మక్కలను సర్కారే కొనాలె

మక్కలను సర్కారే కొనాలె

మక్కలను సర్కారే కొనాలె

సర్కారు కావాలనే కొనడం లేదని విమర్శలు

వెంటనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేయాలని డిమాండ్​

పది జిల్లాల్లో ప్రధానంగా మక్కల సాగు

రైతుసంఘాల పిలుపుతో 23న మహాధర్నాకు ఏర్పాట్లు

జగిత్యాల, వెలుగు: మక్కలను సర్కారే కొనాలని, వెంటనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేసి కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర చెల్లించాలని రైతులు డిమాండ్​ చేస్తున్నారు. తాము తప్పనిసరి పరిస్థితుల్లో నీటి వసతి లేనిచోట, పసుపులో అంతరపంటగా మాత్రమే వేశామని చెబుతున్నారు. కానీ ప్రభుత్వం తమ మాట వినకుండా మక్క సాగు చేశారనే ఒకే ఒక కారణంతో తమపై కక్ష తీర్చుకోవడం ఎంతవరకు కరెక్ట్​ అని ప్రశ్నిస్తున్నారు. మక్కను ప్రధాన పంటగా కాకుండా పసుపు, పత్తి తదితర పంటల్లో  అంతరపంటగా వేసుకోవచ్చని మొదట చెప్పిన సర్కారు, ఇప్పుడు మాట తప్పుతోందని రైతు సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం దిగిరాకుంటే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమిస్తామని హెచ్చరిస్తున్న రైతులు ఇందులో భాగంగా జగిత్యాలలో ఈ నెల 23న మహాధర్నాకు రెడీ అవుతున్నారు.

తప్పనిసరి పరిస్థితుల్లో మక్క సాగు

ఈ వానాకాలం సీజన్ లో రాష్ట్రవ్యాప్తంగా కోటీ35 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగుచేయగా, కేవలం 2.25 లక్షల ఎకరాల్లో( 1.6 శాతం) మాత్రమే రైతులు మక్కవేశారు. ప్రధానంగా జగిత్యాల, నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, సిద్దిపేట, రంగారెడ్డి, వికారాబాద్, ఆదిలాబాద్, మంచిర్యాల, వరంగల్ తదితర జిల్లాల్లో సాగునీటి వసతి సరిగ్గా లేనిచోట మాత్రమే మక్కలు పండించారు. జగిత్యాల, నిజామాబాద్​ జిల్లాల్లో చాలామటుకు పసుపులో అంతర పంటగా సాగు చేశారు. కామారెడ్డి జిల్లాలోని తాడ్వాయి, గాంధారి,  కామారెడ్డి,  రాజంపేట, భిక్కనూరు, దోమకొండ, సదాశివనగర్, రామారెడ్డి,  జుక్కల్ తదితర మండలాల్లో సరైన నీటివనరులు లేకపోవడంతో కేవలం వర్షాల మీదే ఆధారపడి మక్క సాగు చేశారు. పూర్తిస్థాయిలో సాగుచేసిన చోట ఎకరాకు 25 క్వింటాళ్ల చొప్పున, అంతరపంటగా వేసిన చోట 10 నుంచి 15 క్వింటాళ్ల దిగుబడి వస్తుందని రైతులు చెబుతున్నారు. మొత్తంగా 7.5 లక్షల టన్నుల దిగుబడి వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

సీఎం ప్రకటనతో దళారుల దందా

ప్రభుత్వం తరఫున మక్కలు కొనేదిలేదని సీఎం కేసీఆర్​ ప్రకటించడం దళారులకు కలిసివచ్చింది. వాస్తవానికి కేంద్ర ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించిన పంటల లిస్టులో మొక్కజొన్న కూడా ఉంది. క్వింటాలుకు  రూ.1,850 గా  నిర్ణయించింది. అన్ని జిల్లాల్లోనూ పంట చేతికి వస్తున్నా రాష్ట్ర సర్కారు మాత్రం మొండిగా వెళ్తోంది. గతంలో మార్క్​ఫెడ్​ ద్వారా కొనుగోళ్లు జరిపేది. కానీ ఈసారి ఎక్కడా  కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం లేదు. ఇదే అదనుగా దళారులు తెరపైకి వచ్చారు.  గ్రామాల్లో తిరుగుతూ.. ఈసారి ప్రభుత్వం మక్కలు కొనబోదని, తమకు అమ్మడం తప్ప వేరే ఆప్షన్​ లేదని చెబుతున్నారు. అంతా సిండికేట్​గా మారి క్వింటాలుకు రూ.1,000 నుంచి రూ.1,200 వరకు కొంటున్నారు. ఇప్పుడు అమ్మకుంటే తర్వాత ఈ ధర కూడా రాదని రైతులను భయపెడుతున్నారు. మరోవైపు విడవని వర్షాలు, నిల్వ ఫెసిలిటీస్​ లేక కొందరు రైతులు దళారులకు తక్కువ ధరకే అమ్మేసుకుంటున్నారు. ప్రభుత్వం కొనుగోలు చేయకుంటే ఏ లెక్కన చూసినా ఈసారి మక్క రైతులు  సుమారు రూ.500 కోట్ల మేర నష్టపోనున్నారు. దీంతో తమకు న్యాయం చేయాలని రోడ్డెక్కుతున్నారు. మద్దతు ధరకు సర్కారే మక్కలను కొనాలని డిమాండ్​ చేస్తూ గత శుక్రవారం మెట్ పల్లిలో జగిత్యాల, నిజామాబాద్ జిల్లాల రైతులు భారీ ధర్నా చేపట్టినా ప్రభుత్వ పెద్దల్లో స్పందన కనిపించలేదు.

