పుస్తకాలు వచ్చేశాయి..జిల్లాకు చేరిన ప్రభుత్వ పాఠ్య పుస్తకాలు

పుస్తకాలు వచ్చేశాయి..జిల్లాకు చేరిన ప్రభుత్వ పాఠ్య పుస్తకాలు
  • పంపిణీకి ఏర్పాట్లు చేస్తున్న విద్యాశాఖ

జనగామ, వెలుగు: గవర్నమెంట్ స్కూల్ కొత్త బుక్స్ వచ్చేశాయి. వచ్చే నెల 12 న స్కూల్స్ రీ ఓపెన్ కానున్న నేపథ్యంలో స్టూడెంట్లకు బుక్స్ సకాలంలో అందించేందుకు విద్యాశాఖ అధికారులు కసరత్తులు ముమ్మరం చేశారు. ఇప్పటికే సర్కారుకు పంపిన ఇండెంట్ తో బుక్స్ జిల్లాకు చేరుకున్నాయి. విద్యా సంవత్సరం ఆరంభించిన వెంటనే వీటిని స్టూడెంట్లకు అందించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. 

జిల్లాకు 2,29,630 బుక్స్

జనగామ జిల్లాలో ని 548 సర్కారు స్కూల్స్ ఉన్నాయి. వీటిలో మండల, జిల్లా ప్రజా పరిషత్ స్కూల్స్ కలిపి 508 ఉండగా, 19 గురుకులాలు, 12 కేజీబీవీ, 8 మోడల్ స్కూల్స్, ఒక యూఆర్​ఎస్ స్కూల్స్ ఉన్నాయి. వీటి పరిధిలో సుమారు 38,894 మంది స్టూడెంట్లు చదువుకుంటున్నారు. ఒకటి నుంచి పదో తరగతి వరకు చదివే ఈ స్టూడెంట్లు అందరికీ బుక్స్​ అందించనున్నారు. 

ఈ మేరకు జిల్లా మొత్తంగా అన్ని సబ్జెక్టులకు 2,29,630 బుక్స్​ అవసరమని జిల్లా విద్యాశాఖ అధికారులు ఇటీవల ఉన్నతాధికారులకు ఇండెంట్​ పంపించగా, శనివారం సాయంత్రం వరకు 1,79,920 బుక్స్ వచ్చాయి. వీటిని ప్రస్తుతం జిల్లా కేంద్రంలోని పాత డీఈవో ఆఫీస్ వద్ద గోడౌన్ లో భద్రపరిచారు. మరో 49,710 బుక్స్​ రావాల్సి ఉండగా, అవి కూడా త్వరలోనే వచ్చే చాన్స్ ఉన్నట్లు అధికారులు తెలిపారు. జిల్లా మొత్తంగా సింగిల్, అన్ రూల్డ్ నోట్ బుక్స్ 2,02,653 అవసరమని ఇండెంట్​ పెట్టగా, పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చాయి. వీటిలో 32,030 సింగిల్​ నోట్ బుక్స్​ ఉండగా, 1,70,623 అన్​ రూల్డ్ నోట్ బుక్స్ ఉన్నట్లు అధికారులు తెలిపారు.  

పంపిణీకి ఏర్పాట్లు..

గత విద్యాసంవత్సరం వంద శాతం పాఠ్య పుస్తకాలను పంపిణీ చేశారు. ఈ విద్యాసంవత్సరంలోనూ అందించాలని అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే బుక్స్​ జిల్లా కేంద్రానికి చేరగా, వీటిని ఈ నెలాఖరు వరకు లేదా వచ్చే నెల మొదటి వారంలో ఎంఈవోలకు అందించనున్నారు. ఆయా మండలాల స్టూడెంట్ల సంఖ్య ఆధారంగా స్కూళ్లకు కేటాయించిన బుక్స్​ను ఎంఈవోలు పాఠశాలల హెడ్మాస్టర్లకు అందించనున్నారు. వారు స్టూడెంట్లకు పంపిణీ చేయనున్నారు.  

స్కూల్స్ రీ ఓపెన్​ వరకు పంపిణీ పూర్తి
 
‌జిల్లాకు రావాల్సిన పాఠ్య పుస్తకాలు దాదాపుగా అందుబాటులోకి వచ్చాయి. మరో 49,710 బుక్స్​ రావాల్సి ఉంది. ఇవి కూడా త్వరలోనే రానున్నాయి. ఇప్పటికే ఎంఈవోలకు సమాచారం ఇచ్చాం. స్కూల్స్​ రీ ఓపెన్​ రోజు వరకు పుస్తకాలు, నోట్ బుక్​ల పంపిణీని పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం.

కే రాము, డీఈవో, జనగామ