ప్రతిష్టాత్మకంగా ‘మన ఊరు మన బడి’

ప్రతిష్టాత్మకంగా ‘మన ఊరు మన బడి’
  • సకల సదుపాయాలతో, సర్వాంగ సుందరంగా సర్కార్ బడులు
  • మీరు చదివిన పాఠశాలల రుణం తీర్చుకోండి
  • విడతల వారీగా పాఠశాల అభివృద్ధి: మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు

జనగామ: ‘మన ఊరు మన బడి’ పేరిట ప్రభుత్వ పాఠశాలలను బాగు చేసే పనిని సీఎం కేసీఆర్ నేతృత్వంలోని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిందని, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ప్రజలు ముందుకు రావాలని రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామాణాభివృద్ధి, మంచి నీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పిలుపునిచ్చారు. పాలకుర్తి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాలలో బాల వికాస ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థులకు కోవిడ్ కిట్లు, సానిటైజర్లను అందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... రాష్ట్రవ్యాప్తంగా మొత్తం రూ.7,289 కోట్ల వ్యయంతో ‘మన ఊరు మన బడి’ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నట్లు తెలిపారు. అందులో భాగంగా ఈ ఏడాది రూ.3,497 కోట్ల వ్యయంతో రాష్ట్రంలోని 9,123 ప్రభుత్వ పాఠశాలలను బాగు చేస్తున్నామన్నారు. ఆయా పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనతో పాటు నాణ్యమైన విద్యను అందించాలనే సంకల్పంతో  ఈ కార్యక్రమాన్ని అమలు చేయనున్నట్లు మంత్రి తెలిపారు. 

ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ విద్య అమలు, విద్యుదీకరణ, తాగునీటి సరఫరా, ఫర్నీచర్, అవసరమైన మరమ్మతులు, పాఠశాలలకు రంగులు, గ్రీన్ చాక్ బోర్డ్ల ఏర్పాటు, మరుగుదొడ్లు, ప్రహరీ గోడ, కిచెన్ షెడ్లు, అదనపు తరగతి గదుల నిర్మాణం, డైనింగ్ హాల్ల ఏర్పాటు వంటి సదుపాయాలు కల్పిస్తామన్నారు. పాఠశాలల అభివృద్ధికి పూర్వ విద్యార్థులు, ఎన్ఆర్ఐలు, దాతలు సహకరించాలని కోరారు. ఈ సందర్భంగా పాఠశాల అభివృద్ధికి తమ వంతుగా  రూ.20 వేల విరాళం అందించిన ఆ పాఠశాల నైట్ వాచ్మేన్ భిక్షపతి, ఎన్ఆర్ఐ మెతుకు ఉపేందర్లను మంత్రి అభినందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ శివలింగయ్య, పాలకుర్తి, కొడకండ్ల, దేవరుప్పుల మండలాల ఎంపీపీలు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచ్లు, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తల కోసం..

భజ్జీకి ఆప్ బంపర్ ఆఫర్ 

తెలంగాణ ద్రోహి పోచారం శ్రీనివాస్ రెడ్డి