చేసుకుంటున్నారు. 2014 జూన్ వరకు 630 మందికి డిమాండ్ నోటీసులు జారీ చేయగా, వీరిలో ఇప్పటికే 500 మంది రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. ఇటీవల మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్​రెడ్డి, ఎమ్మెల్సీ కోటి రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ తెర చిన్నపరెడ్డి, వాళ్ల అనుచరులకు పట్టాలు పొందారు. ఇక్కడ బహిరంగ మార్కెట్​లో గజానికి రూ.10 వేల నుంచి రూ.15 వేలు పలుకుతుండగా, కేవలం వెయ్యి చొప్పున చెల్లించి సొంతం చేసుకుంటున్నారు. తాజాగా కటాఫ్​ తేదీని 2020 జూన్ 2 వరకు పొడిగించడంతో ఎంపీలు కె.కేశవరావు,  ఎమ్మెల్యే నోముల భగత్​, పలువురు ప్రజాప్రతినిధులతో పాటు సీనియర్​ పోలీస్ ఆఫీసర్లు, ఇంటెలిజెన్స్ అధికారులు, హైకోర్టు మాజీ జడ్జిలు కూడా అప్లికేషన్లు పెట్టుకుంటున్నారు. కొత్త అప్లికేషన్లు సుమారు 200 దాకా వచ్చే అవకాశముందని, ఆ మేరకు పట్టాల పంపిణీకి ఏర్పాట్లు చేస్తున్నామని ఆఫీసర్లు చెప్పారు.