టైగర్ టూరిజంపై ఫోకస్! రిజర్వ్ ఫారెస్ట్ల అభివృద్ధికి రూ.875 కోట్లు.. కవ్వాల్‌‌, మన్ననూరులో పులుల సంరక్షణకు చర్యలు

టైగర్ టూరిజంపై ఫోకస్! రిజర్వ్ ఫారెస్ట్ల అభివృద్ధికి రూ.875 కోట్లు..  కవ్వాల్‌‌, మన్ననూరులో పులుల సంరక్షణకు చర్యలు
  • పర్యాటకులను ఆకర్షించేలా ఎకో టూరిజం ప్రాజెక్టులు
  • అటవీ ప్రాంతాల్లో మౌలిక వసతులు, సఫారీలకు పెద్దపీట

హైదరాబాద్, వెలుగు : రాష్ట్రంలో అడవులకు పూర్వ వైభవం తీసుకురావడంతో పాటు పులులు, ఇతర వన్యప్రాణుల సంరక్షణే ధ్యేయంగా ప్రభుత్వం ‘టైగర్‌‌‌‌ టూరిజం’కు సిద్ధమైంది. కవ్వాల్, మన్ననూర్‌‌‌‌ టైగర్‌‌‌‌ రిజర్వ్‌‌‌‌లలో పులులను సంరక్షించడంతో పాటు పర్యాటకులను ఆకర్షించేందుకు వీలుగా  రూ. 875 కోట్లతో భారీ యాక్షన్‌‌‌‌ ప్లాన్‌‌‌‌ రెడీ చేసింది. ఈ నిధులతో ఆయా చోట్ల పులులు స్థిర నివాసం ఏర్పాటు చేసుకునేలా అన్ని చర్యలు తీసుకోనుంది. పులి ఒక్కసారి దాని టెరిటరీ ఏర్పాటు చేసుకుంటే.. వాటి సంతతి వృద్ధి చెందుతుందని ప్రభుత్వం భావిస్తోంది. ఈ ప్లాన్‌‌‌‌ సక్సెస్‌‌‌‌ అయితే ఈ రెండు టైగర్​జోన్లలో సఫారీలను ఏర్పాటు చేయడం ద్వారా అంతర్జాతీయ స్థాయిలో పర్యాటకులను ఆకర్షించేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. 

పులుల సంతతి పెంచడంలో భాగంగా..

కవ్వాల్‌‌‌‌ టైగర్‌‌‌‌ రిజర్వ్ ఫారెస్ట్‌‌‌‌ మంచిర్యాల, నిర్మల్, ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాల్లో విస్తరించి ఉంది. దీని విస్తీర్ణం సుమారు 2,015.44 చదరపు కిలోమీటర్లు. ఇందులో కోర్‌‌‌‌ ఏరియా 892.23 చదరపు కిలోమీటర్లు కాగా బఫర్‌‌‌‌ జోన్‌‌‌‌ 1,123.21 చదరపు కిలోమీటర్లు. వన్యప్రాణలు, పులులు, చిరుతపులులకు ఆవాసానికి ఈ ప్రాంతం అనుకూలంగా ఉంటుంది. కవ్వాల్‌‌‌‌ టైగర్‌‌‌‌ రిజర్వ్‌‌‌‌ అనేది.. మహారాష్ట్రలోని తాడోబా- అంధేరి టైగర్‌‌‌‌ రిజర్వ్‌‌‌‌ను ఛత్తీస్‌‌‌‌గఢ్‌‌‌‌లోని ఇంద్రావతి రిజర్వ్‌‌‌‌తో కలుపుతూ సెంట్రల్ ఇండియన్ టైగర్ ల్యాండ్‌‌‌‌స్కేప్‌‌‌‌లో కీలకమైన భాగం. ఈ టైగర్‌‌‌‌ కారిడార్‌‌‌‌లో తాడోబా నుంచి పులులు రాకపోకలు సాగిస్తున్నాయి. ఉత్తర తెలంగాణలో ప్రస్తుతం ఆరేడు పులులు ఆవాసం ఏర్పాటు చేసుకున్నాయి. 

ఇక నాగర్‌‌‌‌ కర్నూల్‌‌‌‌ జిల్లాలోని అమ్రాబాద్‌‌‌‌ టైగర్‌‌‌‌ రిజర్వ్‌‌‌‌ పరిధిలోని నల్లమల అటవీ ప్రాంతంలో మన్ననూర్ రిజర్వ్‌‌‌‌ ఫారెస్ట్  ఉంది. ఇది హైదరాబాద్‌‌‌‌కు సుమారు 150 కిలోమీటర్ల దూరంలో ఉన్న అద్భుతమైన ఎకో -టూరిజం కేంద్రం. మన్ననూర్ జంగిల్ రిసార్ట్, సఫారీ రైడ్‌‌‌‌లు, దట్టమైన అడవుల్లో ట్రెక్కింగ్‌‌‌‌ వంటి సదుపాయాలు ఉన్నాయి. పర్యాటకులకు చిరుతపులులు, పులులు, వివిధ వన్యప్రాణులను చూసే అవకాశం ఉంది. దీంతో వీటిని మరింత అభివృద్ధి చేయడంతో పాటు పర్యాటకుల కోసం అత్యాధునిక సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా నిధులు కేటాయించింది. 

