
న్యూఢిల్లీ: భారత చమురు సంస్థలు రష్యా నుంచి ముడి చమురు దిగుమతులను నిలిపివేస్తున్నాయన్న వార్తలను ప్రభుత్వ వర్గాలు ఖండించాయి. భారతదేశ ఇంధన నిర్ణయాలు మార్కెట్ పరిస్థితులు, జాతీయ ప్రయోజనాల ఆధారంగా ఉంటాయని స్పష్టం చేశాయి. ఇటీవల కొన్ని అంతర్జాతీయ మీడియా సంస్థలు, భారతీయ చమురు కంపెనీలు రష్యా నుంచి ముడి చమురు దిగుమతులను నిలిపివేస్తున్నాయని తెలిపాయి. అయితే, ఈ వార్తలను భారత ప్రభుత్వ వర్గాలు తోసిపుచ్చాయి. భారతదేశం తన ఇంధన అవసరాలను తీర్చుకోవడానికి వివిధ దేశాల నుంచి ముడి చమురును దిగుమతి చేసుకుంటుందని, ఇందులో రష్యా ఒక ముఖ్యమైన భాగస్వామి అని సంబంధిత అధికారులు పేర్కొన్నారు.
రష్యా-–ఉక్రెయిన్ యుద్ధానికి ముందు, భారతదేశం మొత్తం ముడి చమురు దిగుమతుల్లో రష్యా వాటా ఒకశాతం కంటే తక్కువగా ఉండేది. అయితే, 2024-–25 ఆర్థిక సంవత్సరంలో ఇది 36శాతానికి చేరుకుంది. దీనితో రష్యా భారతదేశానికి అతిపెద్ద చమురు సరఫరాదారుగా మారింది. 2024-–25 ఆర్థిక సంవత్సరంలో భారతదేశం రష్యా నుంచి 87.4 మిలియన్ టన్నుల ముడి చమురును దిగుమతి చేసుకుంది. ఇది భారతదేశం మొత్తం చమురు దిగుమతులు 244 మిలియన్ టన్నులలో 36శాతం వాటాకు సమానం. జూన్ 2025లో, భారతదేశం రష్యా నుంచి రోజుకు 2.08 మిలియన్ బ్యారెల్స్ ముడి చమురును దిగుమతి చేసుకుంది. ఇది 11 నెలల గరిష్ట స్థాయి.
కోట్ల రూపాయలు ఆదా...
రష్యా తన చమురుపై డిస్కౌంట్లు ఇవ్వడం వల్ల మనదేశం భారీగా డబ్బును ఆదా చేయగలిగింది. 2024లో, భారతదేశం రష్యా నుంచి 49 బిలియన్ యూరోల విలువైన ముడి చమురును కొనుగోలు చేసింది. ఈ చమురును దిగుమతి చేసుకోవడం ద్వారా భారతదేశం దాదాపు రూ. 35 వేల కోట్లు ఆదా చేసిందని ఒక రిపోర్ట్ పేర్కొంది.
ఈ ఏడాది జులైలో భారతదేశం రష్యా నుంచి చమురు దిగుమతులను తగ్గించి, అమెరికా, మిడిల్ఈస్ట్, ఆఫ్రికా వంటి ఇతర దేశాల నుంచి దిగుమతులను పెంచింది. ఈ నెలలో రష్యా నుంచి దిగుమతులు 1.5 మిలియన్ బ్యారెల్స్‌కి పడిపోయాయి. ఇది జూన్ నెలలో దిగుమతులతో పోలిస్తే 22–-27శాతం తక్కువ.