- రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీలు ప్రారంభం
రాజన్నసిరిసిల్ల, వెలుగు: క్రీడల్లో రాణిస్తే జీవితంలో వచ్చే సమస్యలను ధైర్యంగా ఎదుర్కోవచ్చని ప్రభుత్వ విప్ఆది శ్రీనివాస్అన్నారు. ఆటలు మానసికోల్లాసం, శారీరక దృఢత్వానికి దోహదం చేస్తాయని చెప్పారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని మినీ స్టేడియంలో ఆదివారం జిల్లా వాలీబాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన 8వ రాష్ట్రస్థాయి జూనియర్ వాలీబాల్ చాంపియన్షిప్పోటీలను ఆయన ప్రారంభించారు.
భవిష్యత్తులో క్రీడాకారులకు, రాష్ట్రస్థాయి పోటీల నిర్వహణకు తన వంతు సహాయ సహకారాలు ఉంటాయని పేర్కొన్నారు. కోరుట్ల, సిరిసిల్ల, వేములవాడ ప్రాంతాలకు స్టేడియాలు మంజూరు చేశామని, సిరిసిల్ల పట్టణంలోని బతుకమ్మ తెప్ప వద్ద స్థలాన్ని పరిశీలించినట్లు తెలిపారు.
గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో సీఎం కప్ పోటీలు నిర్వహించినట్లు గుర్తు చేశారు. వాలీబాల్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు గజ్జెల రమేశ్‌బాబు, జిల్లా అధ్యక్షుడు చెన్నమనేని శ్రీకుమార్, వాలీబాల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ హన్మంతరెడ్డి, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు చొప్పదండి ప్రకాశ్, సీనియర్ నాయకుడు గడ్డం నర్సయ్య, క్రీడాకారులు పాల్గొన్నారు.
