
- కొత్త విద్యాసంవత్సరం నుంచే ప్రారంభం
హైదరాబాద్,వెలుగు: రాష్ట్రంలోని సర్కారు విద్యాసంస్థల్లో చదివే విద్యార్థులకు కెరీర్ గైడెన్స్ అందించాలని సర్కారు నిర్ణయం తీసుకున్నది. దీనికోసం ప్రత్యేకంగా మండలానికొక అకడమిక్ కౌన్సెలర్‌ను నియమించాలని డిసైడ్ అయింది. దీనికి కేంద్ర ప్రభుత్వ సహకారం కూడా తీసుకుంటుంది. జూన్‌లో ప్రారంభమయ్యే కొత్త అకడమిక్ ఇయర్ నుంచి ఈ ప్రక్రియ ప్రారంభం కానున్నది.
రాష్ట్రంలో స్కూల్ ఎడ్యుకేషన్ పరిధిలో 26,856 సర్కారీ విద్యా సంస్థలున్నాయి. ఇందులో సుమారు 19.40 లక్షల మంది చదువుతున్నారు. ఏటా సుమారు 2 లక్షల మంది పదో తరగతి పూర్తి చేసుకుంటున్నారు. వీరికి కెరీర్‌పై సరైన గైడెన్స్ లేక చాలామంది చదువులు మానేస్తున్నారు. కొందరు వారికి నచ్చని చదువుల వైపు వెళ్తున్నారు.
టెన్త్, ఇంటర్ పూర్తయ్యాక ఏ కోర్సు చదివితే ఎలాంటి భవిష్యత్ ఉంటుందోనన్న దానిపై స్టూడెంట్లకు వివరించనున్నారు. అయితే, దీనిపై స్టూడెంట్ల నుంచి వచ్చిన ఫీడ్‌బ్యాక్‌తో ప్రత్యేకంగా కెరీర్ అకడమిక్ కౌన్సెలర్లను నియమించాలని సర్కారు నిర్ణయం తీసుకున్నది. ఇదే విషయమై సమగ్ర శిక్ష కింద ప్రత్యేకంగా నిధులు కేటాయించాలని కేంద్రాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం కోరింది. దీనికి కేంద్రం సమగ్ర శిక్ష కింద నిధులు ఇచ్చేందుకు అంగీకరించింది.
త్వరలోనే నియామకం..
అకాడమిక్ కౌన్సెలర్ల నియామకాన్ని విద్యాశాఖ చేపట్టనున్నది. ఒక్కొక్కరికి రూ.12 వేల నుంచి రూ.15 వేల వరకు వేతనం ఇచ్చే అవకాశం ఉంది. అయితే, వీరిని ఏజెన్సీ ద్వారా తీసుకోవాలా లేక నేరుగా విద్యాశాఖ ద్వారానే రిక్రూట్ చేసుకోవాలా అనే దానిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోలేదు. సమగ్ర శిక్ష నుంచి అధికారికంగా ప్రోగ్రామ్ అప్రూవల్ బోర్డు (పీఏబీ) మినిట్స్ రాగానే కౌన్సెలర్ల నియామకం ప్రారంభమయ్యే అవకాశం ఉంది. కెరీర్ గైడెన్స్‌పై కోర్సులు చేసిన వారికి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలని అధికారులు భావిస్తున్నారు.