అమ్మకానికి సర్కారు స్కీములు

అమ్మకానికి సర్కారు స్కీములు
  • లబ్ధిదారులతో బేరాలకు దిగుతున్న బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌ లీడర్లు
  • ముందుగానే అమౌంట్​తీసుకొని లిస్టుల తయారీ
  • అనర్హులకు స్కీమ్‌‌లు రావడంతో ఆందోళనకు దిగిన ప్రతిపక్షాలు


మహబూబ్​నగర్​, వెలుగు :సర్కారు స్కీమ్‌‌లను బీఆర్​ఎస్​ లీడర్లు అమ్ముకుంటున్నారు. మహబూబ్​నగర్​ జిల్లా దేవరకద్ర నియోజకవర్గంలో డబుల్​ బెడ్​ రూమ్​ ఇండ్లు, ‘దళితబంధు’ కావాలనుకునే వారితో బేరాలు కుదుర్చుకుంటున్నారు. ఇండ్లు కావాలంటే రూ.2 లక్షలు, దళితబంధు కావాలంటే రూ.50 వేల చొప్పున వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. అర్హులకు కాకుండా ఇండ్లు, బిల్డింగులు ఉన్న వారికే డబుల్​ బెడ్ ​రూమ్ ​ఇండ్లు మంజూరు చేయడం ఇందుకు బలం చేకూరుస్తోంది.  దీనిపై ప్రతిపక్షాలు వారం రోజులుగా ఆందోళన చేస్తున్నా బీఆర్‌‌‌‌ఎస్‌‌ లీడర్లు సైలెంట్‌‌‌‌గా ఉండడంపైనా అనుమానం కలుగుతోంది. 

 288 ఇండ్లు నిర్మాణం

భూత్పూర్​ మున్సిపాలిటీలోని సిద్ధాయిపల్లి వద్ద రూ.14 కోట్లతో ఐదు ఎకరాల స్థలంలో ‘జీ ప్లస్​టు’ పద్ధతిలో 288 ఇండ్లను కట్టారు.  నిరుడు జూన్ 4న ఈ బిల్డింగులను ఐటీ శాఖ మంత్రి కేటీఆర్​ ఓపెన్​ చేశారు. మొదట మహబూబ్​నగర్​-భూత్పూర్​ నాలుగు లేన్ల రోడ్డు విస్తరణలో ఇండ్లు కోల్పోయిన అమిస్తాపూర్‌‌‌‌‌‌‌‌కు చెందిన 42 మందికి లక్కీ డిప్​ ద్వారా ఇండ్లు ఇచ్చారు.  మిగిలిన ఇండ్లను నియోజకవర్గ లీడర్ ​కొందరు కౌన్సిలర్లకు హ్యాండోవర్​ చేశారు.  దీంతో వారు  నాన్​ లోకల్స్​, ఇది వరకే ఇండ్లు, జీ ప్లస్​ వన్​ బిల్డింగులు ఉన్న వారికి అమ్ముకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.  

రూ.50 వేలు ఇస్తేనే లిస్టులో పేరు

దేవరకద్ర నియోజకవర్గంలో 119 గ్రామ పంచాయతీలుండగా, ‘దళితబంధు’ కింద రెండు వేల యూనిట్లను మంజూరు చేశారు. ఇందులో చిన్న జీపీలకు ఐదు యూనిట్లు, పెద్ద జీపీలకు ఆరు యూనిట్ల చొప్పున కేటాయించారు. ఈ మేరకు అర్హుల లిస్టును తయారు చేయడంలో  నియోజకవర్గ లీడర్‌‌‌‌‌‌‌‌కు అత్యంత సన్నితుడైన ఓ వ్యక్తి  కీలకంగా వ్యవహరిస్తున్నట్లు తెలిసింది.  ఇప్పటికే భూత్పూర్​ మండలంలో ఈ స్కీం కావాలనుకునే వారి నుంచి రూ.50 వేల చొప్పున వసూలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.   

