వీఆర్ఏల సమస్యలను పట్టించుకోని ప్రభుత్వం

వీఆర్ఏల సమస్యలను పట్టించుకోని ప్రభుత్వం
  • మునుగోడు ఎన్నికల వేళ చర్చలకు పిలిచి.. ఇప్పుడు మొహం చాటేస్తున్న సర్కార్ పెద్దలు
  • నమ్మించి మోసం చేశారని వీఆర్ఏల ఆవేదన 

హైదరాబాద్, వెలుగు: కిందటేడాది జూలై 25 నుంచి అక్టోబర్ 14 వరకు 80 రోజుల పాటు వీఆర్ఏలు సుదీర్ఘ సమ్మె చేసినా ఫలితం లేకుండాపోయింది.. ఐదేళ్ల క్రితం ప్రగతి భవన్‌‌‌‌ వేదికగా ఉద్యోగాల క్రమబద్ధీకరణ, పే స్కేల్ వర్తింపుపై సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలు అమలు చేయాలని గొంతు చించుకున్నా స్పందన రాలేదు.. అయితే సరిగ్గా అదే సమయంలో మునుగోడు బైపోల్​ కూడా ఉండటంతో.. సమ్మె ప్రభావం దానిపై పడుతుందని కేసీఆర్​ సర్కారు భయపడింది. దీంతో వీఆర్ఏలను చర్చలకు పిలిచి రాష్ట్ర మంత్రులు బుజ్జగించారు. బై పోల్​ అయిపోగానే హామీల అమలుపై దృష్టిసారిస్తామని చెప్పింది. కానీ అలా జరగలేదు. వీఆర్ఏ సంఘాల నాయకులకు హామీ ఇచ్చిన రాష్ట్ర మంత్రులు మొహం చాటేశారు. దీంతో తాము మోసపోయామని వీఆర్ఏ సంఘాల జేఏసీ నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  సర్కారు పెద్దల హామీ మేరకు సమ్మె విరమించి మూడునెలలైనా.. ఇప్పటివరకు ఏ ఒక్క హామీ నెరవేరలేదని చెబుతున్నారు.  

పే స్కేల్ ప్రకటన హామీకి ఐదేళ్లు.. 

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత 2017 ఫిబ్రవరి 24న ప్రగతి భవన్‌‌‌‌లో వీఆర్ఏలతో నిర్వహించిన సమావేశంలో ఉద్యోగాలు క్రమబద్ధీకరిస్తామని, పే స్కేల్ వర్తింపజేస్తామని సీఎం కేసీఆర్ తొలిసారిగా హామీ ఇచ్చారు. కానీ పే స్కేల్‌‌‌‌కు బదులుగా గౌరవ వేతనాన్ని రూ.6,000 నుంచి రూ.10,500కు పెంచి చేతులు దులుపుకున్నారు. ఆ తర్వాత 2020 సెప్టెంబర్‌‌‌‌లో వీఆర్వో వ్యవస్థ రద్దు సందర్భంగా అసెంబ్లీ సాక్షిగా వీఆర్ఏలకు మినిమం పే స్కేల్ వర్తింపజేస్తామని మరోసారి హామీ ఇచ్చారు. పే స్కేల్ ఇస్తే ప్రభుత్వంపై అదనంగా రూ.260 కోట్ల భారం పడుతుందని, వృద్ధాప్యంలో ఉన్న వీఆర్ఏలు కోరుకుంటే వాళ్ల పిల్లలకు ఎవరికైనా వీఆర్‌‌ఏ ఉద్యోగం ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు.  కానీ ఇది జరిగి రెండేళ్లు దాటినా ప్రభుత్వం పట్టించుకోకపోవడం, నిరసనలు తెలిపినా స్పందనలేకపోవడంతో.. గతేడాది జూలై 25 నుంచి విధులు బహిష్కరించి సమ్మెకు దిగారు.

80 రోజుల చారిత్రక సమ్మె.. 

సీఎం కేసీఆర్ స్వయంగా పలు సందర్భాల్లో ఇచ్చిన హామీ నెరవేర్చకపోవడంతో వీఆర్ఏలు ఆందోళనకు దిగారు. జులై 25న ప్రారంభమైన సమ్మె అక్టోబర్ 14 వరకు కొనసాగింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత అత్యంత సుదీర్ఘకాలం సమ్మె చేసింది వీఆర్ఏలే. సమ్మె కాలంలో దీక్షా శిబిరాల్లో వివిధ రూపాల్లో నిరసనలు తెలపడంతోపాటు సీసీఎల్ ఏ ఆఫీసు, మినిస్టర్స్ క్వార్టర్స్, అసెంబ్లీ ముట్టడిలాంటి ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు. సెప్టెంబర్ 13న అసెంబ్లీ ముట్టడికి భారీగా వీఆర్ఏలు తరలిరావడం, మిలియన్ మార్చ్ తరహాలో ఆందోళనకు దిగడంతో రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ రంగంలోకి దిగి చర్చలకు పిలిచారు. అదే నెల 20న మరోసారి అప్పటి సీఎస్ సోమేష్ కుమార్ సమక్షంలో చర్చలు జరిపారు. సమ్మె విరమించాలని కోరితే.. పే స్కేల్ జీవో ఇచ్చేదాకా సమ్మె విరమించబోమని తేల్చిచెప్పారు. అక్టోబర్ నాటికి మునుగోడు ఎన్నికల ప్రచారం ఊపందుకోవడంతో వీఆర్ఏల సమ్మె ప్రభావం దానిపై ఉండొద్దనే ఉద్దేశంతో అక్టోబర్ 14న మరోసారి మంత్రులు కేటీఆర్, హరీష్ రావు ప్రగతి భవన్ లో వీఆర్ఏ జేఏసీ నాయకులతో సమావేశమై సమస్యలు పరిష్కరిస్తామని, తమపై నమ్మకం ఉంచాలని హామీ ఇచ్చారు. మునుగోడు ఎన్నికలు అయిపోగానే డిమాండ్స్ నెరవేరుస్తామని హామీ ఇవ్వడంతో సమ్మె విరమించి విధుల్లో చేరారు. ఇది జరిగి మూడు నెలలవుతున్నా మంత్రుల హామీలు నెరవేరలేదు. ఎన్నికల తర్వాత సదరు మంత్రుల అపాయింట్మెంట్ కూడా దొరకడం లేదని వీఆర్ఏ జేఏసీ నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

సీఎస్ ట్రాన్స్ ఫర్​తో మళ్లీ మొదటికి.. 

వీఆర్ఏల పే స్కేల్ డిమాండ్ పై పలుమార్లు రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా, సీసీఎల్ గా కొనసాగిన అప్పటి సీఎస్ సోమేష్ కుమార్ సమక్షంలోనే చర్చలు జరిపారు. సీఎం దృష్టికి వీఆర్ఏల సమస్యలను తీసుకెళ్తానని వీఆర్ఏ జేఏసీ నేతలకు పలు సందర్భాల్లో ఆయన హామీ ఇచ్చారు. ఈ క్రమంలోనే ఇటీవల హైకోర్టు ఆదేశాల మేరకు సోమేష్ కుమార్ ఏపీకి అలాట్ కావడం, కొత్త సీఎస్ రావడంతో వీఆర్ఏ ల సమస్యల పరిష్కారం మరికొంత ఆలస్యమయ్యే పరిస్థితి కనిపిస్తోందని వీఆర్ఏ జేఏసీ నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొత్త సీఎస్ అయినా మానవతా దృక్పథంతో వీఆర్ఏల సమస్యలు పరిష్కరించాలని కోరుతున్నారు.