ఆర్మూర్, వెలుగు: అన్ని హంగులతో ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్, వసతి గృహ సముదాయాల నిర్మాణాల కోసం స్థలం ఎంపిక చేస్తున్నట్లు కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. ఆర్మూర్ శివారులోని పిప్రి రోడ్డులోని స్థలం, అంకాపూర్ శివారులోని స్థలాన్ని స్థానిక అధికారులతో కలిసి కలెక్టర్ పరిశీలించారు.
ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మాణానికి అనువైన పరిస్థితులు, అనుకూల వాతావరణం, రవాణా సదుపాయం, భద్రత ఇతర అంశాలను పరిశీలించి, సమగ్ర వివరాలతో ప్రతిపాదనలు పంపాలని అధికారులను ఆదేశించారు.
ఇప్పటికే మంజూరైన ఆయా నియోజకవర్గాల్లో స్కూళ్ల నిర్మాణాలు ప్రారంభం అయ్యేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. కలెక్టర్ వెంట ఆర్మూర్ సబ్ కలెక్టర్ అభిజ్ఞాన్ మాల్వియ, ట్రైనీ కలెక్టర్ కరోలిన్ చింగ్తియాన్ మావీ, రెవెన్యూ, ఇంజినీరింగ్ విభాగాలకు చెందిన అధికారులున్నారు.
రైతులకు అందుబాటులో యూరియా..
జిల్లాలో ప్రస్తుత యాసంగి సీజన్ పంటల సాగు కోసం రైతుల అవసరాలకు సరిపడా యూరియా ఎరువుల నిల్వలు అందుబాటులో ఉన్నాయని, ఎరువుల విషయంలో ఎవరు కూడా ఆందోళనకు గురి కావాల్సిన అవసరం లేదని కలెక్టర్ ఇలా త్రిపాఠి భరోసా కల్పించారు. ఆర్మూర్ మండలం అంకాపూర్ సహకార సంఘం ఎరువుల గోడౌన్ ను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు.
గిడ్డంగిలో ఉన్న ఎరువుల నిల్వలను, స్టాక్ రిజిస్టర్, ఈ పాస్ యంత్రం ద్వారా ఎరువుల అమ్మకాల వివరాలు పరిశీలించారు. ప్రస్తుత యాసంగిలోనే కాకుండా వచ్చే ఖరీఫ్ సీజన్లో కూడా ఎరువుల కొరత ఉండదని కలెక్టర్ రైతులకు చెప్పారు. నానో యూరియా వాడకంపై రైతులు అవగాహన పెంపొందించుకోవాలన్నారు. గ్రామానికి చెందిన రైతు పంట పొలంలో డ్రోన్‌ను వినియోగిస్తూ నానో యూరియా ఎరువును పిచికారీ చేస్తున్న విధానాన్ని కలెక్టర్ రైతులతో కలిసి పరిశీలించారు..
భవిత సెంటర్ల నిర్మాణానికి ఫిబ్రవరి డెడ్‌లైన్
నిజామాబాద్: జిల్లాలో నిర్మిస్తున్న భవిత కేంద్రాల పనులు వచ్చేనెలాఖరుకు పూర్తి కావాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశించారు. మంగళవారం ఆమె కలెక్టరేట్లో మండల స్పెషల్ ఆఫీసర్లు, ఎంఈవోలతో మీటింగ్ నిర్వహించారు.
సొంత బిల్డింగ్లు పోను, 15 భవిత సెంటర్లు సర్కార్ స్కూల్ రూమ్స్‌లో నడుస్తున్నాయని, శిథిలావస్థలో ఉన్న ఏడు సెంటర్ల స్థానంలో కొత్తగా నిర్మించడానికి గవర్నమెంట్ నిధులు మంజూరు చేయగా, పనులు ఆలస్యం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నాణ్యతతో కూడిన పనులు ఫిబ్రవరికి పూర్తి చేయాలని డైడ్‌లైన్ విధించారు
