
ఎక్స్ ప్రెస్ వేలు, హైవేలపై వాహనాల గరిష్ట వేగ పరిమితి ఎంత ఉండాలి ? ప్రస్తుతమున్న వేగ పరిమితిలో మార్పులు చేయాలా ? అనే అంశాలపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ప్రస్తుతం జాతీయ రహదారులపై వాహనాల గరిష్ట వేగ పరిమితి గంటకు 100 కిలోమీటర్లు, ఎక్స్ ప్రెస్ వేలపై గరిష్ట వేగ పరిమితి గంటకు 120 కిలోమీటర్లు ఉంది. టాటా గ్రూప్ మాజీ చైర్మన్ సైరస్ మిస్త్రీ రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన ఘటనకు కారు అతివేగమే కారణమని దర్యాప్తులో తేలింది.ఈనేపథ్యంలో దేశవ్యాప్తంగా వాహనాల వేగ పరిమితిపై చర్చ మొదలైంది. దీంతో కేంద్ర సర్కారు సైతం ఈ అంశాన్ని సీరియస్ గా తీసుకుంది.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త బృందం
వాహనాల వేగ పరిమితిపై అధ్యయనం చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రతినిధులతో ఒక సంయుక్త బృందాన్ని ఏర్పాటు చేయాలని సర్కారు యోచిస్తున్నట్లు మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఏయే రకాల రోడ్లపై.. వాహనాల వేగ పరిమితి ఎంతమేరకు ఉండాలనే దానిపై ఈ బృందం అధ్యయనం చేసి ఒక నివేదికను సమర్పించనుంది. వాహనాల హార్స్న్ కు సంబంధించిన ప్రస్తుత నిబంధనలనూ ఈ అధ్యయన బృందం సమీక్షించి సిఫారసులు చేసే చాన్స్ ఉంది. ముఖ్యంగా శబ్ద కాలుష్యాన్ని తగ్గించేలా హార్స్న్ లో మార్పులు జరగాలని కేంద్రం వాదిస్తోంది. వాహనానికి 7.5 మీటర్ల దూరం నుంచే హార్న్ కొట్టొచ్చని.. హార్న్ సౌండ్ పరిమితి 93 నుంచి 112 డెసిబుల్స్ దాకా ఉండొచ్చని ప్రస్తుత నిబంధనలు చెబుతున్నాయి. ఈ అంశాలపై చర్చించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రతినిధులు ఈ నెలాఖరులోగా సమావేశం కావాలని కేంద్ర రోడ్డు రవాణా, హైవేల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఇటీవల పిలుపునిచ్చారు. జాతీయ రహదారులు, రాష్ట్ర రహదారులు, రెండు లేన్ల రోడ్లు, నాలుగు లేన్ల రోడ్లపై వాహనాల వేగ పరిమితిని సమీక్షించాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.