భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: ఎస్సీ, ఎస్టీల సంక్షేమం, ఆర్థిక అభివృద్ధికి సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య అన్నారు. సోమవారం భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో పర్యటించిన ఆయన భద్రాచలంలోని సీతారామచంద్రస్వామి ఆలయాన్ని దర్శించుకుని, గిరిమార్ట్‌ను సందర్శించారు.
అనంతరం కలెక్టరేట్‌లో అధికారులతో అట్రాసిటీ కేసులు, రోస్టర్ విధానంపై సమీక్ష నిర్వహించారు. ఎస్సీ, ఎస్టీల భూ సమస్యలను పరిష్కరించేందుకు అధికారులు చొరవ చూపాలని సూచించారు.
2014 నుంచి ఇప్పటి వరకు జిల్లాలో 1,115 అట్రాసిటీ కేసులు నమోదయ్యాయని ఎస్పీ రోహిత్‌రాజు తెలిపారు. వీటిలో 51 కేసులు విచారణలో ఉండగా, 20 కేసుల్లో చార్జిషీట్లు దాఖలయ్యాయని వివరించారు.
అర్హులైన బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని బక్కి వెంకటయ్య అధికారులను ఆదేశించారు. ఈ ప్రోగ్రాంలో అడిషనల్ కలెక్టర్లు డి.వేణుగోపాల్, విద్యాచందన, ఐటీడీఏ పీవో రాహుల్, భద్రాచలం సబ్ కలెక్టర్ మృణాల్ సేన్, డీఆర్వో పద్మావతి, సీపీవో సునీత పాల్గొన్నారు.
