1,138 డీఎల్ పోస్టులను 491కి తగ్గించిన సర్కారు

1,138 డీఎల్ పోస్టులను 491కి  తగ్గించిన సర్కారు

హైదరాబాద్, వెలుగు: ప్రభుత్వ జూనియర్, డిగ్రీ కాలేజీ లెక్చరర్​ పోస్టుల్లో రాష్ట్ర సర్కారు భారీగా కోత పెట్టింది. ఏండ్లుగా వస్తున్న సాంక్షన్డ్ పోస్టులను రద్దు చేసి.. అరకొర పోస్టుల భర్తీకే అనుమతులిచ్చింది. పోస్టులు ఖాళీగా ఉన్నాయని గెస్ట్ లెక్చరర్లతో క్లాసులు చెప్పిస్తున్నప్పటికీ.. ఆ మొత్తం ఖాళీలను నింపడంలో మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. డిగ్రీ కాలేజీల్లో కామర్స్​, ఎకానమిక్స్​, హిస్టరీ, పొలిటికల్ సైన్స్, జువాలజీ, మాథ్స్ సబ్బెక్ట్ లెక్చరర్ల పోస్టులు పదులు, వందల సంఖ్యలో ఖాళీగా ఉన్నా.. వెకెన్సీ మాత్రం నిల్ గా చూపించింది. తెలుగు, ఇంగ్లీష్​ పోస్టులు భారీగా తగ్గించింది. ఇటీవల రాష్ట్ర ఆర్థిక శాఖ అనుమతులు ఇచ్చిన డీఎల్, జేఎల్ పోస్టుల సంఖ్యను చూసి పీజీ, పీహెచ్​డీలు చేసి, నెట్, సెట్ అర్హత ఉన్న అభ్యర్థులు ఆవేదనకు గురవుతున్నారు. ఉమ్మడి ఏపీ నుంచే 15 ఏండ్లుగా జేఎల్ పోస్టులకు, పదేళ్లుగా డీఎల్ పోస్టులకు ఎలాంటి నోటిఫికేషన్లు రాలేదని, ఇప్పుడైనా ఉన్న పోస్టులన్నీ భర్తీ చేస్తారనుకుంటే వాటిలో కోత పెట్టుడేందని ఆందోళన చెందుతున్నారు. 

మొత్తంగా 647 డీఎల్ పోస్టుల ఎత్తివేత

రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో ఒక సబ్జెక్టుకు మూడు, నాలుగు లెక్చరర్ సాంక్షన్డ్  పోస్టులు ఉన్న చోట ఒకటి, రెండు పోస్టులకు కుదిస్తూ వచ్చారు. లెక్చరర్, స్టూడెంట్ రేషియో 1:30 ఉండాల్సి ఉండగా దీనిని 1:90గా పెంచడంతో లెక్చరర్ల సంఖ్య సగానికి పైగా తగ్గిపోయింది. అయినప్పటికీ ఇప్పటికే పని చేస్తున్న కాంట్రాక్ట్ లెక్చరర్లు పోనూ ఇంకా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 125 డిగ్రీ కాలేజీల్లో 1,138 డిగ్రీ లెక్చరర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. నిరుడు ఈ పోస్టుల్లో గెస్ట్ లెక్చరర్ల నియామకానికి నోటిఫికేషన్​ కూడా ఇచ్చారు. కానీ తాజాగా రాష్ట్ర ఆర్థిక శాఖ ఇచ్చిన ఉత్తర్వుల్లో కంప్యూటర్​ సైన్స్ మినహా మిగతా అన్ని పోస్టుల్లో భారీగా కోత పెట్టారు. కేవలం 491 పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. గెస్ట్ లెక్చరర్​ నోటిఫికేషన్​లో ఇచ్చిన ఖాళీల ప్రకారం చూస్తే ఇంగ్లీష్​–203 పోస్టులుంటే 23 పోస్టులకు కుదించారు. తెలుగులో 155 పోస్టులకు గాను  27 పోస్టులున్నట్లే చూపించారు. 141 కామర్స్​ పోస్టులను పూర్తిగా రద్దు చేశారు. అలాగే పొలిటికల్ సైన్స్​ 65, మ్యాథ్స్ 54, ​ ​హిస్టరీ 49, జువాలజీ సబ్జెక్ట్ 32 పోస్టులు ఖాళీగా ఉంటే ఒక్క పోస్టు భర్తీకి కూడా ఆర్థిక శాఖ అనుమతివ్వలేదు. మొత్తంగా 647 పోస్టులను ఎత్తేశారు. కంప్యూటర్​ సైన్స్​ పోస్టులు మాత్రం గతంలో 286 ఖాళీగా ఉంటే.. ఇప్పుడు ఆ సబ్జెక్టులో 311 పోస్టులు భర్తీ చేసేందుకు అనుమతిచ్చారు. అలాగే బిజినెస్ అడ్మినిస్ట్రేషన్​ లో 41 వెకెన్సీలకు 39, డేటా సైన్స్ లో 12కు 12, స్టాటిస్టిక్స్​ లో 23కు 23, బిజినెస్​ అనలిటిక్స్​ లో 8 పోస్టులకు ఎనిమిదింటిని భర్తీ చేసేందుకు అనుమతించారు. 

262 జేఎల్ పోస్టులకు ఎగనామం

రాష్ట్రంలోని 401 ప్రభుత్వ జూనియర్​ కాలేజీల్లో ఇప్పటికే పని చేస్తున్న 3,500 మంది కాంట్రాక్ట్ లెక్చరర్లు, వెయ్యి మంది రెగ్యులర్ లెక్చరర్లు పోను..   మరో1,654 లెక్చరర్‌‌‌‌‌‌‌‌ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ పోస్టుల్లో ప్రస్తుతం గెస్ట్​ లెక్చరర్లు పని చేస్తున్నారు. ఈ పోస్టులన్ని భర్తీ చేయాల్సి ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల 1,392 పోస్టుల భర్తీకే అనుమతించింది. మిగతా 262 పోస్టులకు కోతపెట్టడంపై నిరుద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వచ్చే ఒకటి, రెండేళ్లలో కొన్ని కాలేజీలను క్లోజ్​ చేయడం, సమీప కాలేజీల్లో విలీనం చేసే కుట్రలో భాగంగానే లెక్చరర్ పోస్టులను భర్తీ చేయట్లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. 

మూడ్రోజులకో కాలేజీలో డిగ్రీ లెక్చరర్లకు డ్యూటీలు..

ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా అన్ని డిగ్రీ కాలేజీల్లో పోస్టుల కొరత తీవ్రంగా వేధిస్తోంది. దీంతో లెక్చరర్లతో మూడు రోజులు ఒక కాలేజీలో, మరో మూడు రోజులు మరో కాలేజీలో క్లాసులు చెప్పిస్తున్నారు. దీంతో లెక్చరర్లు చాలా దూరంలోని కాలేజీలకు వెళ్లి రావాల్సి వస్తోంది. పరిస్థితి ఇలా ఉన్నా పూర్తి స్థాయిలో పోస్టుల భర్తీకి చర్యలు తీసుకోకపోవడంపై విమర్శలు వినిపిస్తున్నాయి.