అంతా సైలెన్స్‌‌‌‌

డబుల్​బెడ్​ రూమ్​ ఇండ్ల పంపిణీ, దళితబంధులో అవినీతికి జరిగిందనే ఆరోపణలు రావడంతో రూలింగ్​ పార్టీ లీడర్లు సైలెన్స్​ అయ్యారు.  విషయం బయటికి వచ్చి వారం అవుతున్నా ఈ ఇష్యూపై మాట్లాడటం లేదు. ఈ విషయంలో నియోజకవర్గ లీడర్  క్యాడర్‌‌‌‌‌‌‌‌పై ఫైర్ అయినట్లు సమాచారం. సమస్య సద్దుమణిగే వరకు సైలెంట్‌‌‌‌గా ఉండాలని ఆదేశాలు ఇచ్చినట్లు తెలిసింది.  కాగా, దీనిపై ప్రతిపక్ష నేతలు ఆందోళనలు చేస్తున్నారు. ఈ నెల 3న  జిల్లా కాంగ్రెస్​ పార్టీ అధ్యక్షుడు జి.మధుసూదన్​రెడ్డి  ఆధ్వర్యంలో లబ్ధిదారులు భూత్పూర్​మున్సిపాలిటీ నుంచి కలెక్టరేట్​వరకు పాదయాత్ర నిర్వహించారు. ఈ నెల 5వ తేదీ నుంచి ఇదే ఇష్యూపై బీజేపీ లీడర్లు అమిస్తాపూర్​ వద్ద నిరాహార దీక్షలు చేపట్టారు.  ఆపార్టీ లీడర్లు పాలమూరు సీడ్స్​సుదర్శన్​రెడ్డి, డోకూరు పవన్​కుమార్​రెడ్డి సంఘీభావం తెలిపి దీక్షలో పాల్గొన్నారు.

మున్సిపాలిటీ తీర్మానం ప్రకారమే కేటాయింపు

లబ్ధిదారులు డబుల్​బెడ్ రూమ్​ ఇండ్ల కోసం చేసుకున్న అప్లికేషన్ల ఆధారంగా ఆర్‌‌‌‌‌‌‌‌ఐలు డోర్​టు డోర్​ వెరిఫికేషన్​చేసిన్రు. ఎలిజబుల్​ఉన్న వారి లిస్టును మున్సిపాలిటీలో తీర్మానం చేశారు. దాని ప్రకారం లక్కీ డిప్​ ద్వారా ఇండ్లు కేటాయించినం. అనర్హులకు ఇండ్లు కేటాయించారనే ఆరోపణలు కరెక్టో? కాదో? కలెక్టర్ ఎంక్వైరీ చేస్తారు.  ఏమన్న తప్పులు జరిగి ఉంటే వాటిని క్యాన్సిల్​ చేస్తారు.​ 
- చెన్న కిష్టయ్య, తహసీల్దార్​, భూత్పూర్


ఈ బిల్డింగ్‌‌‌‌  భూత్పూర్​ మున్సిపాలిటీ పరిధిలోని బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌ లీడర్‌‌‌‌‌‌‌‌ బంధువుది. ఈమెకు ఈ బిల్డింగ్‌‌‌‌తో పాటు సొంత భూమి కూడా  ఉంది. అయినా రూలింగ్​పార్టీ లీడర్లు ఆమెను  లిస్టులో చేర్చి డబుల్​ బెడ్​ రూమ్​ఇల్లు కేటాయించారు. హైదరాబాద్‌‌‌‌లోఉండే  ఈమె యారాలుకు కూడా ఇల్లు ఇచ్చారు


ఈమె పేరు పంతగని వెంకటమ్మ. భూత్పూర్ మున్సిపాటీలోని సిద్దాయపల్లి సొంతూరు. 14 ఏండ్ల కిందట భర్త బాలస్వామి చనిపోయాడు. కొడుకు యాదగిరి ప్రస్తుతం పాలమూరులో ఇంటర్ చదువుకుంటున్నాడు. వెంకటమ్మ కూలి పనులు చేసుకుంటూ కొడుకును పోషిస్తోంది. వీరికి సొంతిల్లు లేదు. ఊళ్లోనే గుడిసె వేసుకొని ఉంటున్నారు. ఏడాది కిందట డబుల్ బెడ్ రూమ్ కోసం అప్లై చేసుకున్నారు. కానీ, ఇంత వరకు ఇల్లు ఇవ్వలేదు.