ఇలా చేస్తే బెటర్

గతేడాది మక్కలు బాగా పండడంతో గోదాముల్లో చాలా నిల్వలు పేరుకుపోయాయని ప్రభుత్వం చెబుతోంది. మరోవైపు రాష్ట్రంలోని పౌల్ట్రీ పరిశ్రమకు కావాల్సిన ఫీడ్ ను మాత్రం విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. బిహార్, జార్ఖండ్, మధ్యప్రదేశ్ నుంచి కూడా తెప్పించుకుంటున్నారు. ఇలా విదేశాలనుంచి, ఇతర రాష్ట్రాల నుంచి ఫీడ్​ను దిగుమతి చేసుకోకుండా రాష్ట్ర ప్రభుత్వమే రైతుల నుంచి మక్కలను కొనాలని రైతు సంఘాలు సూచిస్తున్నాయి. అంతేగానీ మక్కలకు డిమాండ్ లేదన్న సర్కారు మాటల్లో ఏమాత్రం నిజం లేదని రైతులు అంటున్నారు. ఒకవేళ అదే కరెక్ట్ అయితే పెద్దసంఖ్యలో దళారులు గ్రామాల్లో తిరుగుతూ రైతుల దగ్గర మక్కలు ఎందుకు కొంటున్నారని ప్రశ్నిస్తున్నారు.

దిగిరాకుంటే రైతు ఉద్యమం

మక్కలను ప్రభుత్వమే కొనాలని డిమాండ్​ చేస్తూ  రైతు సంఘాల పిలుపు మేరకు జగిత్యాల, నిజామాబాద్ జిల్లాల రైతులు ఈ నెల 23న జగిత్యాల  కలెక్టరేట్ ముందు మహాధర్నాకు రెడీ అవుతున్నారు. అప్పటికీ ప్రభుత్వం దిగి రాకుంటే రాష్ట్రమంతా రైతు ఉద్యమం చేపడతామని  ప్రకటించారు.

అంతర పంటనైనా కొనరా?

రాష్ట్ర ప్రభుత్వం షరతుల సాగులో భాగంగా పసుపు, కంది, మిర్చి వేయాలని రైతులకు  చెప్పింది. ఈ పంటలకు ఎక్కువ పెట్టుబడి అవసరం కాబట్టి రైతులకు గిట్టుబాటు అయ్యేందుకు అంతర పంటగా మొక్కజొన్న వేయక తప్పని పరిస్థితి నెలకొంది. దీంతో ఎక్కడికక్కడ ఆఫీసర్లు ప్రధాన పంటగా కాకుండా అంతరపంటగా మక్క వేసుకోవచ్చని చెప్పడం వల్లే తాము మక్క సాగుచేశామని రైతులు అంటున్నారు. కనీసం ఇలా పండించిన మక్కలనైనా కొనకపోవడం అన్యాయమని వాపోతున్నారు.  గత వారం కురిసిన వానలకు 30 శాతం వరకు పంట దెబ్బతింది. కొన్నిచోట్ల కంకులకు మొలకలు వచ్చాయి. ఇటు వాన.. అటు ప్రభుత్వ తీరుతో నష్టపోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

అంతర్ పంటనైనా కొనండి

ప్రభుత్వం నియంత్రిత సాగులో భాగంగా  పసుపు, కంది, మిర్చి వేయమంటే వేసినం. ఖర్చు తగ్గించుకునేందుకు   అంతర పంటగా మొక్కజొన్న వేసినం. ఈ మక్కలైనా ప్రభుత్వం కొనాలె. లేదంటే తిరుగుబాటు చేయక తప్పదు.
– పన్నల తిరుపతి రెడ్డి, రైతు ఐక్యవేదిక అధ్యక్షుడు జగిత్యాల జిల్లా

తక్కువ ధరకే అమ్ముకుంటున్నం

పసుపు పంటకు పెట్టుబడి ఎక్కువ.  ఖర్చు కలిసొస్తదని చాలా ఏండ్ల నుంచి పసుపులో అంతరపంటగా మొక్కజొన్న పండిస్తున్నం. ఈసారి ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు స్టార్ట్​ చేయలేదని దళారులు తక్కువ ధరకే మక్కలు కొంటున్నరు. రైతులను నిండా ముంచుతున్నరు. వానలు పడుతుండడ వల్ల కల్లాల్లో మక్కలు తడిసిపోతాయన్న భయంతో తక్కువ ధర ఇచ్చినా అమ్ముకుంటున్నం. క్వింటాలుకు రూ.900ల నుంచి రూ. 1,200 మాత్రమే ఇస్తున్నరు.

– మునిగె గంగారెడ్డి, తొర్తి గ్రామం, యెర్గట్ల మండలం, నిజామాబాద్​

For More News..

రేపట్నుంచి ఏపీకి ఆర్టీసీ బస్సులు?

కరోనా సోకి డ్యూటీకి రాని కాంట్రాక్ట్‌‌ ​లెక్చరర్లకు జీతం కట్​

ధరణిలో ఎక్కని ఆస్తులు 20 లక్షలు.. మంగళవారంతో ముగిసిన గడువు