ఆ సారుకు గోడలే బోర్డులు.. గల్లీనే బడి..

ఆ సారుకు గోడలే బోర్డులు.. గల్లీనే బడి..

కరోనా.. లాక్‌‌డౌన్‌‌.. సెకండ్‌‌ వేవ్‌‌.. ఇప్పుడు థర్డ్‌‌ వేవ్‌‌ భయం. రెండేండ్ల నుంచి సర్కార్‌‌‌‌ బళ్లు బంద్‌‌. స్టూడెంట్ల పరిస్థితి?  పిల్లల్ని పట్టించుకునేటోడే లేడు. కానీ, కరీంనగర్ జిల్లా గంగాధర్‌‌‌‌ మండలం రంగారావుపల్లికి చెందిన ఓ సారు పిల్లల చదువు  ఆగం కావొద్దనుకున్నడు. కొత్త ఆలోచన చేసిండు. ‘ఎడ్యుకేషన్​ టు డోర్​స్టెప్’​ను షురూ జేసిండు.    

రంగారావుపల్లికి చెందిన సందెవేని రమాకాంత్ సర్కార్‌‌‌‌ బడిలో టీచర్‌‌‌‌. ప్రస్తుతం జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం రాంనగర్​ ప్రైమరీ స్కూల్​లో పనిచేస్తున్నడు. కరోనా వల్ల దాదాపు రెండేండ్ల నుంచి స్కూళ్లకు పోని పిల్లలకు ఊర్లనే పాఠాలు చెబుతున్నడు. ఇళ్ల గోడలనే బోర్డుగా చేసుకున్నడు. వాటిపై రంగు రంగుల చార్టులు, బొమ్మలు గీసి చదువు నేర్పిస్తున్నడు. ఆ ఊళ్లోని ప్రతి ఇల్లు, ప్రహరీగోడ, స్తంభాన్ని చదువుకునే పుస్తకం లెక్కనే తయారు చేసిండు. 

“నాకు పెయింటింగ్స్‌‌ వేయడం అలవాటు.  దాంతో రూ. 10 వేలు ఖర్చుపెట్టి,  సామాగ్రి కొని బొమ్మలు, అక్షరాలు, చార్టులు గీసిన. స్టూడెంట్స్‌‌ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ‘ఎడ్యుకేషన్​ టు డోర్​స్టెప్’​ అనే పేరుతో ఈ కార్యక్రమాన్ని షురూ చేసిన. రంగు రంగుల బొమ్మలతో చెప్పడంతో స్టూడెంట్స్‌‌ చదివేందుకు ఆసక్తి చూపిస్తున్నారు” అని సంతోషంగా చెప్పిండు ఈ సారు. ఆయన చేసిన ఈ పనిని డీఈవో జగన్మోహనరెడ్డి మెచ్చుకున్నడు. సారుకు వచ్చిన మంచి ఆలోచన వల్ల పిల్లలు మంచిగ చదువుకుంటున్నరని ఊళ్లోవాళ్లు ఆనంద పడుతున్నరు.      
::: బొల్లబత్తిని శ్రీనివాస్​, వెలుగు, గంగాధర