అంతేకాకుండా.. పులుల ఆవాసాలను సురక్షితం చేయడంతో పాటు వాటి సంతతి పెంచేందుకు చర్యలను చేపడుతోంది. ఇందులో భాగంగా అడవి లోపల నిరంతరం నిఘా ఉంచేందుకు వీలుగా ఫారెస్ట్ బీట్‌‌‌‌ ఆఫీసర్ల కోసం అన్ని రకాల వసతులతో కూడిన బేస్ క్యాంప్‌‌‌‌లను నిర్మించనున్నారు. అడవిలో అక్రమ ప్రవేశాలను అడ్డుకోవడానికి స్మార్ట్ కెమెరాలు, డ్రోన్ల సహాయంతో నిఘా పెంచనున్నారు. ఉచ్చులను గుర్తించేందుకు డాగ్‌‌‌‌ స్క్వాడ్‌‌‌‌లను రంగంలోకి దించనున్నారు. వేసవిలో నీటి కోసం వన్యప్రాణులు జనావాసాల్లోకి రాకుండా అడవిలోనే సోలార్‌‌‌‌ బోర్‌‌‌‌వెల్స్‌‌‌‌, సాసర పిట్స్ (కృత్రిమ నీటి కుంటలు) ఏర్పాటు చేస్తున్నారు. పులులకు ఆహారంగా ఉండే జింకలు, అడవి పందులు, నీల్గాయ్ వంటి జంతువుల సంఖ్యను పెంచేందుకు గడ్డి మైదానాలను అభివృద్ధి చేయనున్నారు. అటవీ సంరక్షణలో స్థానిక చెంచులను, గిరిజనులను టైగర్‌‌‌‌ ట్రాకర్స్‌‌‌‌గా నియమించి వారికి ఉపాధి కల్పించడంతో పాటు అటవీ సంరక్షణలో భాగస్వాములను చేయనున్నారు. 

పర్యాటక హబ్‌‌‌‌గా అమ్రాబాద్, కవ్వాల్

పర్యావరణానికి హాని కలగకుండా ప్రకృతి ప్రేమికులకు ప్రత్యక్ష అనుభూతిని అందించడమే ఎకో టూరిజం లక్ష్యం. ఈ రెండు రిజర్వ్‌‌‌‌ ఫారెస్ట్‌‌‌‌లలో సరికొత్త హంగులతో అత్యాధునిక ఎకో టూరిజం ప్రాజెక్టులను ప్రభుత్వం చేపట్టనుంది. పర్యాటకులు అడవి అందాలను ఆస్వాదిస్తూ అక్కడే బస చేసేందుకు వీలుగా మన్ననూరు, కవ్వాల్ ప్రాంతాల్లో పర్యావరణహిత కాటేజీలు, లగ్జరీ టెంట్లను నిర్మించేలా ప్రణాళికలు రూపొందించింది. వన్యప్రాణులను వీక్షించేందుకు ప్రత్యేక సఫారీ వాహనాలను అందుబాటులోకి తీసుకురానున్నారు. అటవీశాఖ ఆధ్వర్యంలో పర్యావరణానికి హాని కలుగకుండా ఎకో కాటేజీలను నిర్మించనున్నారు. 

పులుల జీవనశైలి, అటవీ ప్రాముఖ్యతను తెలిపేలా డిజిటల్ మ్యూజియంలు, ఇన్ఫర్మేషన్‌‌‌‌ సెంటర్లు ఏర్పాటు చేయనున్నారు. అడవిలోని బర్డ్‌‌‌‌ వాచింగ్‌‌‌‌ కోసం ప్రత్యేక మార్గాలను అభివృద్ధి చేయనున్నారు. అటవీ అందాలను వీక్షించేందుకు వీలుగా వ్యూ పాయింట్లు ఏర్పాటు చేయనున్నారు. టూరిజం ప్రాజెక్టుల ద్వారా స్థానిక ఆదివాసీలు, అటవీ ప్రాంత గ్రామాల ప్రజలకు ఉపాధి కల్పించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. హోటల్ మేనేజమెంట్‌‌‌‌, గైడింగ్, హ్యాండీక్రాఫ్ట్స్ వంటి రంగాల్లో స్థానిక యువతకు శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పించనున్నారు.  గైడ్లుగా, కాటేజీల నిర్వహణలోనూ యువతను భాగస్వాములను చేయనున్నారు.